Thursday, April 18, 2024

టీకా పంపిణీకి కసరత్తు

- Advertisement -
- Advertisement -

Vaccine for front field staff

తొలుత కరోనా వారయర్లు సహా, 23% మందికి
వ్యాక్సిన్ సరఫరా ఎన్నికల సమయంలో పోలింగ్
తరహాలో టీకా పంపిణీకి ఏర్పాట్లు : మోడీ

న్యూఢిల్లీ : దేశంలో అత్యంత సమగ్రరీతిలో కరోనా టీకా పంపిణీకి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను ఖరారు చేస్తోంది. ఇప్పుడు మూడు వ్యాక్సిన్‌లలో రెండు అత్యంత కీలక పరీక్షల దశకు చేరాయి. వీటి సమర్థత తగు రీతిలో నిర్థారణ అయ్యే క్రమంలోనే వ్యాక్సిన్ పంపిణీకి సకల సన్నాహాలు చేయాలని సంకల్పించారు. ముందుగా దేశంలో అత్యంత తీవ్రస్థాయిలో వైరస్ ప్రభావిత అవకాశాలు ఉండే 23 శాతం మందికి ఈ కరోనా టీకా అందిస్తారు. తొలి దశలో ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యతాక్రమంలో వ్యాక్సిన్ సరఫరా జరుగుతుంది. పోలీసులు, పారిశుద్ధ్యకార్మికులకు కూడా ముందు వ్యాక్సిన్ చేరేలా చేస్తారు. వీరిలోనూ అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే వారిని గుర్తించి తొలుత వారికి టీకా మందు అందిస్తారు. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్రం తగురీతిలో కార్యాచరణను రూపొందించింది. వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా, దీని పంపిణీ ఏ విధంగా ఉండాలనేదానిపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఇందుకు నాలుగు కేటగిరిలను ఖరారు చేశారు.

 కేటగిరిలు ఇవే

1) దేశంలోని 50 నుంచి 70 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్
2) 2 కోట్ల మంది క్షేత్రస్థాయి సేవా సిబ్బంది (వీరిలో పోలీసు, మున్సిపల్, సైనిక బలగాలు)
3) 50 ఏళ్ల వయస్సు దాటిన 26 కోట్ల మంది
4) 50 ఏళ్ల తక్కువ వయస్సుండి వైరస్ ప్రభావితం అయిన వారు.
ఈ నాలుగు రకాల శ్రేణులను గుర్తించి సరైన విధంగా వారికి టీకా మందు పంపిణీ చేయాల్సి ఉందని కేంద్రం సంకల్పించింది.

కరోనాపై ఉదాసీనత తగదు వ్యాక్సిన్‌కు సన్నాహాలు

ఉన్నత స్థాయి సమీక్షలో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : ఇప్పటికీ పొంచి ఉన్న కరోనా వైరస్ పట్ల ఉదాసీనత తగదని ప్రధాని నరేంద్రమోడీ పౌరులకు పిలుపు నిచ్చారు. కోవిడ్ టీకా అందరికీ అందుబాటులోకి తేవాల్సి ఉందని , ఇందుకు పూర్తి సన్నాహాలు చేయాలని తెలిపారు. దేశంలో కోవిడ్ 19 మహమ్మారి పరిస్థితి, టీకా తయారీ, పంపిణీ వంటి అంశాలపై శనివారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ప్రధాని అధ్యక్షతన జరిగింది. ముందు తాను దేశ పౌరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఒక్కటే అని, ఎట్టిపరిస్థితుల్లోనూ వైరస్ పట్ల నిర్లక్షంగా వ్యవహరించరాదని,అన్ని విధాలుగా ఇప్పటి జాగ్రత్త చర్యలు కొనసాగిస్తూ వెళ్లాలనేదే అని ప్రధాని తెలిపారు. ఇక ఇప్పుడు ఈ వైరస్‌కు సరైన వ్యాక్సిన్‌ను తయారు చేయడం కీలక అంశం. ఇందుకు సరైన విధంగా సాధనాసంపత్తిని సమకూర్చుకోవలి. తరువాతి క్రమంలో ఈ వ్యాక్సిన్‌ను ప్రజలందరికీ వారి వారి అవసరాలను బట్టి అందించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని ప్రధాని అభిప్రాయపడ్డారు.

దేశంలో ఎన్నికల నిర్వహణ పద్ధతులు, విపత్తు నిర్వహణ దశలో అనుసరించే విధానాలనే అనుసరిస్తూ వ్యాక్సిన్‌ను అవసరమైన వారికి చేర్చేందుకు సన్నాహక పర్వం వేగవంతం కావాల్సి ఉందని ప్రధాని తెలిపారు. ఇది ఓ బృహత్తర కార్యక్రమం. ఇందులో అన్ని స్థాయిల ప్రభుత్వ వర్గాలను, పౌర బృందాలను అనుసంధానం చేసి ముందుకు సాగాల్సి ఉందన్నారు. వ్యాక్సిన్ సక్రమ నిర్వహణ అంశాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. దేశంలో కరోనా వైరస్ రోజువారి కేసులు క్రమేపీ తగ్గుతున్నాయని, వృద్ధి రేటు అదుపులోకి వచ్చిందని, ఇది ఘననీయ పరిణామం అని తెలిపారు. అయితే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిందనే ఆలోచనలతో అజాగరూకత పనికిరాదని , ఇది అందరికీ తన విజ్ఞప్తి అని వివరించారు. ప్రస్తుత సమీక్షా సమావేశం సందర్భంగా దేశ పౌరులకు ఈ విషయాన్ని తాను ప్రత్యేకంగా తెలియచేయదల్చుకున్నానని అన్నారు.

పండుగ సీజన్‌లో మరింత జాగ్రత్త

ఇప్పుడు దేశంలో పండుగల కాలం వచ్చిందని, ఈ దశలో ప్రజలంతా అన్ని జాగ్రత్తలు తీసుకోవల్సి ఉందన్నారు. ఓ వైపు విశ్వాసాలకు అనుగుణంగా వ్యవహరిస్తూనే, కోవిడ్ పట్ల సరైన సామాజిక బాధ్యతతో ఉండాలని కోరారు. మాస్క్‌లు వీడరాదు, భౌతిక దూరం తప్పనిసరి, తరచూ చేతులు కడుక్కోవాలి, పరిసరాల పరిశుభ్రత కు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశానికి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్థన్, ప్రధాని ముఖ్యకార్యదర్శి, నీతి ఆయోగ్ ఆరోగ్య విషయాల సభ్యులు, ప్రధాన శాస్త్రీయ సలహాదారు, సీనియర్ సైంటిస్టులు, పిఎంఒలోని అధికారులు, వివిధ ఇతర విభాగాల అధికారులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News