Home తాజా వార్తలు నటుడు పైడి జైరాజ్ దేశానికే గర్వకారణం : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

నటుడు పైడి జైరాజ్ దేశానికే గర్వకారణం : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

Actor Paidi Jairaj Is Pride Of Country : Srinivas Goudహైదరాబాద్‌ : దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, బాలీవుడ్ నటుడు  పైడి జైరాజ్ దేశానికే గర్వకారణమని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కొనియాడారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో బాలీవుడ్ నటుడు పైడి జైరాజ్ 112 వ జయంతి కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన జైరాజ్  చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ పాలనలో రాష్ట్రానికి చెందిన వైతాళికులను, కవులను, కళాకారులను, సాహితీవేత్తలను, మేధావులను, పోరాట యోధుల సేవలను గుర్తించి వారి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. సమైక్య  పాలనలో   తెలంగాణకు చెందిన సంస్కృతి, సాంప్రదాయాలు నిర్లక్ష్యానికి, వివక్షతకు గురయ్యాయని ఆయన తెలిపారు.  నటుడు కావాలన్న ఆలోచనతో పైడి జైరాజ్ ముంబయి వెళ్లి మూకీ సినిమాల నుంచి టాకీ సినిమాల వరకు నటించి మొదటి యాక్షన్ హీరోగా పేరు పొందారని శ్రీనివాస్ పేర్కొన్నారు. పైడి జైరాజ్ సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తుగా రవీంద్ర భారతిలోని ప్రివ్యూ థియేటర్ కు పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ గా పేరు పెట్టి గౌరవిస్తున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు భవిష్యత్‌లో ఇచ్చే అవార్డులకు పైడి జైరాజ్ పేరుతో ఇవ్వాలని  సిఎం కెసిఆర్ ను కోరుతామని ఆయన చెప్పారు. తెలంగాణలో సినిమా, నాటక రంగంపై ఆసక్తి ఉన్న యువతకు శిక్షణ ఇచ్చేందుకు  పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ కు అనుబంధంగా భాషా సాంస్కృతిక శాఖ సారథ్యంలో ఒక యాక్టింగ్ కోర్సును నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ కెసి నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, మంచిర్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.