Home ఎడిటోరియల్ సోనూసూద్ ఆదర్శం

సోనూసూద్ ఆదర్శం

Actor Sonu Sood help Poor People ఆపదలో ఉన్నవారిని వెంటనే ఆదుకోడంలో అసాధారణ చరిత్ర సృష్టిస్తున్న నటుడు సోనూసూద్‌ను గురించి చెప్పుకోని వారు లేరు. ఊరూరా, వాడవాడలా ఇతడి పేరు మారుమోగుతున్నది. నటుడుగా కంటే ఆపద్బాంధవుడుగా ఈయన గడించుకుంటున్న కీర్తే ఇందుకు కారణం. కరోనా సృష్టించిన లాక్‌డౌన్ గాఢాంధకారంలో, రెక్కలు తెగిన దిక్కులేని పక్షులుగా మారిపోయిన వేలాది మంది వలస కార్మికులను చేరదీసి, వసతి కల్పించి, తిండి పెటి,్ట వందల మైళ్ల దూరంలోని స్వస్థలాలకు బస్సులు, రైళ్లు, విమానాలలో కూడా పంపించి ఇతడు చేస్తున్న సేవలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మార్చి 24, 25 తేదీల్లో దేశ వ్యాప్తంగా కఠోరమైన సార్వత్రిక మూసివేత (లాక్‌డౌన్) అవ్యవధిగా, ఉన్నట్టుండి విరుచుకు పడినందువల్ల కోట్లాది మంది వలస కార్మికులు కరచరణాలాడని పరిస్థితిలోకి జారిపోయారు.

సుదూర ప్రాంతాల నుంచి దేశ మంతటా గల పలు నగరాలకు, పట్టణాలకు పొట్ట చేత పట్టుకొని వెళ్లి, అసంఘటిత రంగంలోని వివిధ పని స్థలాల్లో పని చేసుకుంటున్న వీరు పనులు పోయి, చేతిలో గల కొద్ది పాటి డబ్బు కరిగిపోయి, ఉన్న చోటి నీడ అంతర్థానమైపోయి, స్వస్థలాలకు వెళ్లే దారి కానక బస్‌స్టాండ్లు, రైలు కూడళ్లు, పోలీసు స్టేషన్ల వద,్ద చెట్లు, వంతెనలు, ప్లై ఓవర్‌ల వంటి వాటి కింద గుంపులుగా చేరి రోజుల తరబడి ఆకాశం వంక దీనంగా చూస్తూ వచ్చారు. మరి కొందరు మండుటెండల్లో కాలి నడకన సొంతూళ్లకు బయలుదేరి దారిలోనే కడతేరిపోయారు. ఈ స్థితిలో ముంబై నగరంలోని కొందరు వలస కార్మికులను సోనూసూద్ బృందం చేరదీసి ఉచితంగా భోజనాలు పెట్టడం ప్రారంభించింది. సమీపంలోని పాఠశాలలవంటి వాటిలో ఉండడానికి చోటిచ్చింది. అది తెలిసి అలాంటి దుస్థితిలోని మరెంతో మంది నగరం నలుమూలల నుంచి వచ్చి ఆ రెక్కల కింద చేరడం మొదలు పెట్టారు.

అలా రోజుకి 45 వేల మందికి సోనూసూద్ భోజనాలు పెడుతూ వచ్చాడు. తమకు భోజనం కంటే సొంతూళ్లకు చేరడం ముఖ్యమని వారంతా చెప్పడంతో వెంటనే పలు బస్సులు, శ్రామిక రైళ్లు, ఒకటొకటిగా ఏడు అద్దె విమానాలు ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు పంపించాడు. ఒక్కో విమానంలో 170 మంది వంతున కొందరిని ఒడిశాకు, మరి కొందరిని ఉత్తరాఖండ్‌కు ఇలా దేశం నలుమూలలోని వివిధ ప్రాంతాలకు చేర్చాడు. దీనిని చూసి, విని దేశం, ప్రపంచం అబ్బురపడిపోతున్నాయి. లక్షల కోట్ల ప్రజాధనం, సొంత బస్సులు, రైళ్లు, విమాన వ్యవస్థలున్న ప్రభుత్వాలు చేతులు ముడుచుక్కూచొని, కిమ్మనకుండా నిమ్మకు నీరెత్తినట్టున్న దశలో దేశం ముఖమ్మీద అసంఖ్యాక ప్రశ్నార్థకాలుగా నెత్తుటి కన్నీరు కారుస్తున్న వలస కార్మికులను సోనూ ఆదుకున్న తీరు ఔరా! అనిపించింది. అక్కడితో ఆగని పంజాబ్‌లోని మోగా గ్రామానికి చెందిన ఈ బహుభాషా చిత్రాల నటుడు, మన ‘అరుంధతి’ ఫేమ్ ఇప్పుడు మీడియాలో కనిపిస్తున్న అరుదైన మానవ వేదనల కథనాలకు స్పందిస్తూ ఆయా సమాజ వంచితులకు సాయపడుతున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌లో కుమార్తెల మెడ మీద కాడి పెట్టి దున్నుతూ సాగు చేస్తున్న ఒక తండ్రి కథనాన్ని సామాజిక మాధ్యమాల్లో సచిత్రంగా చూసి ఆ కుటుంబానికి ట్రాక్టర్‌ను కొని పంపించాడు. హైదరాబాద్‌లో, చేరిన కొద్ది మాసాల్లోనే లాక్‌డౌన్ కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోల్పోయి ఆత్మస్థైర్యంతో కూరగాయల దుకాణం పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తున్న ఒక యువతి ఉదంతం తెలిసి సాయపడ్డాడు. చిమ్మ చీకటిలో కాంతి పుంజం వంటి సోనూసూద్ వితరణ సిరిమంతులందరికీ ఆదర్శప్రాయం. ఆపదలో ఉన్నవారికి ఆరో ప్రాణం. దాన గుణమనేది పాత పదబంధం, ముక్తి మోక్ష భావ జాలానికి సంబంధించినది. సూత పుత్రుడుగా ఈసడింపుకి గురై, పరిపరి విధాలైన పలువురి శాపాలు, మోసాలు అనుభవించినా వెరవక, అడిగినవారెవరని చూడకుండా వారికి లేదనకుండా అడిగినది అడిగినట్టుగా ఇచ్చిన పౌరాణిక కర్ణుడు, శిబి, బలి చక్రవర్తివంటి వారిలో వర్ధిల్లిన దాన గుణానికి, పరలోకమని నమ్మతున్న దానిలో సుఖాలను, చేసిన పాపల నుంచి ముక్తిని ఆశించి గుడి మెట్ల మీది అర్థులకు పైసా, పరకా విదిలించడం, హుండీల్లో లక్షలు, కోట్లు వేయడం వంటి వాటికి చాలా తేడా ఉంది.

తీరిగ్గా సాయపడే ధర్మనిధులు వేరు. లాక్‌డౌన్ జాతీయ విపత్కాలంలో దేశ వ్యాప్తంగా పలు చోట్ల, పలువురు సహృదయులు వలస కార్మికులను అనేక విధాలుగా ఆదుకున్నారు. వారి సేవలూ మెచ్చుకోదగినవే. సోనూ రాజకీయ లబ్ధి కోరి ఈ సాయం చేశాడనే వారున్నారు. ఆయన దీనిని ఖండించాడు. ఇటువంటి వారందరూ కూడి దేశంలోని అణగారిన వర్గాల ప్రజా కోటికి మెరుగైన విద్య, వైద్య వసతులు కల్పించడానికి నడుం బిగించడం, అందుకు ప్రభుత్వాలు తగు రీతిలో తోడ్పడడం అవసరం. సహాయమందించడం కంటే సకాలంలో సరైన తోడ్పాటివ్వడం వెయ్యి రెట్లు గొప్పది. దానం కంటే పాత్ర దానం మెరుగైనది.