Friday, April 19, 2024

డ్రగ్స్ కేసులో నటి సంజనా గల్రాని అరెస్టు

- Advertisement -
- Advertisement -

Actress Sanjjanaa Galrani arrested in Bengaluru

కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించిన సంజన
శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ వినియోగంపై లోతుగా దర్యాప్తు
నిందితులు తప్పించుకోకుండా చట్టానికి పదును: కర్నాటక హోం మంత్రి

బెంగళూరు: డ్రగ్స్ కేసులో మరో కన్నడ సినీ నటి సంజనా గల్రానిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సిసిబి) అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. శాండల్‌వుడ్‌గా పిలుచుకునే కన్నడ సినీ పరిశ్రమలో చట్టవిరుద్ధంగా నిషేధిత మాదకద్రవ్యాల వాడకం జోరుగా సాగుతోందంటూ ఆరోపణలు వస్తున్న సందర్భంగా సిసిబి పోలీసులు తమ దర్యాప్తును విస్తృతం చేశారు. నగరంలో జరిగే బడావ్యక్తుల పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలపై ఇటీవలే మరో సినీ నటి రాగిణి ద్వివేదిని అదుపులోకి తీసుకున్న నగర పోలీసులు తాజాగా మంగళవారం తెల్లవారుజామున ఇక్కడి ఇందిరా నగర్‌లోని నివాసంలో సంజనా గల్రానిని అరెస్టు చేశారు. కాగా.. డ్రగ్స్ కేసులో అరెస్టయిన నిందితులు చట్టంలోని లొసుగుల కారణంగా తప్పించుకునే వీలులేకుండా చట్టాలను పటిష్టం చేస్తామని రాష్ట్ర హోం మంత్రి బసవరాజ్ బొమ్మయ్ మంగళవారం తెలిపారు.

ఇదిలా ఉండగా సినీ పరిశ్రమలో డ్రగ్స్ దుర్వినియోగం కేసుకు సంబంధించి ఇప్పటికే సిసిబి పోలీసుల అదుపులో ఉన్న వీరేన్ ఖన్నా అనే పార్టీల నిర్వాహకుడి ఇంట్లో నగర పోలీసులు సోదాలు జరిపి ఒక పోలీసు యూనిఫామ్ స్వాధీనం చేసుకున్నారు. కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది రెండు ప్రదేశాలపై నేడు సిసిబి పోలీసులు దాడులు నిర్వహించారని, దాడులు చేసిన ఇళ్లలో చాలా వస్తువులు లభించాయని, వాటిపై దర్యాప్తు జరుపుతున్నామని నగర పోలీసు జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ మంగళవారం తెలిపారు. వీరేన్ ఖన్నా ఇంట్లో కర్నాటక పోలీసుకు చెందిన యూనిఫామ్ లభించిందని, దేని కోసం దాన్ని అక్కడ ఉంచారో దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. డ్రగ్స్ కేసులో పోలీసులు చాలా లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిపై విస్తృతంగా దర్యాప్తు జరగాల్సి ఉందని, చాలా మందిని ప్రశ్నించాల్సి ఉందని ఆయన తెలిపారు. మొత్తమ్మీద తమ దర్యాప్తు సరైన దిశలోనే వెళుతోందని ఆయన చెప్పారు.

డ్రగ్స్ కేసులో సంజనా స్నేహితుడు, రియల్టర్ రాహుల్‌ను అరెస్టు చేసినప్పటి నుండి నగర పోలీసులు ఆమెపై ఒక కన్నేసి ఉంచారు. బెంగళూరులో జన్మించిన సంజనా గల్రాని తమిళ చిత్రం ఒరు కాదల్ సీవీర్ ద్వారా సినీ అరంగేట్రం చేశారు. ఆమె ప్రభాస్ నటించిన తెలుగు చిత్రం బుజ్జిగాడుతోపాటు అవును 2, దండుపాళ్యం 2, దండుపాళ్యం 3, 2 కంట్రీస్ తదితర చిత్రాలలో నటించారు.

డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు సిసిబి పోలీసులు అరెస్టు చేసిన వారిలో రాగిణి ద్వివేది, వివేన్ ఖన్నా, ఒక మాజీ మంత్రి కుమారుడు ఆదిత్య ఆల్వా, రాహుల్, నటుడు నియాజ్ , సంజనా గల్రాని ఉన్నారు. మొత్తం 14 మందిపై కేసులు నమోదు చేసిన సిసిబి పోలీసులు ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు. కన్నడ సినీ నటులు, గాయకులకు అత్యంత ఖరీదైన డ్రగ్స్ సరఫరా చేయడం, నిల్వ చేయడం వంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను బెంగళూరులో అరెస్టు చేయడంతో సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకంపై పోలీసులు నిఘా పెట్టి దర్యాప్తును తీవ్రతరం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News