Friday, April 19, 2024

ఆశ్రిత పక్షపాతానికి పరాకాష్ఠ!

- Advertisement -
- Advertisement -

ధీరూభాయ్ ఇందిర, ముఖేశ్ కాంగ్రెస్, అదానీ మోడీ

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ, 1988లో కేవలం 2.2 కోట్ల టర్నోవర్ గల వ్యాపారంతో మొదలు పెట్టి ఈనాడు 12640 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలో మూడవ స్థానం చేరుకున్నాడు. భారత ప్రభుత్వం 1990లలో చేపట్టిన ఉదారవాద ఆర్ధిక సంస్కరణలు, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ సౌలభ్యాలను ఆసరా చేసుకుని ఒక ఆర్ధిక సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. మన పాలనా వ్యవస్థను తనకు అనుకూలంగా మలచుకోవడంద్వారా ఆయన అసాధారణమైన, అనూహ్యమైన వేగంతో విస్తరించగలిగాడు. మోడీ కేంద్ర అధికారంలోకి వచ్చిన 2014 నుండి అదానీ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగింది. 800 కోట్ల డాలర్ల నుండి 15000 కోట్ల డాలర్లకు ఆయన సంపద పెరిగింది. అందులో సుమారు 10000 కోట్ల డాలర్ల ఆస్తి గత మూడు సంవత్సరాలలోనే షేర్ల ధరల పెరుగుదల వల్ల సమకూరింది. హిండెన్ బర్గ్ అనే అమెరికా సంస్థ అదానీ ఆర్ధిక కుంభకోణాలు చేశాడని, షెల్ కంపెనీల ద్వారా స్టాక్ మార్కెట్‌ను తప్పుడు పద్ధతులలో ప్రభావితం చేశాడని ఒక నివేదిక విడుదల చేసింది.దాని ప్రభావం తో అదానీ షేర్ల విలువ తీవ్రంగా పడిపోయింది.

ఈ నివేదిక తరువాత కూడా గౌతం అదానీ, వ్యక్తిగత నికర విలువ నుండి దాదాపు 4000 కోట్ల డాలర్లు తుడిచిపెట్టుకుపోయినప్పటికీ, బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఇంకా ఆసియాలోని అత్యంత ధనవంతుడిగా వున్నాడు. మరో భారతీయ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి గల 8260 కోట్ల డాలర్ల సంపద కంటే 200 కోట్ల డాలర్లు మిన్నగానే వున్నాడు. భారత దేశంలో ప్రభుత్వ విధానాల వల్ల సూపర్ రిచ్ వ్యక్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
బ్రిటిష్ వలస దోపిడీ పాలన వల్ల ఆ కాలంలో భారత పెట్టుబడిదారీ వర్గం బలంగా లేదు. అందువల్ల స్వాతంత్య్రం వచ్చిన తొలి దశకాలలో భారత దేశంలో భారీ మౌలిక వసతులు మొత్తం ప్రభుత్వరంగ సంస్థల ద్వారా నిర్మించి వాటిని వస్తువుల తయారీకి ప్రైవేటు పెట్టుబడిదారులకు అనుకూలంగా, లాభదాయకం గా అందుబాటులో ఉంచేవారు. ఆనాటి లైసెన్సు రాజ్యంలో ప్రభుత్వాధినేతలకు- బడాపెట్టుబడిదారులకు మధ్య అస్మదీయ సంబంధాలు బాగా ఉండేవి.

పబ్లిక్ రంగం అభివృద్ధి మొత్తం ప్రైవేటు పెట్టుబడిదారుల లాభాలకు తోడ్పడేది. పెట్టుబడిదారీ వ్యవస్థ బలపడుతున్న కొద్దీ అది పబ్లిక్ రంగాన్ని క్రమంగా కబళించి వేస్తూ ఈ నాడు ఎల్‌ఐసి లాటి సంస్థలను కూడా స్వాధీనం చేసుకునే దశకు చేరుకున్నది. ఆనాడు పబ్లిక్ రంగ పరిశ్రమల స్థాపన గాని, ఆర్ధిక సంస్థల జాతీయకరణ గానీ, నేడు బృహత్ పరిశ్రమల ప్రైవేటీకరణ గాని సారాంశంలో బడా పెట్టుబడిదారుల గుత్తాధిపత్యానికే దారులు వేస్తున్నది. నాడు, నేడు భారత పాలకులు పెట్టుబడిదారీ అభివృద్ధికే కట్టుబడి వున్నారు. 90 ల వరకు వున్న సంక్షేమ రాజ్య భావన గాని, నేటి ఉదారవాద సంస్కరణల పర్వం గాని రూపం మారినా ధనాధిపతులకే లాభం చేస్తున్నవి.

గతంలో ఆశ్చర్యకరంగా ఎదిగిన ధీరూభాయి అంబానీ కూడా 75,000 కోట్ల విలువైన తన రిలయన్స్ సామ్రాజ్యాన్ని అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వ విధానాలను ఉపయోగించుకోవటం ద్వారా నిర్మించాడు. ఈ వ్యవస్థలో చట్టాలను, విధానాలను అనుకూలంగా వాడుకోవడం, అనువుగా మలచుకోవటం, ఉన్నత స్థాయి ఉద్యోగుల, అధికారుల చేతులు తడపటం, విధానాలలోని లొసుగులను ఆధారం చేసుకుని పనులు చక్కబరుచుకోవటం, రాజకీయ సంబంధాలను వాడుకోవటం, పెట్టుబడిని వృద్ధి చేసుకోవటానికి కీలకం అని అంబానీ తన విజయ రహస్యం చెప్పేవాడు. అయితే ఈ రాజకీయ లాలూచి అప్పుడు కాస్త గోప్యంగా వుండేది. 30 ఏళ్ల తర్వాత ఈ విధానం బహిరంగ వ్యవహారమే అయ్యింది. పెట్టుబడిదారులు స్వయంగా రాజకీయ రంగాన్ని ఆక్రమించి నేరుగాను లేక తమ ప్రతినిధులను ప్రభుత్వ పదవులలో నెలకొల్పి వారి ద్వారా ప్రభుత్వ విధానాలు తమకు అనువుగా రూపొందించుకుంటున్నారు. ఇలాటి పద్ధ్దతులతోనే అదానీ కూడా తన సంపదను పెంచుకున్నాడు.

1994లో స్టాక్ ఎక్సేంజ్‌లో తొలిసారి లిస్ట్ అయిన అదానీకి, ఆయన కంపెనీలలో మకుటా భరణం అనదగ్గ గుజరాత్‌లోని ముంద్రా పోర్టు భూములను కట్టబెట్టింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. తరువాత గుజరాత్‌లో వచ్చిన బిజెపి ప్రభుత్వాలతో కూడాఆయన సన్నిహితంగా వుంటూ వచ్చాడు. ఇక 2000ల నుండి ఆ వ్యాపారవేత్తకు గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న నరేంద్ర మోడీ నుండి ఇతోధిక ప్రోత్సాహం లభించింది. దానితో అదానీకి చెందిన పలు కంపెనీలు ఆయా రంగాల్లో అగ్రగామి సంస్థలుగా మారాయి. నేడది 23,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉన్న బృహత్తర గ్రూపు.

ప్రధాని అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిన రంగాల్లోనే అదానీ పెట్టుబడులు పెడతాడు. శిలాజ ఇంధనాల నుండి గ్రీన్ ఎనర్జీ విస్తరణ వరకు అతని వ్యాపారాలు, లాభాలు పెరిగేలా ప్రభుత్వ విధానాలు తయారవుతున్నాయి. ఇది ఒక రాజకీయ- ఆర్ధిక లాలూచీ సంబంధం. ఒక ఆశ్రిత పక్షపాతం. ఆయన ఎదుగుదల ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం (క్రోనీ క్యాపిటలిజం)పైనే ఎక్కువగా ఆధారపడి ఉందని అర్ధమవుతుంది. ప్రభుత్వ సంస్థ ఎల్‌ఐసి ఈ గ్రూపులో 35917 కోట్లు (నేటి మార్కెట్ విలువ సుమారు 60 వేల కోట్లు) యస్‌బిఐ బ్యాంకు 27 వేల కోట్ల పెట్టుబడి సమకూర్చడం దీనికి నిదర్శనం. అదానీ గ్రూపు కంపెనీలకు మొత్తం రెండు లక్షల కోట్ల అప్పు వుందని, అందులో 40% అంటే సుమారు 80,000 కోట్లు బ్యాంకులు ఇచ్చినదే అని ఈ మధ్య సి. ఎల్.యస్.ఏ. రిపోర్ట్ పేర్కొంది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరించే ‘నైబర్ హుడ్ ఫస్ట్’ పొరుగు దేశాలకు ప్రాధాన్యం- అనే విధానంతో పొరుగు దేశాలతో జరుగుతున్న వాణిజ్యంలో పెద్ద పీట అదానీకే చిక్కుతుంది. బంగ్లాదేశ్ పవర్ ప్రాజెక్ట్, శ్రీలంకలో 5000 లక్షల డాలర్ల విలువ గల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు, 7000 లక్షల డాలర్ల విలువైన పెద్ద రేవు నిర్మాణం అదానీకే ఒప్పగించారు. మోడీ విదేశీ పర్యటనలకు ముందో, వెనుకో లేక ప్రధానితో కలిసో అదానీ ఆ దేశాలను సందర్శించి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవటం పరిపాటి.

అదానీ వ్యాపారంపై వచ్చిన విమర్శలను భారతీయ వ్యతిరేకతగా చిత్రిస్తున్నారు. అదానీపై విదేశాల భారీ కుట్ర అని, కొందరు అమ్ముడుపోయిన వామపక్షవాదులు, దేశభక్తి హీనులు అదానీ ప్రతిష్ఠను దెబ్బ తీయటానికి 2016 నుండి కుట్ర చేశారని అందు లో భాగమే హిండెన్‌బర్గ్ నివేదిక అని ఆర్‌యస్‌యస్ పత్రిక ఆర్గనైసర్ రాసింది. అదానీని విమర్శించటం అంటే మోడీని విమర్శించడమే అని కూడా వారు రాశారు. మోడీని విమర్శిస్తే భారత్‌ను విమర్శించినట్లే అనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదానీ వ్యాపార అవినీతిని తప్పుపడితే కూడా దేశాన్ని కించపరచడంగా ప్రచారం చేస్తున్నారు. అదానీ వ్యవహారంలో దర్యాప్తు చేయాలని, జెపిసిని ఏర్పాటు చేయాలని కోరితే విదేశీ నివేదికల ఆధారంగా దేశ వ్యతిరేక ప్రకటనలు చేయటానికి పార్లమెంటును వాడుకోవద్దని రాజ్యసభ ఛైర్మన్ ప్రకటించాడు.

దేశ ఆర్ధిక అభివృద్ధికి అదానీ ఎంతో తోడ్పడుతున్నాడని కనుకనే విదేశీ దాడికి గురవుతున్నాడని పాలక వర్గాలు అతని కొమ్ము కాస్తున్నాయి. ప్రధాని ప్రసంగాలలో దేశంలో పెద్ద కుంభకోణం జరిగినది అన్న సోయికూడా లేదు. ఒక ప్రైవేటు కంపెనీలో జరిగిన దానికి ప్రభుత్వ బాధ్యత ఏమిటి అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు రూ. 10 లక్షల కోట్ల మేరకు నష్టం కలిగించే ఆర్ధిక కుంభకోణాన్ని ఎంతో తేలికగా తీసుకుంటున్నారు. అదానీ గ్రూప్ షేర్ల పతనం గురించి, ఆకస్మిక మార్కెట్ ఒడిదుడుకుల నుంచి భారతీయ మదుపరులను రక్షించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. స్టాక్ మార్కెట్ ఇప్పుడు ‘పెద్ద పెట్టుబడిదారులకు’ మాత్రమే పరిమితం కాదని, ‘విస్తృతమైన మధ్య తరగతి మదుపరుల శ్రేణి’ కూడా అందులో వుందని పేర్కొంది. వారి నష్టాన్ని ప్రభుత్వం ఏ విధంగా నివారించగలదో చెప్పాలని కోరింది

భారత స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ ఇంకా ఎటువంటి ప్రకటనలు చేయలేదు, కానీ మా అసెట్ వాల్యులో 0.9% మాత్రమే అదానీ గ్రూపులో పెట్టుబడి పెట్టామని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మా మొత్తం అప్పులలో అదానీకి ఇచ్చింది 1 శాతం మాత్రమే అని ఎస్‌బిఐ బ్యాంక్ ఛైర్మన్ ‘వారు వ్యవస్థాగతంగా ముఖ్యమైన వ్యాపారాలలో బాగా స్థిరపడిన గ్రూపు. వాళ్ళు అతి త్వరలోనే సంక్షోభం నుండి బయటపడతారు’ అని ఆర్థిక సలహా సంస్థ సనా సెక్యూరిటీస్ వ్యవస్థాపకుడు రజత్ శర్మ ప్రకటించారు. అదానీ సంక్షోభం మన ఆర్ధిక వ్యవస్థను ఏమీ ప్రభావితం చేయలేదని చెప్పటానికి వారు తాపత్రయపడుతున్నారు. నష్టంలో వారి పాత్ర ను తగ్గించి చూపుకోవటానికి, అదానీని తద్వారా మోడీ ప్రభుత్వాన్ని ప్రజల దృష్టిలో పతనం కాకుండా కాపాడటానికి ఇలాటిమెరమెచ్చు ప్రకటనలు చేస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోంది.

బడా పెట్టుబడిదారులతోనూ, విదేశీ దోపిడీదారులతోనూ ఈప్రభుత్వాలు అండదండగా ఉంటూ, తోడు దొంగలుగా ప్రజల శ్రమ ఫలితాలను దోపిడీ చేస్తున్నారు. మిలియనీర్లు ఎంఎల్‌ఎలు గాను, ఎంపిలు గాను ఎన్నికై ప్రత్యక్షంగా చట్టసభలలో తమకు కావలసిన చట్టాలు చేసుకుంటున్న వ్యవస్థ మనది. ఇది కేవలం మోడీ, -అదానీల స్నేహానికి పరిమితమైన విషయం కాదు. గుత్త పెట్టుబడి దారులకు -ప్రభుత్వాలకు మధ్య వున్న మైత్రిగా, వర్గ మిత్రత్వంగా చూడాలి. అది ధీరూభాయి- ఇందిరా గాంధీల ప్రచ్ఛన్న సహకార రూపమా? ముకేష్ అంబానీ -కాంగ్రెస్‌ల మధ్య బంధమా, మోడీ- అదానీల స్నేహమా అన్నది అప్రధానం. నడుస్తున్నది ధనస్వామ్యం పైకి చెప్పేది ప్రజాస్వామ్యం. పెట్టుబడిదారుల అనుకూల ప్రభుత్వాలు కనుకనే ముకేష్ అంబానీ రోజు సంపాదన 300 కోట్లు సాధ్యమవుతుంది. మూడు లక్షల కోట్ల ఆస్తి సంపాదించ గలుగుతాడు.

స్టాక్ మార్కెట్ కుంభకోణాలు, ఈనాడు బయటపడిన అదానీ వ్యవహార శైలి కూడా కొత్తవి కావు. కానీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు మాత్రం విడ్డూరంగా వుంది. షేర్ల విలువలు అడ్డగోలుగా పెంచి 1992లో పేలిపోయిన హర్షద్ మెహతా 5000 కోట్లుస్కామ్, 1996 భన్సాలి 1200 కోట్లు; 2001లో ఖేతన్ పరేఖ్ 40,000 కోట్ల స్కామ్, యుటిఐ మూచ్యువల్ ఫండ్స్‌తో చేసిన అల్లకల్లోలం, 2009లో సత్యం రామలింగరాజు ఉదంతంలో వాటాదారులకు వాటిల్లిన 7800 కోట్ల నష్టం, చట్ట వ్యతిరేకంగా రెండున్నర కోట్ల మంది ప్రజల నుండి 24000 కోట్లు వసూలు చేసిన సహారా (సుబ్రతో రాయ్) కుంభకోణం, 20-30 వేల కోట్ల రూపాయలు సేకరించి 2013లో కూలిపోయిన శారదా చిట్ ఫండ్ (సుదీప్త సేన్) కుంభకోణం వంటివి, బ్యాంకుల సహాయంతో స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసి, అత్యధిక లాభాల ఆశ కల్పించి ప్రజల నుండి నిధులు దోచుకోవటమే. ఈ అన్ని కుంభ కోణాలలోనూ పెద్ద పెద్ద రాజకీయ శక్తుల ప్రమేయం వుండటం నిజం.

ఇంత చరిత్ర వున్నప్పటికీ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం భారతదేశ ఆర్ధిక సంస్థల నియంత్రణదారులు చాలా, చాలా అనుభవజ్ఞులు, నిపుణులు. రెగ్యులేటర్లు ఇప్పుడు మాత్రమే కాదు వీటిని పరిష్కరించటానికి ఎప్పటికీ సంసిద్ధులుగానే ఉంటారు అని ఒక ప్రకటన చేసి ఊరుకున్నారు. ఆర్ధిక తిమింగలాలు, రాజకీయ అగ్రనేతల మధ్య అపవిత్ర సంబంధం ఏ స్థాయిలో వుందంటే అదానీ ఆస్తులను జాతీయం చేయాలని, వాటిని వేలం వేసి నష్టపోయిన వారిని ఆదుకోవాలనిసుబ్రహ్మణ్య స్వామి వంటి బిజెపి సీనియర్ నాయకుడే కోరుతున్నాడు. దేశ సంపదలో 40% అత్యున్నత స్థాయిలో ఉన్న 1% ధనవంతుల చేతిలో వుండగా, క్రింది స్థాయిలో ఉన్న 50% జనాభాకు (అంటే 70 కోట్ల మందికి) దక్కుతున్నది కేవలం 3% మాత్రమే.

ఈ పరిపాలనలో 85% ప్రజల ఆదాయం క్షీణించి పోతుంటే, బిలియనీర్ల సంఖ్య మాత్రం పెరిగిపోతున్నది. 2020లో 102 మంది వున్న బిలియనీర్లు 2022 చివరికి 166కి పెరిగారు. వారిలో పై వరసలో వున్న 10 మంది ధనవంతుల ఆస్తులు రూ. 27.5 లక్షల కోట్లకు పెరగగా (32% వృద్ధి), అత్యంత నిరుపేదల సంఖ్య 22.89 కోట్లకు చేరి ప్రపంచ ప్రధమ స్థానం పొందాము. సంపద పంపిణీలో ఇంత తీవ్రమైన అసమానత మరెక్కడా లేదు. దేశంలో సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ బదులు సర్వైవల్ ఆఫ్ డి రిచెస్ట్ అన్న సూత్రం అమలు అవుతోంది. సమర్ధుల మనుగడ బదులు ధనవంతుల మనుగడకు ప్రోత్సాహం దొరుకుతోంది. అపార కుబేరుల ఆస్తి నిమిషానికి రూ. 2.5 కోట్ల చొప్పున పెరుగుతోంది. ఈ అసమాన అభివృద్ధి ఫలితంగానే అన్నార్తుల సంఖ్య 19 కోట్ల నుండి 35 కోట్లకు పెరిగింది. ఇంకా ఎంత కాలం ఈ వ్యవస్థను భరిస్తూ మన భుజాల మీద మోయడం అన్నది అసలు ప్రశ్న.

జతిన్ కుమార్
9849806281

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News