Friday, April 26, 2024

పార్లమెంటులో ఆగని అదానీ రభస..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:భారీగా పతనమవుతున్న దానీ గ్రూపు షేర్ల ఎఫెక్ట్ రెండో రోజు కూడా పార్లమెంటుపై పడింది. దీంతో ఉభయసభల కార్యకలాపాలు స్తంభించాయి. అదానీ గ్రూపు తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై చర్చ జరపాలని ఉభయసభల్లో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఇది కాస్తా పార్లమెంటులో గందరగోళానికి దారి తీసింది. దాంతో సోమవారం వరకు ఉభయసభలు వాయిదా పడ్డాయి.

ఈ బడ్జెట్ సమావేశాల్లో అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు జరిపించాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెసిసి) లేదా సిజెఐ అద్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలని విపక్షాలు శుక్రవారం డిమాండ్ చేశాయి. వారి అభ్యర్థనలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తోసిపుచ్చారు. సభ్యులు నిరాధారమైన ఆరోపణలు చేయకూడదన్నారు. మరో వైపు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ కూడా విపక్షాల వాయిదా తీర్మానాలను తోసిపుచ్చారు.

దాంతో ప్రతిపక్ష సభ్యులలు వెల్‌లోకి దూసుకుపోయి నినాదాలు చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య తొలుత రాజ్యసభ మధ్యాహ్నం2.30 గంటల వరకు, లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. తర్వాత ఉభయసభల కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్షాలనుంచి మళ్లీ అదే డిమాండ్ వినిపించింది. దీంతో ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంటు సోమవారానికి వాయిదా పడింది.

కాగా రాజ్యసభను వాయిదా వేసే ముందు ధన్‌ఖర్ మాట్లాడుతూ వెల్‌లోకి దూసుకువచ్చిన సభ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కాగా తొలుత సభ ప్రారంభమైన వెంటనే ధన్‌ఖర్ ఈ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ వివిధ పార్టీలకు చెందిన సభ్యులనుంచి తనకు 267 నిబంధన కింద 15 నోటీసులు అందాయని, అవి నిబంధనకు అనుగుణంగా లేనందున వాటిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విపక్ష సభ్యులు గొడవ చేయడం ప్రారంభించారు. మీరు మీ పని చేశారు.మీరు సమస్యను నా దృష్టికి తీసుకువచ్చారు. నేను నా రూలింగ్ ఇచ్చాను’ అని ధన్‌ఖర్ ప్రతిపక్షాలతో అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News