Thursday, April 25, 2024

అదానీపై నోరు విప్పని ప్రధాని

- Advertisement -
- Advertisement -

అదానీ గ్రూపు కంపెనీల తీరుతెన్నుల గురించి వెలువడిన హిండెన్‌బర్గ్ నివేదిక దేశమంతటా సంచలనం సృష్టించింది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగమనే పల్లవిని అందుకున్నారు. అవినీతి మరకలేని కేంద్ర ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలకు శ్రీకారం చుట్టేందుకు అదానీ గ్రూపును తీసుకున్నారన్నది ప్రచార సారం. కానీ నరేంద్ర మోడీ అలా అనుకుంటున్నట్లు లేదు, లేకుంటే ఎందుకు స్పందించటం లేదు? మోడీ అంటే అదానీ అదానీ అంటే మోడీ అన్న వాతావరణం దేశంలో ఉన్నమాట వాస్తవం. అందువల్లనే అదానీ కంపెనీ మీద వచ్చిన నివేదికను మోడీకి కూడా కలిపి ప్రభుత్వం మీద కుట్రగా చెప్పటం తప్ప మరొకటి కాదు. మోడీ సర్కార్ విధానాలను విమర్శించటం దేశద్రోహం అని చిత్రించినట్లుగానే ఇప్పుడు అదానీ కంపెనీ గురించి ఏదైనా ప్రతికూల అంశాలను చెబితే దాన్ని కూడా దేశద్రోహం అనే స్థితికి వెళ్లారు. మన వారు ధనికులు కావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని నిందిస్తున్నారు.

అదానీ కంపెనీ ఆర్థిక విభాగ అధిపతి జగుషిందర్ సింగ్ హిండెన్ బర్గ్ నివేదికను బ్రిటీష్ వారి జలియన్‌వాలాబాగ్ మారణకాండతో పోల్చారు. దేశం మీద, దాని సంస్థల మీద పథకం ప్రకారం జరిపిన దాడి అన్నారు. మదుపుదార్లు ఈ నివేదికను ఎందుకు నమ్మారు అన్న ప్రశ్నకు తోటి భారతీయులు కొందరి తీరు తనకు ఆశ్చర్యం కలిగించలేదని సెలవిచ్చారు. జనవరి 24న హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడైంది. తరువాత స్టాక్ మార్కెట్లో అదానీ కంపెనీల వాటా ధరల పతనానికి దారితీసింది. రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లు మిగతా కంపెనీల వాటాల ధరలు కూడా తగ్గాయి. కొన్ని లక్షల కోట్ల మేరకు వాటాదార్ల సంపద ఆవిరైంది. సోమవారం నాడు రాయిటర్ వార్తా సంస్థ ఇచ్చిన కథనం మేరకు 65 బిలియన్ డాలర్ల సంపద హరీమంది. ప్రతి పైసాకు జవాబుదారీగా ఉంటానని చెప్పిన చౌకీదార్ ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 31న ఇది రాసిన సమయం వరకు దీని మీద ఎలాంటి ప్రకటన చేయలేదు.

పత్రికా గోష్టిపెట్టి విలేకర్ల ప్రశ్నలను ఎదుర్కొనేందుకు మనస్కరించకపోవచ్చు, విశ్వగురువుగా తన స్థాయికి తగిన విధంగా ప్రశ్నలు అడిగే విలేకర్లు లేరని భావించవచ్చు. ఆర్నాబ్ గోస్వామి వంటి ఒకరిద్దరు ధైర్యం చేసి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగాకపోవచ్చు. ఇంత పెద్ద సంచలనం మీద జనాలకు ఏదో ఒకటి చెప్పాలా లేదా? నిజంగా అదానీ కంపెనీల నిజాయితీ మీద అంత నమ్మకం ఉంటే అవి ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ప్రకటించి అనుమానాలకు తెరదించాలి, లేదా వాజ్‌పేయీ చెప్పినట్లు అధికారంలో ఉన్నవారు రాజధర్మాన్ని పాటించి విచారించి నిజానిజాలు తేలుస్తామనైనా చెప్పాలి. మౌనానికి అర్ధం ఏమిటి? మన్మోహన్ సింగ్‌ను మౌన ముని అంటూ ఎద్దేవా చేసిన వారు దీన్ని గురించి ఏమంటారు? మోడీ స్పందించాల్సినంత పెద్దదికాదు అనుకోవాలా? అంటే మీరు నందంటే నంది పందం టే పందని జనం కూడా చెవులోపూలు పెట్టుకొని తలూపాలా?

ఒక అగ్ర దేశ ఇంటెలిజన్స్ నిధులతో నడుస్తున్న హిండెన్‌బర్గ్ అని వాట్సాప్‌లో ఒక ప్రచారం జరుగుతున్నది. అమెరికాలో సిఐఎ, ఎఫ్‌బిఐ గురించి అందరికీ తెలిసిందే. వాటిలో ఏదో ఒకటి దీనికి నిధులు ఇచ్చిందంటున్నారు. నిజమే అనుకుందాం. మన దేశం అమెరికాకు జిగినీ దోస్తుగా ఉంది కదా!మా దేశానికి వ్యతిరేకంగా ఇలాంటి కుట్రలు చేయిస్తున్నారేమిటని నరేంద్ర మోడీ ఎందుకు ప్రశ్నించరు? 2014కు ముందు అదానీ గ్రూపు లేదా అప్పటి ప్రభుత్వం దాన్ని పెంచి పోషించలేదా, రుణాలు ఇవ్వలేదా ఇప్పుడెందుకు గగ్గోలు అంటున్నారు. లేదని ఎవరు చెప్పారు, కాంగ్రెస్ పాలకులు పెంచి పోషించలేదని ఎవరు అన్నారు. నరేంద్ర మోడీ కూడా ఆ పని చేస్తున్నారా లేదా అది తప్పా ఒప్పా అన్నదే ప్రశ్న.

గతానికి నరేంద్ర మోడీ పాలనకూ పోల్చి అనేక అంశాలు చెబుతున్నవారు 1988లో ప్రారంభమైన అదానీ కంపెనీల ఆస్తులు 2014 కు ముందు తరువాత ఎంత అన్నది చెప్పలేరా? నరేంద్రమోడీ తిరిగేందుకు తన జెట్ విమానాన్ని ఇచ్చారు తప్ప కాంగ్రెస్ నేతలకు ఇచ్చారా లేదా అన్నది కూడా చెప్పాలి. 2014లో అదానీ సంపదల విలువ 8 బిలియన్ డాలర్లు కాగా, 2022లో అది 137 బి.డాలర్లకు (1,600 శాతం) పెరిగింది. ఈ వాస్తవాన్ని కాదనగలరా? మిగతా కంపెనీలకు లేని ఈ పెరుగుదల అదానీకి ఎలా వచ్చింది? ఏదైనా మంత్రదండం ఉందా? మిగతా పారిశ్రామికవేత్తలు కూడా చొక్కా పాంట్లు విప్పి పక్కనపెట్టి పలుగూ పారా, సుత్తీ రెంచీలు పట్టుకొని పని చేసిన వారు కాదా? వందల సంవత్సరాలుగా పారిశ్రామికవేత్తలుగా ఉన్న టాటా, బిర్లా, తరువాత వచ్చిన అంబానీ కంపెనీలకు రాని లాభాలు అదానీకి ఎలా వచ్చినట్లు?

హిండెన్‌బర్గ్ లేవనెత్తిన అంశాల్లో అదానీ గ్రూపు రుణాల గురించి మాత్రమే కాదు అదొకటి మాత్రమే. పన్ను స్వర్గాలతో సంబంధాలు పెట్టుకొని ఎగవేసినట్లు కూడా ఆరోపించింది. రుణ ఎగవేతదార్ల జాబితాలో అదానీ ఉన్నట్లు ఎవరూ చెప్పటం లేదు, అలాంటి ప్రమాదం ఉందని మాత్రమే అంటున్నారు. 2015లోనే క్రెడిట్ సూచీ తన నివేదికలో తీవ్ర రుణ వత్తిడిని ఎదుర్కొంటున్న పది సంస్థలలో అదానీ గ్రూపు ఒకటని పేర్కొన్నది. తాజాగా అమ్మకానికి పెట్టిన ఎఫ్‌పిఒ వాటాలతో వచ్చిన సొమ్మును కొత్త పెట్టుబడి కోసం గాక ఇప్పటికే ఉన్న కంపెనీల అప్పులు తీర్చేందుకు అన్నది తెలిసిందే. బమ్మిని తిమ్మిని చేసి లేని విలువను సృష్టించి మోసానికి పాల్పడిన సత్యం కంపెనీ మాదిరి అదానీ చేసినట్లు చెప్పింది ప్రధాన అంశం, దాని గురించి చెప్పకుండా రుణాల చుట్టూ తిప్పుతున్నారు. ఎల్‌ఐసి పెట్టిన పెట్టుబడుల కంటే ఇప్పటికీ విలువ ఎక్కువే ఉన్నదని, నష్టం లేదు కదా అని లెక్కలు చెబుతూ పక్కదారి పట్టించేందుకు చూస్తున్నారు.

ఎల్‌ఐసి కొనుగోలు చేసిందంటే కంపెనీ విశ్వసనీయత కలిగినదని మదుపుదార్లు విశ్వసిస్తారు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించి ఉంటారన్నది ఒక అభిప్రాయం. అదానీ కంపెనీలకు బ్యాంకు లు కాంగ్రెస్ ఏలుబడిలో రుణాలు ఇవ్వలేదా అని సవాలు విసురుతున్నారు. ఇవ్వలేదని ఎవరూ చెప్పటం లేదే. పారుబాకీల పారిశ్రామికవేత్తలందరికీ కాంగ్రెస్ నేతలు రుణా లు ఇప్పించి ఎగవేయించారని చెప్పింది బిజెపి నేతలు. అదానీ కంపెనీకి ఉన్న అప్పు మొత్తాన్ని చూస్తే మిగతా వారి మాదిరే ఈ కంపెనీ కూడా చేతులెత్తేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. హిండెన్‌బర్గ్ నివేదిక రాకముందే గత ఏడాదే అనేక మంది ఈ అంశాన్ని లేవనెత్తినపుడు అదానీ కంపెనీ అప్పులు తీర్చే స్థితిలో ఉందని అనేక మంది కంపెనీ లాబీయిస్టులు మీడియాలో రాశా రు.

అదానీ కంపెనీలకు ఎస్‌బిఐ రుణాలు ఇవ్వటం, ఎల్‌ఐసి పెద్ద మొత్తంలో వాటాలు కొనటం వెనుక బిజెపి పెద్దల హస్తం ఉందన్న విమర్శలున్నాయి. ఎవరో ఏదో అన్నదాని గురించి రాముడు, సీత, అగ్నిప్రవేశం గురించి రోజూ చెబుతారు కదా ! అది తమకు వర్తించదా, సచ్ఛీలతను నిరూపించుకోరా, సీత మాదిరి అగ్నిప్రవేశాన్ని గానీ, రాజీనామాను గానీ ఎవరూ కోరటం లేదు. బ్యాంకు కార్మిక యూనియన్లలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఇప్పించిన రుణాల మీద కూడా విచారణ జరిపించాలని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన లోన్ల దందాలపై కూడా నిష్పాక్షిక విచారణ జరిపించాలని వాట్సాప్ పండితులు వాదిస్తున్నారు. అసలు వీరి సమస్య ఏమిటి? ఆ పని చేస్తే నరేంద్ర మోడీకి ఎవరు అడ్డుపడ్డారు? ఇడి, సిబిఐలను అలాంటి అక్రమాల నిగ్గు తేల్చేందుకు పంపండి. అధికారానికి వచ్చి తొమ్మిదేండ్లు, అరిగిపోయిన రికార్డులను ఎన్ని సంవత్సరాలు ఇంకా వినిపిస్తారు?

హిండెన్‌బర్గ్ లేవనెత్తిన అంశాలకు అదానీ కంపెనీ 413 పేజీలతో సుదీర్ఘ వివరణ ఇచ్చింది. అసలు అంశాలను పక్కన పెట్టిందని, జాతీయ జెండాను కప్పి అక్రమాలను కనపడకుండా చేసేందుకు పూనుకున్నదని హిండెన్‌బర్గ్ స్పందించింది. గౌతవ్‌ు అదానీ సోదరుడు వినోద్ అదానీకి సంబంధించిన విదేశీ సూట్‌కేస్ కంపెనీల లావాదేవీల గురించి తాము ప్రశ్నించిన దానికి సమాధానం లేదని పేర్కొన్నది. వాటికి అదానీ కంపెనీల నుంచి పంపినవి, తిరిగి వాటి నుంచి అదానీ కంపెనీలకు చేరిన బిలియన్ల డాలర్ల నిధుల సంగతేమిటని, అవి వినోద్ అదానీకి ఎక్కడి నుంచి వచ్చిందీ చెప్పాలని హిండెన్‌బర్గ్ కోరింది. దానికి అదానీ కంపెనీ ఇచ్చిన వివరణ ఏమిటో తెలుసా! ‘ఆ కంపెనీలకు నిధులు ఎక్కడివో మాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందీ తెలుసుకోవాల్సిన అవసరమూ మాకు లేదు. వినోద్ అదానీ వాణిజ్యం, లావాదేవీల గురించి వ్యాఖ్యానించే స్థితిలో మేము లేము’ అని పేర్కొన్నారు. అదే గనుక నిజమైతే గౌతవ్‌ు అదానీ తన సోదరుడిని విడిగా లేదా కుటుంబ సంస్థను నడుపుతున్నారు గనుక భోజన టేజన దగ్గర గానీ ఆ వివరాలన్నీ అడిగి రహస్యాన్ని ఛేదించాలని, తాము లేవనెత్తిన ప్రశ్నలలో 62 నుంచి 88 వరకు నిర్దిష్ట సమాధానాలు చెప్పలేదని పేర్కొన్నది.

హిండెన్‌బర్గ్ సంస్థ నివేదిక వెనక కుట్ర ఉంది అంటున్నారు. మనకు జేవ్‌‌సు బాండ్ అజిత్ దోవల్ అనేక కుట్రలను ఛేదించిందని అని చెబుతున్న ‘రా’, ఎన్‌ఐఎ వంటి సంస్థలున్నాయి, ఆఫ్టరాల్ ఒక చిన్న సంస్థ సంగతి తేల్చేందుకు అమెరికా మీద వత్తిడి తేలేరా? దాని బండారాన్ని బయటపెట్టి జనానికి, అదానీ వంటి పారిశ్రామికవేత్తలకు, వారి కంపెనీల్లో పెట్టుబడులుపెట్టిన వారికి, వాటాలు కొనుగోలు చేసిన లక్షలాది మంది మదుపుదార్లకు ధైర్యం కల్పించలేరా? నష్టాలను నివారించలేరా? విమర్శకుల నోరు మూయించలేరా? భద్రమైన చేతుల్లో దేశం ఉందని, ప్రతి పైసాకు జవాబుదారునని చెప్పటం కాదు నిరూపించాలి. ఇది తగిన తరుణం. బిబిసిచిత్రం గురించి మాట్లాడ లేదు, హిండెన్‌బర్గ్ వంటి సంస్థల కుట్రలను గురించీ అదే మౌనం. చిన్న సందేహం, అవసరమైనపుడు కూడా నరేంద్ర మోడీ నోరు విప్పకపోతే చరిత్ర క్షమిస్తుందా ?

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News