Home తాజా వార్తలు వేగంగా ఎంఎఫ్ పరిశ్రమ వృద్ధి

వేగంగా ఎంఎఫ్ పరిశ్రమ వృద్ధి

Aditya birla sun life amc ipo to open on sep 29

 

పదేళ్లలో ఏడు రెట్లు పెరిగింది
29 నుండి బిర్లా మ్యూచువల్ ఫండ్ ఐపిఒ
ధర శ్రేణి రూ.750-800 మధ్య

న్యూఢిల్లీ : గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఈ పరిశ్రమ మొత్తం అసెట్ అండ్ మేనేజ్‌మెంట్ (ఎయుఎం) రూ.36 లక్షల కోట్లకు పైగా ఉంది. గత 10 సంవత్సరాల్లో ఇది ఏడు రెట్లు పెరిగింది. 2016 సంవత్సరంలో ఫండ్ పరిశ్రమ ఎయుఎం రూ.15.18 లక్షల కోట్లు మాత్రమే. 2030 నాటికి భారతదేశ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ పరిమాణం రూ.100 లక్షల కోట్లుగా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. అంటే వచ్చే 9 ఏళ్లలో ఈ పరిశ్రమ మూడు రెట్లు పెరుగనుంది. ప్రతి నెలా రూ.9,000 కోట్లు ఫండ్ పరిశ్రమలోకి ఎస్‌ఐపి (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా వస్తున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి, నిప్పాన్ వంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీలలో పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన ఉంది. దేశీయ మ్యూచువర్ ఫండ్ కంపెనీలు కూడా స్టాక్‌మార్కెట్లో లిస్టవుతున్నాయి.

బిర్లా సన్‌లైఫ్ ఎంఎఫ్ ఐపిఒ
తాజాగా అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీ అయిన ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్ ఐపిఒ సెప్టెంబర్ 29 నుండి ప్రారంభం కానుంది. ఇది అక్టోబర్ 1న ముగుస్తుంది. కంపెనీ షేరు ధరను రూ.750-800 మధ్య నిర్ణయించారు. దేశంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్ అయిన నాలుగో కంపెనీ బిర్లా సన్‌లైఫ్ ఎంఎఫ్ కానుంది. ప్రస్తుతానికి హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ మ్యూచువల్ ఫండ్, యుటిఐ మ్యూచువల్ ఫండ్ లిస్టెడ్ కంపెనీలు మార్కెట్లోకి వచ్చాయి. నిప్పాన్ లిస్టింగ్ 2017 సంవత్సరంలో జరగ్గా, ఆ తర్వాత హెచ్‌డిఎఫ్‌సి లిస్టయింది. నిప్పాన్, హెచ్‌డిఎఫ్‌సి షేర్లలో ఇన్వెస్టర్లు మంచి లాభాలను పొందారు.

బిర్లా ఎంఎఫ్ ఎయుఎం 3.02 లక్షల కోట్లు
ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ అసెట్ అండ్ మేనేజ్‌మెంట్ (ఎయుఎం) ఆగస్టులో రూ.3.02 లక్షల కోట్లుగా ఉంది. అయితే రూ.6 లక్షల కోట్ల ఎయుఎంతో ఎస్‌బిఐ మ్యూచువల్ ఫండ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్ ఉన్నాయి. బిర్లా మ్యూచువల్ ఫండ్ అనేది బ్యాంకింగ్ పేరెంట్ లేని ఫండ్ హౌస్ కానుంది. ఇది 26 సంవత్సరాల మంచి రికార్డును కలిగి ఉండగా, ఈ సంస్థలో 72 లక్షల ఫోలియోలు ఉన్నాయి. టాప్ 30 నగరాల్లో కంపెనీ మంచి వ్యాపారం చేస్తోంది. ఐపిఒ సమయంలో మొత్తం 3.88 కోట్ల షేర్లు విక్రయించనుంది. దీని ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా చేసుకుంది.

2020 వరకు 135 పథకాలు
బిర్లా మ్యూచువల్ ఫండ్ డిసెంబర్ 2020 నాటికి 135 పథకాలను కలిగి ఉంది. దీనిలో 35 ఈక్విటీ స్కీమ్‌లు, 93 డెట్, 2 లిక్విడ్, 5 ఇటిఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్), 6 ఫండ్ స్కీమ్‌లు ఉన్నాయి. ఇది అనుభవజ్ఞులైన ప్రమోటర్లతో విశ్వసనీయ బ్రాండ్, అయితే మ్యూచువల్ ఫండ్ కంపెనీలో బిర్లా 51 శాతం, సన్ లైఫ్ 49 శాతం వాటా కలిగి ఉన్నారు. బిర్లా గ్రూప్ బహుళ రంగాలలో పనిచేస్తోంది.

2018లో రూ.15,942 కోట్లు
బిర్లా మ్యూచువల్ ఫండ్ మొత్తం ఆస్తులు 2018లో రూ .15,492 కోట్లుగా ఉండగా, ఇది 2020 డిసెంబర్‌లో రూ.19,595 కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో కంపెనీ నికర లాభం 2020 డిసెంబర్‌లో రూ.348 కోట్ల నుండి రూ.369 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సంస్థ లాభం రూ.155 కోట్లుగా ఉంది.

Aditya birla sun life amc ipo to open on sep 29