*సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ
మనతెలంగాణ/తాడ్వాయి(మేడారం): ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసి గిరిజన మేడా రం సమ్మక్క సారలమ్మల జాతరపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. గురువారం మేడారం జాతర పరిసర ప్రాంతాలను ఆయ న పరిశీలించారు. అనంతరం గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మలు ఆదివాసి గిరిజనుల కోసం ప్రాణ త్యాగం చేశారని అందుకే వారు చరిత్రలో నిలిచారన్నారు. రెండు సంవత్సరాలకొకసారి జరిగే మహాజాతరను కోటి మంది కిపైగా భక్తులు వచ్చే జాతరకు శాశ్వత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం లాగా నిత్యం భక్తులు వస్తుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, శాశ్వత ఏర్పాట్లు చేయాలన్నారు.
రవాణా సౌకర్యం లేక చాలా మంది భక్తులు జాతర రాలేకపోయారన్నారు. ఆయన వెంట సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కెళ్లపల్లి శ్రీనువాసరావు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కొలిమి రాజ్ కుమార్, మాజీ ఎంఎల్‌ఎ సారయ్య, ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్, వరంగల్ అర్బన్ కార్యదర్శి కరుణాకర్ తదితరులున్నారు.