Home తాజా వార్తలు ఆ ప్రాంతంలో పనిచేయాలంటే తహసీల్దార్‌లు భయపడుతున్నారు..

ఆ ప్రాంతంలో పనిచేయాలంటే తహసీల్దార్‌లు భయపడుతున్నారు..

ఏజెన్సీ ప్రాంతంలో పనిచేయాలంటే భయం వేస్తోంది
తహసీల్దార్‌లు, రెవెన్యూ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు
ప్రభుత్వం రక్షణ కల్పించాలి
దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి
ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: తహసీల్దార్‌లు ఏజెన్సీ ప్రాంతంలో పనిచేయాలంటే భయపడుతున్నారని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా, గూడూర్ మండలంలో తహసీల్దార్‌పై ఆదివాసీలు (కోయదొరలు) చేసిన దాడి చాలా హేయమైన, పిరికిపంద చర్యగా ఆయన పేర్కొన్నారు. దాడికి యావత్ తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులు మంగళవారం మధ్యాహ్న సమయంలో సిసిఎల్‌ఏతో పాటు అన్ని కలెక్టర్, ఆర్డీవో, మండల కేంద్రాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి లంచ్ విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేసినట్టు ఆయన పేర్కొన్నారు. సిసిఎల్‌ఏ జరిగిన నిరసన కార్యక్రమంలో రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆందోళన కార్యక్రమం ట్రెసా, టిజిటిఎల సంఘాల అధ్వర్యంలో చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేస్తున్న రెవెన్యూ అధికారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో లంబాడీలకు, ఆదివాసుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందని, వారి మధ్య ఆధిపత్య పోరు చాలాకాలంగా నడుస్తుందన్నారు. ఈ క్రమంలో వారి వర్గాలను పెంచుకోవడం కోసం ఏజెన్సీ ధ్రువ పత్రాలు జారీ చేయడం కోసం అక్కడ పనిచేస్తున్న తహసీల్దార్లను, రెవెన్యూ ఉద్యోగులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆరోపిం చారు.

ఈ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెంబర్.24. ప్రకారం ఎవరైతే మండల పరిధి లోని సంబంధిత గ్రామాల్లో నివసిస్తున్న లంబాడీ, ఆదివాసుల కులాలకు ఏజెన్సీ ధ్రువ పత్రాలను జారీ చేయాలని గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు పాటించకుండా తహసీల్దార్ పై దాడి చేయ్యడం సరైన పద్ధతి కాదన్నారు. రెవెన్యూ శాఖ పరిరక్షణ ప్రభుత్వ బాధ్యతని, ఎంతో విలువైన ప్రభుత్వ భూముల సంరక్షించేది తహసీల్దార్లని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌పై దాడి చేసిన ఆదివాసులను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రెవెన్యూ ఉద్యోగులకు ప్రభుత్వం మనో ధైర్యాన్ని కల్పించి వారిలో ఉత్సాహాన్ని నింపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దాడి చేసిన వారే తహసీల్దార్ గౌరి శంకర్‌పై అట్రాసిటీ కేసు పెట్టడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. ఎం.నారాయణరెడ్డి, కార్యదర్శి, కె.నిరంజన్, కార్యనిర్వాహక కార్యదర్శి, ట్రెసా సెంట్రల్ యూనియన్ సభ్యులతో పాటు టిజిటిఏ సంఘాల నాయకులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Adivasis attack on Revenue employees in Mahabubabad