Thursday, April 18, 2024

సెప్టెంబర్‌లో విద్యాసంస్థల్లో ప్రవేశాలు?

- Advertisement -
- Advertisement -

Admissions to educational institutions in September

హైదరాబాద్ : కరోనా కారణంగా ఈ సారి అకడమిక్ క్యాలండర్ పూర్తిగా మారింది. ఈ ఏడాది ప్రవేశాలు, పరీక్షలు మొత్తం సెప్టెంబర్‌లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి, ఏప్రిల్‌లో పూర్తి కావాల్సిన సాధారణ పరీక్షలు, మే జరగాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఇప్పటివరకు జరగలేదు. దాంతో జూన్, జూలై ప్రారంభమయ్యే విద్యాసంవత్సరం సెప్టెంబర్‌కు చేరింది. విద్యాశాఖ కార్యకలాపాలన్నీ దాదాపు మూడు నెలలు వెనక్కి వెళ్లాయి. సెప్టెంబర్ నాటికి వైరస్ వ్యాప్తి తగ్గితేనే పాఠశాలలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే మరికొంత ఆలస్యం కావచ్చు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాధారణంగా ఏటా జూన్ మొదటి వారంలో పుస్తకాలు పంపిణీ చేస్తారు. కరోనా కారణంగా ఈసారి పుస్తకాల పంపిణీ బుధవారం ప్రారంభమైంది. విద్యార్థులకు పాఠశాలలకు వెళ్లకపోయినా ఇంటి వద్ద ఉండే చదువుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో పుస్తకాల పంపిణీని ప్రారంభించారు.

సెప్టెంబర్‌లో కౌన్సెలింగ్

రాష్ట్రంలో ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షలు ఆగస్టులో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు రెండవ వారం లేదా మూడవ వారంలో పరీక్షలు నిర్వహించి అదే నెల చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాలు ప్రకటించనున్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో క్టోబర్ 15 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఎఐసిటిఇ) ఆదేశించింది. దాని ప్రకారం సెప్టెంబర్‌లో కౌన్సెలింగ్ పూర్తి చేయాలి. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో ఆగస్టులో ఎంసెట్ నిర్వహించి, ఇసెట్ తదితర సెప్టెంబర్‌లో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ చివరి సెమిస్టర్ పరీక్షలను సెప్టెంబరు చివరిలోపు నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) సూచించింది. దీంతో విశ్వవిద్యాలయాలన్నీ ఆగస్టు రెండవ వారంలో లేదా సెప్టెంబర్‌లో నెలలో పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి.

విద్యా సంవత్సరంపై ఇప్పుడే చెప్పలేం : హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

ఆన్‌లైన్ తరగతులు, విద్యా సంవత్సరంపై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించింది. విద్యా సంవత్సరం ప్రారంభంపై ఇప్పుడే చెప్పలేమని ప్రభుత్వం పేర్కొంది. విద్యా సంవత్సరం ప్రారంభమనేది కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని నివేదికలో తెలిపింది. కరోనా తీవ్రత వల్ల చాలా రాష్ట్రాలు ఇంకా విద్యాసంవత్సరం ఖరారు చేయలేదని చెప్పింది. అనువైన విద్యాసంవత్సరం ఖరారు చేసే పనిలో ఉన్నామని కోర్టుకు విన్నవించింది. అదనపు ఆర్థికం భారం లేని బోధన పద్ధతులపై కసరత్తు జరుగుతోందని తెలిపింది.

విద్యాసంవత్సరం, నిరంతర అభ్యసన విధానం ఖరారయ్యాక ఆన్‌లైన్ తరగతులపై మార్గదర్శకాలు జారీ చేస్తామని పేర్కొంది. బడుల ప్రారంభంపై తల్లిదండ్రుల ఫీడ్‌బ్యాక్ తెలపాలని కేంద్రం కోరిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇప్పటికే డిఇఒలను ఆదేశించామని, ఆగస్టు 5 వరకు సమయం ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలు తెరిచే వరకు టివిలు, ఆన్‌లైన్‌లో పాఠాలు కొనసాగించేలా ముసాయిదా పాలసీ సిద్ధంగా ఉందని ప్రభుత్వం వివరించింది. డిజిటల్ విద్యపై ఈ నెల 14న ఎన్‌సిఇఆర్‌టి మార్గదర్శకాలు జారీ చేసిందని, విద్యారంగ నిపుణులతో చర్చించాక పాలసీపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News