Home రాష్ట్ర వార్తలు దత్తత గ్రామాల డ్రీమంతులు

దత్తత గ్రామాల డ్రీమంతులు

kcr-and-maheshbabu-&-kavithశ్రీమంతుడు సినిమాలో మాదిరిగా ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకొని వాటి అభివృద్ధికి కృషి చేయడమనే మంచి పద్ధతి ఒకటి పురి విప్పుకున్నది. ఇలా గ్రామాలను దత్తత తీసుకున్న వారిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఎంపి కవిత, సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, చలనచిత్ర ప్రముఖులు మహేష్ బాబు, ప్రకాశ్‌రాజ్, సుమన్ వంటి వారున్నారు. వారు ఆయా గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు ఆ విషయం బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆ గ్రామాలను చూసి ఇతర పల్లెలు ఈర్ష పడ్డాయి. అయితే దత్తత గ్రామాలు నిజంగానే అభివృద్ధి చెందాయా? ఆయా ప్రముఖులు ఆ గ్రామాలకు ఇంతవరకు చేసిందేమిటి, చేయనిదేమిటి? అవి ఇప్పుడే స్థితిలో ఉన్నాయి? శ్రీమంతులు దత్తత తీసుకున్న ఈ గ్రామాల ప్రజలు రోడ్డు, పాఠశాల, పక్కా ఇళ్లు, ఉపాధి అవకాశాలు వంటివి పొంది హర్ష పులకాంకితులవుతున్నారా లేక దత్తత తీసుకున్న ప్రముఖుల జాడే లేక వారి రాక కోసం వారిచ్చిన వరాల సాఫల్యం కోసం కలలు కంటూ విఫల స్వాప్నికులుగా-డ్రీమంతులుగా మిగిలిపోయారా?

సిఎం చెక్కుతున్న శిల్పం చినముల్కనూరు

KCR23అది జూలై 15, 2015. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ సాయంత్రం గ్రామానికి వచ్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామం తీరు తెన్నుల చూసిన సిఎం తాను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోనే ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతానని కూడా ప్రకటించారు. నెల కో సారి గ్రామానికి వస్తానని చెప్పారు. వెంటనే జిల్లా కలెక్టర్ ద్వారా గ్రామస్థులకు.కావల్సిన సదుపాయాల పై కసరత్తు ప్రారంభమైంది.
వరాల జల్లు..
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కెసిఆర్ ఆ రోజు గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామంపై వరాల జల్లు కురిపించారు. గ్రామానికి మొదటగా గ్రామజ్యోతి కింద రూ.10 లక్షల నిధులు ప్రకటించారు.. అలాగే మరో 50 లక్షలు ప్రకటించారు. తర్వాత ఆగస్టు 8 న గ్రామంలో పర్యటించారు. వాడవాడలా తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాడుబడ్డ బావులు, సగం కూలిన ఇళ్లను చూసి చలించిన సీఎం వెంటనే గ్రామానికి అవసరమైన ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ ఆగస్టు 24 న వచ్చి పాడుబడ్డ ఇళ్లను కూల్చివేసే పనులకు శ్రీకారం చుట్టారు. ఆ రోజంతా అక్కడే గడిపారు. ఉదయం 10 గంటలకు వచ్చిన ఆయన రాత్రి 9 గంటల వరకు గ్రామంలోనే ఉన్నారు. గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులతో గ్రామాభివృద్దిపై సమాలోచనలు చేశారు. పంచాయతీ పాలకవర్గం సభ్యులతో మాట్లాడారు. స్థానిక మహిళా సంఘాలతో సహపంక్తి భోజనం చేశారు. సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వరాల జల్లు కురిపించారు. గ్రామానికి రూ.17 కోట్ల నిధులను ప్రకటించారు. అవసరమైతే వంద కోట్లు కేటాయిస్తానని పలు సందర్భాల్లో ఆయన చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు ఇతర అభివృద్ది పనులు జరుగుతున్నాయి.కాని డబుల్ బెడ్ రూం ఇళ్ళపని ఇంకా గట్టిగా మొదలు కాలేదు. కొత్త ఇళ్ల నిర్మాణం కోసం ఉన్న వాటిని కూల్చివేయడం వల్ల ప్రజలు తాత్కాలిక ఆవాసాల్లో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో 400 మంది డబుల్ బెడ్ రూం ఇళ్ళ కోసం దరఖా
స్తు చేసుకున్నారు. వారిలో 243 మందికి ఇళ్ళు మంజూరు అయ్యాయి. మిగతా వారు కూడా డబుల్ బెడ్ రూం ఇళ్లను కోరుతున్నారు. కొత్త ఇళ్ళ ఆశతో 200 మంది పేదలు ఉన్నవాటిని కూల్చుకున్నారు.
జరుగుతున్న అభివృద్ధి పనులు
ఊరిచెరువును దత్తత తీసుకున్న ఎస్.పి.
సిఎం దత్తత గ్రామంలో పోలీసులు మేము సైతం అంటూ ముందుకొచ్చారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జోయల్ డేవిస్ గ్రామంలోని ఊరచెరువును దత్తత తీసుకున్నారు. తుమ్మ పొదలు, పిచ్చి మొక్కలను తొలగించారు. పూడిక మట్టిని తీయించి రైతుల భూములకు తరలింప చేశారు. కట్ట మరమ్మత్తులు చేయించారు. ఈ పనులు పర్యవేక్షించేందుకు ఎస్.పి. పలుమార్లు గ్రామంలో పర్యటించారు. రోజువారి పనులను హుస్నాబాద్ సిఐ, చిగురుమామిడి ఎస్.ఐ. కు (పర్యవేక్షణ బాధ్యతలు ) అప్పగించారు. ఊర చెరువు పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. గ్రామ ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు చెరువులు రుద్రునికుంట, భూంకుంటను మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు.
యువత దేశ భవిష్యత్‌కు సారధులు అనేదాన్ని గుర్తించిన అధికారులు దత్తత గ్రామంలో వారి కోసం ప్రత్యేక మైన శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇందుకోసం యూనిట్లు మంజూరు చేశారు. స్పోకెన్ ఇంగ్లీష్, మల్టీమీడియా, ఎలక్ట్రికల్, హౌస్‌వర్కింగ్, ల్యాండ్‌సర్వే, ప్లంబింగ్, శానిటేషన్, వర్క్ సూపర్‌వైజర్, బ్యూటిషియన్, కంప్యూటర్ లో శిక్షణ ఇస్తున్నారు. మొత్తం 64 మందిని శిక్షణకు ఎంపిక చేశారు. బేకరీ ఉత్పత్తుల తయారీ కేంద్రం కోసం రూ.లక్షా 70 వేలు, పేపర్ ప్లేట్ మిషనరీ, పేపర్ బ్యాగ్ మిషన్ కోసం రూ.78 వేలు మంజూరు చేశారు.
వ్యవసాయం కోసం…
రైతుల కోసం వ్యవసాయ శాఖ ద్వారా సుస్థిర సాగు ఏ విధంగా చేయాలనే దానిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్‌ఎంఎస్‌ఎ ద్వారా జిల్లోలో నాలుగు గ్రామాలను ఎంపిక చేయగా,, అందులో ముల్కనూర్ కు చోటు లభించింది. దీనికింద రూ.30 లక్షలు కేటాయించారు. ఇందులో రూ.22 లక్షలు పాడి పశువులకు, రూ.8 లక్షలు కరెంట్ మోటార్లకు, పివిసి పైపు లైన్లకు కేటాయించారు. దీనికి లబ్దిదారులను ఎంపికి చేసి ఇప్పటికే రుణం అందించారు. రోజురోజుకు గ్రామ ప్రజల్లో నిరాశ, రాజకీయ పక్షాల నిరసనల వల్ల తాజాగా టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో గ్రామాభివృద్ది కమిటిని ఏర్పాటు చేసి అభివృద్ది పనులపై దృష్టిని కేంద్రీకరించి పనులను సమీక్షిస్తున్నారు.
అభివృద్ధి కమిటీ..
చైర్మన్ ముప్పిడి జయప్రకాశ్ రెడ్డి
ఉపాధ్యక్షుడు పెసరి రాజేశం
కోశాధికారి కయ్యం కనుకయ్య
ప్రధాన కార్యదర్శి మెరుగు రాజమౌళి
సంయుక్త కార్యదర్శి పైడిపల్లి ఎల్లయ్యతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
ముల్కనూర్ గ్రామం సమాచారం..
జనాభా- 1225 మంది
కుటుంబాలు – 654
ఓటర్లు
స్త్రీలు – 1233
పురుషులు – 1225
పాఠశాలలు – 3

జెడి తీర్చిదిద్దిన చిన్నమందడి

jdసిబిఐ పూర్వపు జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కృషితో రూపులు మెరు గుపరు చుకొన్నది. చిన్నమందడి గ్రామం. రాష్ట్రంలోనే నెంబర్-1 గ్రామంగా చిన్నమందడిని అభివృద్ది చేస్తానని జెడి చెప్పారు. ఈ గ్రామాన్ని చూసి మరింతమంది శ్రీమంతులు పుట్టుకొచ్చారు.
గత మూడున్నర సంవత్సరాల క్రితం పాలమూరు జిల్లాలో పూర్తిగా వెనకబడిన పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామాన్ని సిబిఐ పూర్వపు జెడీ లక్ష్మినారాయణ దత్తత తీసుకున్నారు. వందేమాతరం ఫౌండేషన్‌తో పాటు గ్రామానికి చెందిన సూర్యచంద్రారెడ్డి సహకారంతో చిన్నమందడిని దత్తత తీసుకునేందుకు లక్ష్మినారాయణ ముందుకు వచ్చారు. గత మూడున్నర సంవత్సరాల క్రితం గాంధీ జయంతి సందర్భంగా చిన్నమందడి గ్రామానికి మొదటి సారి వచ్చిన ఆయన గ్రామస్థులను సమన్వయపర్చారు. గ్రామస్థుల మధ్య అనైక్యత, విబేధాలను గమనించారు. విభిన్న వ్యక్తులతో చర్చించి పార్టీలకతీతంగా గ్రామస్థులను ఒక్క తాటిపైకి తీసుకువచ్చారు. ఐకమత్యాన్ని నెలకొల్పారు. గ్రామ అభివృద్ది కమిటిని వేసి అందులో అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించి తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లు తదితర అంశాలపై పది కమిటీలను నియమించారు. అందులో మహిళలతో సహా 150 మందిని భాగ స్వాములను చేశారు. అనంతరం అరు నెలల్లోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో గ్రామ స్థులంతా పార్టీలక తీతంగా ఏకగ్రీవంగా మహిళా సర్పంచిని ఎన్నుకున్నారు. దాంతో గ్రామంలో ఐకమత్యంగా అభివృద్దికి నాంది పడింది.
ప్రతి ఇంటి ముందు పచ్చదనం
బాలవికాస స్వచ్చంద సంస్థ సహకారంతో పాటు గ్రామంలో ప్రతి ఇంటినుంచి రూ.250 చొప్పున విరాళాలు సేకరించి ప్రజల బాగస్వామ్యంతో మూడు లక్షల రూపాయలతో శుద్ధజల ప్లాంటును ఏర్పాటు చేశారు. ఎటిఎం కార్డు మాదిరిగా ఎటిడబ్లూ కార్డును ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి అవసరాన్ని బట్టి మంచినీరు సరఫరా చేసే విధంగా ప్రణాళికను రూపొందించారు. మూడు రూపాయలకు ఇరవై లీటర్ల నీరు ఇచ్చేలా ఏర్పాటు జరిగింది. పచ్చదనం-పరిశుభ్రతలో బాగంగా గ్రామంలో ప్రతి ఇంటికి 10 మొక్కలను సరఫరా చేయించారు. సీసీరోడ్ల నిర్మాణానికి ఎంపి సుజనాచౌదరి నిధుల నుండి రూ.10లక్షలు గ్రామానికి కేటాయించి ఆపని పూర్తి చేశారు. అలాగే శిథిలావస్థకు చేరుకున్న దేవాలయాన్ని తొలగించి అదే స్థలంలోదాదాపు రూ.15లక్షల వ్యయంతో చూడచక్కని దేవాలయాన్ని నిర్మింపచేశారు.
మొబైల్ మెడికల్ వాహనం ఊళ్లోకి
సాక్షరభారత్ కో ఆర్డినేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి చదువు చెప్పేలా చేశారు. జిల్లా కలెక్టర్‌తో చర్చించి మోడల్ సాక్షర భారత్ కేంద్రాన్ని గ్రామంలో నెలకొల్పారు. గ్రామం లోని ప్రతి పేద, బడుగు, బలహీన వర్గాల వారికి మెరుగైన వైద్య సేవలు అందే విదంగా ఇండియన్ ఆయిల్ కార్పోరే షన్ ద్వారా మొబైల్ ఆసుపత్రి వాహనం ప్రతి వారం గ్రామానికి వచ్చి మెరుగైన వైద్య సేవలు, మందులు ఉచి తంగా అందే విధంగా చేశారు. పాఠశాలలో మెరుగైన వసతులను కల్పిం చారు. గ్రామానికి చెందని అమరేం దర్‌రెడ్డి అనే ఓ వ్యక్తి సహాయంతో రూ.6లక్షల విలువ చేసే ఫర్నిచర్‌ను కొను గోలు చేసి పాఠశాలకు ఇప్పించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఎల్‌ఈడీ విద్యుద్దీపాలు అమర్చేందుకు లక్ష్మినారాయణ రూ.50వేలు ఇచ్చారు. ఎస్‌సి,ఎస్‌టి భూ ముల్లో అభివృద్ధి పనులు చేయించడంతో పాటు సాగునీటి వసతిని కల్పించేందుకు ఇందిరాజలప్రభ ద్వారా వారి భూముల్లో బోర్లు వేయించారు. హార్టికల్చర్ పండ్ల తోటలు పెంచడం వంటి కార్యక్రమాలను రైతులకు అందజేశారు.
మరుగుదొడ్లకు పదిలక్షలు
గత ఏడాది నవంబర్10న గ్రామానికి వచ్చి స్వచ్ఛ భారత్‌లో భాగంగా ఆయన మరికొన్ని అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఇంటింటి చెత్త సేకరించి వేసేందుకు డంపింగ్‌యార్డును ఏర్పాటు చేయించారు. మొక్కలకు ఆటోరిక్షాల్లో డ్రమ్ముల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాటు చేశారు. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఎస్‌సిల కమ్యూనిటి హాల్ కోసం గ్రామానికి చెందిన నాగేశ్వర్‌రెడ్డి ద్వారా స్థలాన్ని ఉచితంగా ఇప్పించి వారు భవన నిర్మాణానికి మరో రూ.2లక్షలు విరాళంగా అందజేసేందుకు ఆయనను ఒప్పించారు. కలెక్టర్‌తో చర్చించి మరుగుదొడ్లను నిర్మించుకున్న లబ్దిదారులకు వెంటనే బిల్లులు చెల్లించేందుకు వీలుగా కలెక్టర్ నేరుగా ఎంపిడిఓ ఖాతాలో రూ.10లక్షలు జమ చేయించారు.
శ్రీమంతుడు సినిమా రాకముందే అంటే మూడున్నర సంవత్సరాల క్రితమే చిన్నమందడిని దత్తతకు తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. సంపూర్ణ మద్యనిషేధంలో భాగంగా గ్రామంలో నాటుసారా, మద్యం, బెల్టు విధానాలు లేకుండా ఆయన చేశారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులను గ్రామానికి రప్పించి ఆయా శాఖల ద్వారా చిన్నమందడి గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపా యాలు, అవసరాలపై చర్చించి నిధులను కేటాయించే విధంగా కలెక్టర్‌తో కలిసి చిన్నమందడిని పలుమార్లు సందర్శించి అత్యధికంగా నిధులు కేటాయించడంతో పాటు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునే విదంగా ప్రజలకు అవగాహన కల్పించారు.

‘కందకుర్తి’  కవిత

Kavitakkaనిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కల్వకుర్తి గ్రామాన్ని పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత దత్తత తీసుకున్నారు. 2014 అక్టోబర్2న దత్తత గ్రామంగా స్వీకారం చుట్టారు. జనవరి మాసం 2015లో కందకుర్తి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆరంభించారు. ఆమె ముందుగా గ్రామ మ్యాప్‌ను చూశారు. అప్పటి నుంచి గ్రామంలో నెలకొన్న సమస్యలను, అవసరాలను, పరిస్థితులను జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వాటి పరిష్కారం కోసం ఆమె ప్రయత్నిస్తున్నారు. నీటి సమస్య అక్కడ చాలా త్రీవ్రం. అందుకే దాని పరిష్కారానికి పెద్ద పీట వేయాలని నిశ్చయించారు. లక్షన్నర రూపాయల సొంత నిధులతో స్వచ్ఛంద నీటి కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. రెండు సార్లు గ్రామాన్ని పర్యటించారు. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులతో సమీక్ష సమావేశాలను జరిపారు. గ్రామ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడానికి ప్రతిపాదనలు పంపాలని ఆమె అధికారులను ఆదేశించారు. గ్రామంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని బ్యాంకర్లతో పలుమార్లు సమావేశమయ్యారు. అంగన్‌వాడి స్కూల్‌కి కొత్త రూపురేఖలు తెచ్చారు. కందకుర్తి పాఠశాలలో మౌలిక సదుపాయాల పైన దృష్టిపెట్టారు. పాఠశాలను అందంగా తీర్చిదిద్దేలా చేశారు.
గ్రామంలో ఈ అవసరాలున్నాయి
8 కోట్లరూపాయలతో గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదనలు పంపారని ఆ గ్రామ సర్పంచ్ మీర్జాకలీంబేగ్ చెప్తున్నారు.్ర ముఖ్యంగా నాలుగు కిలోమీటర్ల మేరకు సిసి రోడ్లు, నాలుగు కిలోమీటర్ల పొడవున మురికి కాలువల నిర్మాణం అవసరం. త్రాగునీటి సమస్యను శాశ్వతంగా తీరడం అత్యవసరం. ప్రస్తుతం మహిళా భవనం, గ్రంథాలయం, ఆరోగ్య ఉపకేంద్రం, గ్రామ పంచాయతీ లాంటి భవనాలకు కోటి రూపాయల వరకు నిధులు మంజూరయ్యాయి. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం జరగబోతోంది. గ్రామంలో 5లక్షల విరాళాలను సేకరించి స్వాగత తోరణం నిర్మాణం చేపట్టారు.
సాక్షర భారతితో ప్రత్యేక తరగతులు
గ్రామంలో సుమారు 496 మంది నిరక్షరాస్యులుగా ఉన్నట్లు గుర్తించారు. వారిని అక్షరాస్యులుగా తయారు చేసేందుకు సాక్షర భారతి వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తరగతులను నిర్వహిస్తున్నారు. పూర్తి అక్షరాస్యత గ్రామంగా చేయాలని అధికారులు, కలెక్టర్ యోగితారాణా చొరవ చూపుతున్నారు. కలెక్టర్ గత సంవత్సరంలో రెండు సార్లు కందకుర్తి గ్రామాన్ని సందర్శించి గ్రామంలోని సమస్యలను, వసతులను నేరుగా తెలుసుకున్నారు. ్ర ఇండ్లు లేని నిరుపేదలు 300కు పైగా ఉన్నారు. మంది ప్రభుత్వ డబుల్ బెడరూం ఇండ్లు ఇవ్వాలని వారు దరాఖాస్తులు చేసుకున్నారు.

సిద్దాపూర్‌పై హీరో మహేష్ బాబు శీతకన్ను

MAHESHశ్రీమంతుడు సినిమా పేరు వింటేనే ఠక్కున గుర్తొచ్చే పదం దత్తత. పుట్టి పెరిగిన ఊరికి ఎంతో కొంత చేయాలనే ఉత్తమ సంకల్పంతో తెరకెక్కిన భారీ చిత్రం శ్రీమంతుడు. సినిమా విజయబావుటా ఎగురవేశాక స్వయంగా హీరో మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామాలను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఏ గ్రామం దత్తతకు నోచుకుంటుందా అని ఎందరో మారుమూల పల్లె వాసులు ఎదురు చూశారు. మా గ్రామం అంటే.. కాదు మా గ్రామమే కనీస వసతులకు దూరంగా ఉంది హీరో మహేష్ బాబు మా మారుమూల గ్రామాన్నే దత్తత తీసుకుంటాడంటూ అమాయక జనంతో పాటు ఆయన అభిమానులు కూడా ఆశించారు. చివరకు రాష్ట్ర మంత్రి వర్యులు కే.రామారావు సూచన మేరకు మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూర్ మండలం సిద్దాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. మంత్రి రామారావు, హీరో మహేష్ బాబులు ఈ విషయాన్ని మీడియాకు ధృవీకరించారు. సిద్దాపూర్ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇక మహేష్ బాబు తమ గ్రామంలో అడుగు పెట్టడమే తరువాయి అని ఎదురుచూడసాగారు. సిద్దాపూర్ గ్రామానికి మహేష్ బాబు రాలేదు సరి కదా కనీసం సర్వే కూడా నిర్వహించలేదు. మరోవైపు ఆయన అభిమాన సంఘం నాయకులు ఖాదర్ గోరి, దిడ్డి రాంబాబు తదితరులు సిద్దాపూర్ గ్రామాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను కనుక్కుని వెళ్ళారు. మహేష్‌బాబును పోస్టర్లలో చూడటం తప్ప స్వయంగా చూసే అవకాశం సిద్దాపూర్ వాసులకు కలగలేదు. ప్రస్తుతం బ్రహ్మోత్సవం షూటింగ్‌లో ఉన్న మహేష్‌బాబు సిద్దాపూర్‌పై దృష్టి సారించే అవకాశాలు తక్కువేనంటున్నారు. ముఖ్యంగా ఆ మధ్య మహేష్ బాబును కలుసుకొని తమ అభినందనలు తెలుపడానికి వెళ్ళిన సిద్దాపూర్ గ్రామస్థులతో మహేష్ బాబు సరిగ్గా స్పందించలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సిద్దాపూర్‌లో అలా.. కొండారెడ్డి పల్లిలో ఇలా.. ఎందుకు ఇలా జరుగుతుందని అటు అభిమానులు, ఇటు జనాలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు రాజధానికి సమీపంలోని గ్రామాన్ని దత్తత తీసుకున్నారని కనీస వసతులు లేని మారుమూల పల్లెను అభివృద్దికి ఎంచుకోలేదన్న విమర్శలున్నాయి.
ఆశగా ఎదురు చూశాం.. ఫలితం లేదు..
– సిద్దాపూర్ సర్పంచ్ ఎర్రోళ్ళ నర్సమ్మ
సిద్దాపూర్ గ్రామాన్ని హీరో మహేష్ బాబు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించడం పట్ల ఎంతో సంతోషం కలిగినప్పటికి నెలలు గడుస్తున్నా ఆయన మా గ్రామాన్ని సందర్శించలేదు. గ్రామం అభివృద్ది చెందుతుందని వెయ్యికళ్ళతో ఎదురు చూశాం.. కానీ హీరో స్పందించక పోవడంతో ఆశలన్నీ నిరాశలు అయ్యాయి. ఇప్పటికైనా సార్ స్పందించి మా గ్రామాన్ని అభివృద్ది చేస్తారని ఎదురు చూస్తున్నాం..
మా హీరో మాట ఇచ్చారంటే..
కృష్ణ మహేష్ ప్రజాసేన అధ్యక్షులు ఖాదర్ గోరి.
మా హీరో మాట ఇచ్చారం టే తప్పకుండా గ్రామాన్ని అభివృద్దిచేస్తారు.. కొన్ని అనివార్య కారణాల వల్ల గ్రామాన్ని సందర్శిం చలేదు. షూటింగ్‌లలో బిజీగా ఉన్నట్లు తెలిసింది. గ్రామస్థులు, అభిమానులు నిరాశ చెందవద్దు. త్వరలో పనులు ప్రారంభించే విధంగా ప్రణాళికలు రూపొందుతున్నట్లు సమాచారం ఉంది.

కొండారెడ్డిపల్లిలో ప్రకాశ్ రాజ్ అభివృద్ధి అడుగులు

prakash-rajమరో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డి పల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అనుకున్నదే తడువుగా అడుగులు ముందుకు వేసి రాష్ట్ర మంత్రి కె. తారకరామారావును కలిసి అధికారికంగా కొండారెడ్డి పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో సర్పంచ్, ఎంపిటిసిల సహకారంతో ప్రజల్ని కూడగట్టి గ్రామంపై సర్వే నిర్వహించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్‌తో పాటు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టికే శ్రీదేవిని గ్రామానికి ఆహ్వానించి గ్రామ అభివృద్దిపై సమీక్ష నిర్వహించారు. గ్రామంలో పలు ధపాలుగా సమావేశాలు నిర్వహించి మంచినీటి వసతిని కల్పించేం దుకు ముందుగా నడుంబి గించారు. ఆ తరువాత విద్య, వైద్యం, రోడ్లు, తదితర ఆర్థిక పరి పుష్టికి సంబంధించిన నిర్ణయాలు తీసుకొని వాటిని మెల్లమెల్లగా అమలు చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్ వ్యవసాయ క్షేత్రంలో ఫామ్‌హౌస్ ఈ గ్రామంలోనే ఉంది.

దత్తత గ్రామాన్ని సందర్శించని సుమన్

Suman1మాడ్గుల మండలంలోని సుద్ధపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ప్రముఖ సినీ హీరో సుమన్ ఆర్భాటంగా ప్రకటించి సుమారు ఐదు నెలలు కావస్తున్నా నేటికీ గ్రామాన్ని సందర్శించక పోవడంతో విమర్శలకు తావిస్తోంది. దీంతో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని భావించిన ప్రజలు అది ఎండమావిగానే మిగిలిందని వారు వాపోయారు. అసలు హీరో సుమాన్ సుద్ధపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నాడా… లేదా..? అని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో తాగునీటి ఎద్దడి, పారిశుద్ధం, రోడ్ల నిర్మాణం పనులు తీరుతాయని భావించారు గ్రామస్థులు. ఇప్పటికైనా హీరో సుమన్ తమ గ్రామాన్ని దత్తత తీసుకొని ఉంటే గ్రామాన్ని సందర్శించి అభివృద్ధి పథంలో నడిపించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయమై సర్పంచ్ వెంకటేశ్వర్లను వివరణ కోరగా సుద్ధపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న గ్రామం నిజమేనని మార్చిలో గ్రామాన్ని హీరో సుమన్ పర్యటిస్తారని ఆయనకు హామీ ఇచ్చారని సర్పంచ్ మన తెలంగాణకు తెలిపారు.