Home ఆదిలాబాద్ రెక్కలు విప్పిన కల్తీ మద్యం దందా

రెక్కలు విప్పిన కల్తీ మద్యం దందా

రూ.కోట్ల రూపాయల్లో సాగుతున్న అక్రమ వ్యాపారం
జిల్లాలోనే తయారీ కేంద్రాలు
చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు
నామమాత్రపు దాడులతో సర్కారు
ఆదాయానికి భారీగా గండి

Winesజిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నకిలీ మద్యం దందా సాగుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల టాస్క్‌ఫోర్స్ అధికారులు జరిపిన ఆకస్మిక దాడుల్లో ఈ నకిలీ మద్యం గుట్టు రట్టయిన సంగతి తెలిసిందే. నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, రామకృష్ణపురం, శ్రీ రాంపూర్, కాగజ్‌నగర్, భైంసా, తదితర చోట్ల మద్యం దుకాణం వ్యాపారులే కల్తీ దందాను సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ అధికారులు ఈ దాడుల్లో కల్తీ మద్యం కలిగి ఉన్న మూడు దుకాణాలను సీజ్ చేయడం గమనార్హం. అయితే కొంత మంది వ్యక్తులు ఎక్సైజ్ అధికారుల నిర్లక్షాన్ని ఆసరాగా చేసుకుంటూ కల్తీ మద్యంను తయారు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. – మన తెలంగాణ/ ఆదిలాబాద్ ప్రతినిధి

ఎక్సైజ్ అధికారుల ఉదాసీనత కారణంగా కల్తీ మద్యం విక్రయాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొంత మంది వ్యాపారులు కొత్త టెక్నిక్‌లను ప్రయోగిస్తూ మద్యాన్నికల్తీ చేస్తున్నారు. మద్యం బాటిళ్ల మూతలను ఈ టెక్నిక్‌తో తీసి అందులో నీరు గానీ, స్పిరిట్‌ను గానీ, చీప్ లిక్కర్‌ను గానీ కలుపుతున్నారన్న ఆరోపణలున్నాయి. వీటిని కలిపిన తర్వాత యధావిధిగా ఆ సీసలకు మూతలు బిగిస్తుండడం గమానర్హం. ఇలా చాలా రోజుల నుండి కల్తీ మద్యం తయారవుతున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా కల్తీ మద్యాన్నికొంత మంది తయారు చేస్తుండగా మరి కొంత మంది పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుండి కూడా దేశీ దారును జిల్లాలోకి చేరుస్తున్నారంటున్నారు. సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టులు సైతం కళ్లుమూసుకుంటున్నాయని విమర్శలున్నాయి. ఎప్పటికప్పుడు దాడులు, తనిఖీలు చేస్తూ కల్తీ మద్యంను నిరోధించాల్సినా ఎక్సైజ్ అధికారులు స్పందించకపోతుండడం కల్తీ వ్యాపారులకు కలిసొస్తుందంటున్నారు. ఇప్పటికైనా సదరు యంత్రాంగం ఈ దిశగా దృష్టి సారించి సరైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.