Home స్పెషల్ ఆర్టికల్స్ నగర యువతకు ఫేస్‌బుక్‌తో వల

నగర యువతకు ఫేస్‌బుక్‌తో వల

Facebook-Chatting

గుట్టుగా కొనసాగుతున్న వ్యభిచారం
రహస్యంగా వీడియో చిత్రీకరణ
ముంబై నుండి యువతుల సరఫరా

గోషామహల్ : ఫేస్‌బుక్‌లో ఆసక్తికరమైన సమాచారం…. అది చదివితే మీకు అమ్మాయిలు కావాలా అనే అర్థం… అనంతరం ఫోన్ నెంబర్ వస్తుంది… రింగ్ చేస్తే అమ్మాయి మీ గదికి చేరుతుంది…ఇదీ నగరంలో సాగుతున్న వ్యభిచారం తీరు. నెటిజన్లు విశేషంగా సోషల్ మీడియాను వినియోగించడాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యభిచార వృత్తి నిర్వాహకులు ఫేస్‌బుక్‌ను తమ వ్యాపారానికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఫేస్‌బుక్‌లో పంపుతున్న సమాచారానికి ఆకర్షితులైన వారికి ఇతర రాష్ట్రాలకు చెందిన సుందరాంగులను ఎరగా వేస్తున్నారు. వారి నుండి లక్షల్లో దండుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన వారు కొందరిని బ్లాక్ మేయిలింగ్‌ను కూడా చేస్తున్నారు. ఆ క్రమంలోనే నగరంలోని బేగంబజార్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కాల్‌గార్ల్ ముఠా వలలో చిక్కుకుని రూ. 30 లక్షలు పోగొట్టుకున్నారు. అయినా ముఠా తమ బ్లాక్ మెయిలింగ్‌ను కొనసాగిస్తుండటంతో ఆయన తప్పని పరిస్థితిలో పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఆప్జల్‌గంజ్ పోలీసులకు దర్యాప్తులో దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

వివరాల్లోకి వెళ్ళితే…. బేగంబజార్‌కు చెందిన ఓ వ్యాపారి ఫేస్‌బుక్ ఖాతాలో మీకు అందమైన అమ్మాయిలు కావాలా…? వారితో శృంగారం చేయాలని ఉన్నదా…? అయితే మీరు ఈ ఫోన్ నెంబర్‌ను సంప్రదించండంటూ సమాచారం వచ్చింది. దీంతో ఆయన అమితాసక్తితో ఆ ఫోన్ నెంబర్‌కు కాల్ చేయగా ముందుగా ఓ యువకుడు, తర్వాత ఓ యువతి ఆకట్టుకునేట్టుగా మాట్లాడారు. ఫోన్‌లో బేరం కుదిరాక ముంబై నుండి ఒక అందమైన యువతిని ఆయనకు అప్పగించారు. అనంతరం ఆ వ్యాపారి కామలీలను రహాస్యంగా వీడియోలు, ఫోటోలు తీశారు. అనంతరం వ్యాపారిని ఆ వీడియోలను, ఫోటోలను చూపిస్తూ బ్లాక్ మేయిలింగ్ చేస్తూ వస్తున్నారు.

ఇలా రెండేళ్ళుగా దశల వారిగా రూ. 30 లక్షల నగదును వ్యాపారి నుండి వసూలు చేశారు. మరింత నగదును డిమాండ్ చేయడంతో తన వద్ద ఉన్నదంతా ఇచ్చానని ఇక నావద్ద డబ్బుల్లేవని చెప్పడంతో బ్లాక్ మెయిలర్స్ ఆ వ్యాపారి లీలలను ఫోన్‌నెంబర్‌లోని ఇతర ఫోన్‌లకు దృశ్యాలను వాట్సాప్ మెస్సేజ్‌లను పంపించారు. దీంతో సదరు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫేస్‌బుక్‌లోని ఫోన్ నెంబర్ ఆధారంగా ముంబైకి చేరుకుని నిందితుడు దేవేందర్‌శక్తిని అరెస్టుచేసి నగరానికి తీసుకువచ్చారు. మరో ముగ్గురు నిందితులైన బీనా అంజనీరాయ్, అభిషేక్, వర్షా చౌహాన్‌లు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

మోసపోకండి : ఇన్‌స్పెక్టర్ అంజయ్య
సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను, ఆసక్తికర సమాచారాన్ని చూసి నగరవాసులు మోసపోవద్దని, ఏదేని అనుమానాలు ఉంటే నేరుగా పోలీసులను సంప్రదించాలని అఫ్జల్‌గంజ్ పోలీసు ఇన్‌స్పెక్టర్ అంజయ్య సూచించారు. అమ్మాయిలను ఎరగా వేసే ముఠాలు ఉన్నాయని, మాయమాటలతో, ఆసక్తి కరమైన ప్రకటనలతో మోసంచేయడం, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడటం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.