Friday, April 19, 2024

సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు పోలీసులకు ఆధునిక శిక్షణ

- Advertisement -
- Advertisement -

Advanced training for Police to face challenges head-on

 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన

న్యూఢిల్లీ: తీవ్రవాదం, సైబర్ నేరాలు, సరిహద్దు భద్రతకు సంబంధించిన వ్యవహారాలలో కొత్త సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు పోలీసు, పారామిలిటరీ దళాలను సమగ్రంగా ఆధునీకరిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడి చాణక్యపురిలోని జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద పోలీసు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, జవాన్లను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ తీవ్రవాదం, నకిలీ కరెన్సీ, నార్కోటిక్స్ నియంత్రణ, సైబర్ నేరాలు, ఆయుధాల స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా తదితర అంశాలలో దేశం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. ఈ సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు పోలీసులకు సమగ్ర ఆధునీకరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రానున్న రోజుల్లో పోలీసులు ఈ నేరాలను సమర్థంగా అణచివేయగలరని ఆయన చెప్పారు. దేశ సరిహద్దులు తారుమారు చేయడానికి వీల్లేని విధంగా కొత్త టెక్నాలజీని ప్రభుత్వం తీసుకువస్తోందని, దీని వల్ల భద్రతా దళాలు సరిహద్దులను మరింత సమర్ధంగా పరిరక్షించగలరని ఆయన తెలిపారు.

1959లో లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా దళాల మెరుపుదాడిలో మరణించిన 10 మంది పోలీసుల(సిఆర్‌పిఎఫ్) సంస్మరణార్ధం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నారు. ఇప్పటివరకు 35,398 మంది పోలీసులు, సిఎపిఎఫ్ సిబ్బంది తమ విధి నిర్వహణలో అసువులు బాసారు. గత ఏడాది 264 మంది పోలీసులు అమరులయ్యారు. కొవిడ్-19 కారణంగా మరణించిన 343 మంది పోలీసు సిబ్బందిని కూడా అమిత్ షా గుర్తు చేసుకున్నారు. పోలీసుల గృహనిర్మాణాలు, శిక్షణకు సంబంధించి సంతృప్తికర స్థాయిలో చాలా మార్పులు త్వరలో చూస్తారని కూడా ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అరవింద్ కుమార్, సిఎపిఎఫ్‌లకు చెందిన చీఫ్‌లు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News