Friday, April 26, 2024

జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!

- Advertisement -
- Advertisement -

arvind-kejriwal

ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు ఫ్రంట్‌ల పేరుతో ఏకంచేస్తామన్న వైఖరితోనే మాట్లాడారు. అట్లాంటి ప్రత్యామ్నాయాల గురించి జాతీయ స్థాయిలో అనేక మంది నేతలు ఇప్పటికే అలాంటి సమాలోచనలు జరిపారు. జరుపుతున్నారు గూడాను.

స్థిరమైన ప్రత్యామ్నాయం విధానపరమైన ఆచరణ నుండి రావాల్సి ఉంది. ఇప్పుడు కేజ్రీవాల్ అక్కడే విజయం సాధించారు. కుల, మతం, ధన ప్రభావాలతో సామాన్యులకు రాజకీయాలు ఇక అందవేమో అనుకుంటున్న సమయంలో అవేమీ లేకపోయినా విజయం సాధించవచ్చుననే సానుకూల సంకేతాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పంపించగలిగారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం అతివాద జాతీయ ఆలోచనలతో సంచలన నిర్ణయాలతో ముందుకు పోతున్న సందర్భంలో ఈ విజయం సైతం కేంద్రం దూకుడు విధానాలకు కళ్ళెం వేయగలిగాయా లేదా అనే విషయాలు మరికొన్ని రోజుల్లో తేలనుంది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఓ విషయం స్పష్టం అయ్యింది. బిజెపి దేశంలో అధికారం పొందడానికి గతంలో మతాన్ని వినియోగించుకొని రెచ్చగొట్టి ఓ పక్షం ఓట్లు గంపు గుత్తగా పొందవచ్చుననే ఆలోచనలకు మాత్రం బ్రేకు చేయగలిగారు. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను అభినందించిదగ్గ ముఖ్య విషయం ఏమంటే ఎంత రెచ్చగొట్టే సంఘటనలనైనా తేలిగ్గా తీసుకోవడం, పాకిస్థాన్ ఏజెంట్, ఆటంకవాది లాంటి ప్రచారాలను సైతం ఆయన తేలిగ్గా వాటిని తిరిగి అస్త్రాలుగా మలిచి వారిపైనే వదిలి విజయం సాధించారు.

ముఖ్యంగా ఆయన ప్రతిసభలో భారత మాతాకీ జై, వందేమాతరం, జైహింద్ లాంటి నినాదాలు హోరెత్తించారు. పైగా వీటన్నింటినీ ఆయన ప్రత్యార్థి అమ్ముల పొది నుండే ఆయన స్వీకరించారు. మరీ ముఖ్యంగా ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు హిందూ మతోన్మాదం పేరుతో విమర్శలు చేయడం వలన సాధారణ హిందువులులో సైతం విభజన వచ్చి లబ్ధ్ది చేకూరిందనే విషయం గమనించారు. అందువల్లనే ఆయన బిజెపి విమర్శించిన ప్రతి సందర్భంలోనూ తానూ హిందువుననే విషయం, హనుమాన్ చాలీసా లాంటివి పాటించడం ద్వారా ప్రత్యర్థులు ఏదైతే ఆశించారో అది నెరవేర్చకుండా అతివాద హిందూవాదానికి, మితవాద హిందూ వాదం ఎజెండాగా ముందుకు తెచ్చి తేలిగ్గా హిందువుల ఓట్లను పొందగలిగారు.

వీటన్నింటికీ మించి తన ఐదేండ్ల అభివృద్ధిని ప్రజల ముందు ఉంచి లగేరహో కేజ్రీవాల్ అన్ననినాదంతో హోరెత్తించారు. ప్రధానంగా కేజ్రీవాల్ విజయ రహస్యం ఉచిత పథకాలనే ఆశ్రయించకుండా ప్రజల ప్రాథమిక హక్కులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. ఢిల్లీలో మురికి వాడల ప్రజలకవసరమైన విద్య, వైద్యం, నీరు, విద్యుత్ ఆచరణాత్మక సఫలతతో అందించగలిగారు. అన్నింటికీ మించి ఢిల్లీలో నిర్భయ సంఘటన తర్వాత అధికారంలోనికి వచ్చాడు. కనుక మహిళా సాధికారత అనే అంశం ఆయన అభివృద్ధిలో ప్రధాన అంశం చేసుకోగలిగారు. మహిళా భద్రత కోసం మార్షల్స్ ఏర్పాటు, పాఠశాలలో బాలికలకు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శిక్షణ ఇవ్వడం, నగరమంతా సిసి కెమెరాలు ఏర్పాటు, మెట్రో రైలు, ఆర్‌టిసి బస్సులో ఉచిత ప్రయాణం లాంటి వినూత్న సౌకర్యాలు సహజంగా మహిళలను ఆకట్టుకున్నాయి. నూరు సేవలను సామాన్యుల గడప దగ్గర అందించే విధానాలు ఆకట్టుకున్నాయి. ఉచిత పథకాలు, నగదు బదిలీ పథకాలు చాలా రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నాయి.

కేంద్రం కూడా అలాంటివే మరికొన్ని పథకాలు అమలు పరుస్తోంది. అయితే అవన్నీ పరోక్షంగా ఓట్లు కోసం పంచుతున్న తాయిలాలు అనే విషయం కూడా కొందరు విమర్శకులు చేయకపోలేదు, కానీ, ఇక్కడ ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. ఢిల్లీ ఎన్నికల్లో వందలాది పార్లమెంటు సభ్యులు, పలువురు ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు, బిజెపి వ్యూహకర్త గా ప్రచారంలో ఉన్న అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ వీధి వీధి తిరిగి ప్రచారం చేసినా ప్రజలు కేజ్రీవాల్ నే నమ్మారు. అంటే ఆయనతో ప్రజలకు బలమైన బంధం ఏదో ఉండి ఉండాలి. అదే కేజ్రీవాల్ ప్రత్యేకత అందరిలా ఉచిత పథకాలకు ప్రాధాన్యత ఇవ్వక, పేరుకే ఉన్న అనుచిత పథకాలజోలికి వెళ్లక, ఉచితం కాని సముచిత పథకాలను వెతికి మరీ అమలు చేశాడు. ప్రజల ఆదేశిక హక్కులలో భాగం అయిన విద్య, వైద్యం రంగాలకు 50 శాతం బడ్జెట్ కేటాయించి అమలు జరిపారు. క్షణికమైన ప్రయోజనాలతో కూడిన పథకాలు కాకుండా దీర్ఘకాలికంగానైనా పేదల అభ్యున్నతికి ప్రత్యామ్నాయం విద్యనని నమ్మి ఆ రంగాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ముఖ్యంగా మురికివాడల్లోని పేద ప్రజలు గ్రహించారు.

తమ కోసం శ్రమిస్తూ నూతన, నిజమైన నేతగా తమ హృదయాల్లో స్థానం ఇచ్చారు. అందువల్లనే ఆయన రెండు ప్రధాన అధికార, ప్రతిపక్ష జాతీయ పార్టీలను సులువుగా మట్టి కరిపించారు. పైగా నీతివంతమైన రాజకీయ ఏజెండాతో! ఈ అంశాలే ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను నిజమైన, విధానపరమైన జాతీయ ప్రత్యామ్నాయంగా చూడడానికి అవకాశం ఏర్పడింది. ఇక మరో కోణంలో కూడా కేజ్రీవాల్ ప్రత్యామ్నాయంగా కనపడుతున్నారు. అదేమంటే ఈ దేశంలో అనేక ఏళ్ళుగా కమ్యూనిస్టు లు వర్గం పోరాటం గురించి చెబుతూ వస్తున్నారు. ఆ మేరకు అనేక పేద వర్గాలను ఆకట్టుకున్నారు కూడా. అయినా ఆయా పార్టీల ప్రభుత్వాలు హిందూత్వ ఎజెండాతో వచ్చిన బిజెపి ప్రభావాన్ని నిలువరించడంలో విఫలం అయ్యాయి.

ముఖ్యంగా సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న త్రిపుర వామపక్షాల చేజారింది. సెక్యులరిజం పేరుతో ముందు కొచ్చిన చిన్న, పెద్ద జాతీయ, ప్రాంతీయ పార్టీలు సైతం బిజెపి దూకుడును కళ్లెం వేయలేకపోయాయి. కేజ్రీవాల్ తాను కమ్యూనిస్టునని చెప్పుకొనకపోయినా రాజ్యాధికారం చేతిలోకి వచ్చినప్పుడు చేయాల్సిన వర్గ న్యాయం ఆయన ఆచరణాత్మకంగా చేసి చూపించారు. అందువల్లనే బిజెపి ప్రభుత్వం మురికివాడల్లో నివసించే 40 లక్షల మంది ఇళ్ళు స్థలాలను క్రమబద్ధీకరిస్తామని ఉత్తర్వులు జారీ చేసినా మురికివాడల్లోని ప్రజలు కేజ్రీవాల్‌కు గంపగుత్తగా ఓట్లేయడం గమనార్హం! పేదల దీర్ఘకాలిక సంక్షేమం కేజ్రీవాల్‌తో ముడిపడి ఉందని పేద వర్గాల ప్రజలు గ్రహించడంమే ప్రధానం అంశం.

కేజ్రీవాల్ విజయాన్ని వామపక్ష వాదులు ఒక రకంగా జీర్ణం చేసుకోలేకపోతున్న సందర్భం. అందుకు సంబంధించిన విమర్శలు సైతం సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొట్టాయి. జెఎన్‌యు సంఘటన, షహీన్ బాగ్ నిరసన దీక్షలు, ఆర్టికల్ 370 రద్దు, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్, సిఏఏ తదితర అంశాలు ప్రచారంలో నామమాత్రంగానైనా మద్దతు తెలపలేదనేది దాని సారాంశం. అయితే ఆర్టికల్ 370ని మినహాయిస్తే మిగతా అన్ని విషయాల్లో ఆయన లౌకిక వాదిగా, హేతుబద్ధమైన ఆలోచనలతోనే ఉన్నారు. ప్రత్యర్థి వర్గం ఆయన్ను ఆ ఉచ్చులోకి లాగాలని రచ్చగా మారిస్తే!? తెలిసి, తెలిసి ఆయన వారి ఉచ్చులో ఎలా చిక్కు కుంటారు? అలా చిక్కుకోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కనుకనే ఇవాళ సెక్యులర్ విలువలు, జాతీయ ప్రజాస్వామిక ఆలోచనలకు ప్రత్యామ్నాయంగా నిలువగలిగారు. ఢిల్లీని గెలిచి ఆశాకిరణంగా కనిపించారు.

ప్రతిపక్ష శిబిరాలకు ఊపిరి ఊదాడు. మరి నిజంగా వామపక్ష మేధావులు మాదిరి గుడ్డిగా ఢీకొట్టి సమర్థిస్తే వారికిమల్లే కేజ్రీవాల్‌కు తల బొప్పికట్టియుండేది? కేజ్రీవాల్ గొప్పతనం అక్కడే రుజువైంది. కమ్యూనిస్టులు ఆచరణాత్మకంగా సాధించాల్సిన పనిని కేజ్రీవాల్ సాధించారు. కేజ్రీవాల్‌ను తక్కువ చేసి చూపించాలనే భావన అంతిమంగా అది బిజెపిలాంటి అతివాద జాతీయవాద పార్టీలకే మేలు చేస్తాయని మిత్రులు గమనించాలి. ఇక్కడ మరో విషయం పేదల హృదయాల్లో స్థానం సంపాదించడం, స్థిరంగా ఎన్నికల్లో నిలబడడం ఎలా? అనే విషయంలో కేజ్రీవాల్ నుండి నేర్చుకోవడంలో తప్పులేదు. ఈ దేశంలో అతివాద హిందూ జాతీయవాద పార్టీని ఎదుర్కోవాలంటే హేతుబద్ధమైన, ఆచరణాత్మకమైన ప్రత్యామ్నాయంగా ముందుకొచ్చిన ఉదారవాద హిందూ శక్తులను ముందుపెట్టక తప్పని పరిస్థితి. ప్రస్తుత రాజకీయాలకు అది తక్షణ అవుసరం కూడానూ! అందుకే సైద్ధాంతికంగా చూసినా, ఆచరణాత్మకంగా చూసినా, పరిపాలనా వైవిధ్యం రీత్యా చూసినా నేటి రాజకీయ వ్యవస్థ సమూల ప్రక్షాళన రీత్యా కేజ్రీవాల్‌నే దేశానికి ఏకైక ఆశాకిరణం. ప్రత్యామ్నాయం. మినీ ఇండియాగా పేరున్న దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు నిర్ధారించిన భవిష్యత్తు రాజకీయ ప్రత్యామ్నాయ దిక్చూచి కేజ్రీవాల్.

After Delhi win AAP eyes national role

* యన్.తిర్మల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News