Home లైఫ్ స్టైల్ మంజీరనాదాలు

మంజీరనాదాలు

Learned to dance in the village of Kuchipudi

ఐదేళ్ల వయసులో కూచిపూడి పుట్టిన ఊరిలోనే నృత్యాన్ని అభ్యసించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నృత్యాన్నే అభిరుచిగా మార్చుకుంది. ప్రస్తుతం వంద మంది విద్యార్థులకు కూచిపూడి నృత్యాన్ని నేర్పిస్తూ కళను పంచుతోంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే కోరికతో నృత్యంలో పీహెచ్‌డీ చేస్తోంది. నాట్యం నేర్చుకోవాలనే తపన ఉండి, ఆర్థిక పరిస్థితులు బాగోలేని పిల్లలకు ఉచితంగా తన అకాడమీలో నృత్యాన్ని నేర్పిస్తోన్న ప్రముఖ కూచిపూడి కళాకారిణి రేణుకా ప్రభాకర్‌తో సకుటుంబం ముచ్చట్లు. 

మా అకాడమీ పేరు మంజీర అకాడెమీ ఆఫ్ కూచిపూడి డాన్స్. మూడు బ్రాంచ్‌లు ఉన్నాయి. మల్కాజిగిరి, సఫిల్‌గూడ, నేరేడ్‌మెట్‌లో ఉన్నాయి. అకాడమీ పెట్టి 20 ఏళ్ళు అయింది. విద్యార్థులను పరీక్షలకు పంపిస్తుంటాను. ప్రదర్శనలిస్తుంటారు. నాలుగేళ్లు నృత్యం నేర్చుకున్న తర్వాత గవర్నమెంటు పరీక్ష ఉంటుంది. అదిఅయిన తర్వాత వారికి సర్టిఫికెట్ ఇస్తారు. చిన్న పిల్లలకు ప్రారంభిక్ 1, ప్రారంభిక్ 2 అని పరీక్షలు ఉంటాయి. ఆల్ ఇండియా లెవల్లో ప్రదర్శనలిస్తుంటారు. ఎక్కువగా గ్రూప్ డాన్స్‌లకి, డ్యూయెట్స్‌కి బహుమతులు తెచ్చుకుంటారు. వారానికి మూడు రోజుల చొప్పున తరగతులు చెప్తుంటాను. అకాడెమీలో పిల్లల దగ్గర చాలా నామినల్‌గా ఫీజులు తీసుకుంటాను. అభిరుచి ఉండి డబ్బులేని పేద పిల్లలు దగ్గర తీసుకోను. అలాంటివారికి ఉచితంగా నేర్పిస్తుంటాం. మొత్తం 75 నుండి 100 మంది వరకు ఉంటారు. దూరంగా ఉండి రాలేని వారి కోరిక మేరకు ఆన్‌లైన్‌లో కూడా డాన్స్ నేర్పిస్తున్నాను.

కూచిపూడి అంటే ప్రాణం..
5 ఏళ్ళ వయసు నుంచే కూచిపూడి నేర్చుకున్నాను. నాన్న ఆంధ్రాబ్యాంక్‌లో పనిచేస్తారు. ఆయన ఉద్యోగరీత్యా బదిలీ అవటం మూలాన 6వ తరగతిలో బ్రేక్ వచ్చింది. టెన్త్ నుండి మళ్లీ నేర్చుకున్నాను. నాలుగేళ్లు తరువాత సర్టిఫికెట్ కోర్సు, రెండేళ్ళ డిప్లొమా కోర్సు, ఎంఎ, ఎంఫిల్, అలా న్యత్యం రంగంలో కృషి చేస్తున్నాను. శిక్షణ పూర్తయిన తరువాత అకాడమీ పెట్టాను. అకాడమీ పెట్టక ముందు పాఠశాలల్లో చెప్పేదాన్ని.

అమ్మ ప్రోత్సాహం వల్లే.. తాతగారి ఊరు కృష్ణాజిల్లా మచిలీపట్నం. ఆయన ప్రతి సంవత్సరం ఆ ఊళ్లో భాగవతుల వాళ్లని పిలిపించి గుళ్లో కళ్యాణం చేయించి ప్రదర్శనలిప్పించేవారు. అలాగ అమ్మకు నృత్యం అంటే అభిరుచి ఏర్పడింది. సంగీతం సాహిత్యానికి సంబంధించిన చాలా పుస్తకాలు చదివింది. నన్ను కూచిపూడి రంగంలో ఉన్నతురాల్ని చేయాలనుకుంది. అలా చిన్నప్పటి నుంచే కూచిపూడి నేర్పించింది. అమ్మకు భామా కలాపం అంటే చాలా ఇష్టం. అది నేను వేస్తే చూడాలనుకునేది.
గురువు ఆధ్వర్యంలో… మా గురువుగారు భాగవతుల సేతురాం. ఆయన ఆధ్వర్యంలో చాలా ప్రదర్శనలిచ్చాం. ఢిల్లీ, బెంగళూరు ఇలా భారతదేశం మొత్తం ప్రదర్శనలిచ్చాం. చత్తీస్‌ఘడ్ తప్పించి, అన్ని స్టేట్స్‌లోనూ మేము ప్రదర్శనలిచ్చాం.

కుటుంబ ప్రోత్సాహం..
మా వారు ప్రభాకర్. ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అయినా నా అభిరుచికి ఎప్పుడూ అడ్డు రాలేదు. మాకు ఒక అబ్బాయి. ఇంజనీరింగ్ అయిపోయింది. యుకెలో ఎంఎస్ చేసి వచ్చాడు. ఇప్పుడు గచ్చిబౌలిలో జాబ్ చేస్తున్నాడు. తనకి ఫుట్‌బాల్ అంటే ఇష్టం. ముగ్గురిదీ వేర్వేరు అభిరుచులు. ఎవరి ఇష్టం వారిదే.
అవార్డులు..కళారత్న, నాట్యవిద్యాధారి, ఉగాది పురస్కారం లాంటివి అందుకున్నాను. ప్రతి సంవత్సరం పూణెకి వెళతాం. అక్కడ మా స్టూడెంట్స్ చేసిన వాటికి మంచి పేరు వస్తోంది. మేము ఇచ్చే ప్రదర్శనలు కొంచెం డిఫరెంట్‌గానే ఉంటాయి.

మరిచిపోలేని జ్ఞాపకాలు ..
నేషనల్ లెవల్‌లో ఢిల్లీలో అప్నా ఉత్సవ్ చేశారు. ఏషియాడ్ తరువాత ఢిల్లీలో ఆ ప్రోగ్రాం చేశారు. మాది కల్చరల్ బేస్ అన్నమాట. అన్ని స్టేట్స్ నుండి ఢిల్లీలో కొన్నిప్లేస్‌లలో ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. అప్పుడు మేము ఢిల్లీలో రెడ్‌ఫోర్ట్‌లో ప్రోగ్రాం చేశాం. పి.వి.నరసింహారావు వచ్చారు. రెడ్‌ఫోర్ట్ పైన కూచిపూడి ప్రదర్శన ఇవ్వడం ఒక మంచి జ్ఞాపకంగా ఉండిపోయింది. దానికి నేనే కొరియోగ్రఫీ చేశాను. గోదాకల్యాణం, శ్రీనివాస కల్యాణం లాం టి ప్రదర్శనలు నగరంలో శిల్పారామంలాంటి చోట్ల ప్రదర్శనలిస్తుంటాం.

                                                                                                                                                   – లలిత తాతిరాజు