వెనకబడ్డ ఉట్నూరు, ఏటూరునాగారం ఐటీడీఏల అభివృద్ధికి రూ.12 కోట్లు
సిఎం దృష్టికి జిఓ 49 ఉపసంహరణ
గిరిజన, ఆదివాసీ ఎంఎల్‌ఎల సమావేశంలో మంత్రి సీతక్క
మన తెలంగాణ / హైదరాబాద్ : ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకే దక్కెలాగా జిఓ నెం.3ను పునరుద్ధరించాలన్న ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి సీతక్క తెలిపారు. వెనకబడ్డ ఉట్నూరు, ఏటూరునాగారం ఐటిడిఎల అభివృద్ధికి రూ. 12 కోట్లు ప్రత్యేకంగా కేటాయించినట్లు వెల్లడించారు. మంగళవారం మంత్రి సీతక్క అధ్యక్షతన మాసబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్ లో గిరిజన, ఆదివాసి ఎంఎల్‌ఎల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రాంచంద్రు నాయక్, ఎంఎల్‌ఎలు పాయం వెంకటేశ్వర్లు, వెడ్మ బొజ్జు పటేల్, కోవ లక్ష్మీ, అనిల్ జాదవ్, ఆదినారాయణ, ట్రైకార్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్, జిసిసి ఛైర్మన్ కోట్నాక్ తిరుపతి, ట్రైబల్ సెక్రటరీ శరత్, ఎస్‌టి గురుకుల సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మీ, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, జిసిసి, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. రూ. 1,000 కోట్లతో రాజీవ్ యువ వికాశం, రూ. 12,600 కోట్లతో ఇందిర సౌరజల గిరి వికాసం, రూ.17,168 కోట్లతో ఎస్‌టి ఎస్‌డిఎఫ్ నిధులతో గిరిజనుల విద్య, ఆరోగ్యం, వసతి, ఉపాధి, మౌలిక వసతుల కల్పన వంటి ప్రజా ప్రయోజన పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సమావేశం ధన్యవాదాలు తెలిపింది. ఏజెన్సీ పాంత్రాల్లో అటవీ శాఖ అధికారుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను ఎంఎల్‌ఎలు మంత్రి దృష్టికి తెచ్చారు.
గ్రామ సభల అనుమతులు లేకుండా, పెసా చట్టాలను ఉల్లంఘిస్తు అటవీ అధికారులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తిని వ్యక్తం చేశారు. తడోబా టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని కొమురం భీం కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటిస్తూ తెచ్చిన జిఓ నెం.49ను ఉపసంహరించుకోవాలని ఎంఎల్‌ఎలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీ ప్రాంతం లో గ్రామసభ అనుమతి లేకుండానే గ్రామంలో ప్రవేశించి ఫారెస్ట్ ఏరియా పేరుతొ భూములను స్వాదీనం చేసుకోవడాన్ని వారు తప్పుపట్టారు. గ్రామసభ అనుమతి లేకుండా గిరిజన గ్రామల్లో, పొలాల్లో అటవీశాఖ అధికారులు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వన్ని విజ్ఞప్తి చేస్తూ సమావేశం తీర్మానించింది.
రాజీవ్ యువ వికాసం, ఇందిర సిరి జల వికాసం, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల పై ప్రదానం గా చర్చ జరిగింది. డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్ ను ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ ఐటిడిఎల ద్వారా ఇందిరమ్మ ఇండ్లు సాధించుకున్నామన్నారు. ఎస్‌టిలకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రత్యేక కోటా కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇందిరా సౌర జల గిరి వికాసం ద్వారా గిరిజన రైతుల భూముల్లో సిరులు పండించబోతున్నామన్నారు. గిరిజన సంక్షేమ శాఖను ముఖ్యమంత్రి బలోపేతం చేసే దిశలో అడుగులు వేస్తున్నారన్నారని, రూ. 17,168 కోట్లు కేటాయించారని తెలిపారు.
పెసా నిబంధనలకు విరుద్దంగా అటవీ శాఖ తెచ్చిన జిఓ 49 ని ఉపసంహరించుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంఎల్‌ఎలు కోరుతున్నారన్నారు. వారి అభిప్రాయాలను ముఖ్యమంత్రి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకుంట్టామని మంత్రి సీతక్క హామినిచ్చారు. గిరిజన సంక్షేమ శాఖలో పెండింగ్ బిల్లులు ఉన్నాయని, వాటిని సిఎం, డిప్యూటీ సిఎం దృష్టికి తీసుకెళ్లి విడుదల చేయిస్తామని తెలిపారు. మన సంస్కృతితోనే మన అస్థిత్వం కపాడబడుతుందని, అందుకే మన సంస్కృతిని, కళలను కపాడుకునేలా చర్యలు తీసుకుంమని చెప్పారు. గిరిజన విద్యా సంస్థల్లో జాతి గొప్పతనాన్ని చాటేలా మన అటలు, పాటల ద్వారా మన సంస్కృతిని చాటి చెప్పేల చర్యలు తీసుకుందాంమన్నారు. జననం నుంచి మరణం వరకు ఆదివాసుల జీవితాలను అక్షర బద్ధం చేసి భవిష్యత్తు తరాలకు అందిద్దామన్నారు.
భద్రాచలం లో ఏర్పాటు చేసిన ట్రైబల్ మ్యూజియం తరహాలోనే ఇతర ఐటిడిఎల్లో మ్యూజియంలను, లైబ్రరీలను ఏర్పాటు చేయాలన్నారు. ఏజెన్సీ ఏరియాలో ప్రత్యేక జాబ్ మేళాలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి మార్గాలు కల్పిస్తామన్నారు. త్వరలో మహబూబాబాద్, ఆసిఫాబాద్లలో జాబ్ మేళాలు ఏర్పాచు చేస్తామని, గిరిజన సంక్షేమ శాఖలో అంతర్ భాగంగా ఉన్న సంస్కృతిక విభాగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. గతంలో ఐటిడిఎ పరిధిలో ఉన్న 26 శాఖలను తిరిగి ఐటిడిఎ గోడుగు కిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. అంబేద్కర్ ఓవర్సిస్ స్కాలర్ షిప్‌లో గిరిజన విద్య సంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు 40 నుంచి 50 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. గిరిజన ఎంఎల్‌ఎల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యంత్రి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయాలను అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని సీతక్క హామినిచ్చారు.
అంతకు ముందు మంత్రి సీతక్క సంక్షేమ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ కెఫటేరియాను ప్రారంభించి, ట్రైబల్ దేవాలయాలను దర్శించుకున్నారు. గిరిజనులు, అటవీ ప్రాంత వాసులకే పరిమితమైన చిరు, తృణ ధాన్యాలు, కల్తీకి తావులేని సహజ సిద్ధమైన ఆటవీ ఉత్పత్తులతో తయారుచేసిన చిరుతిళ్లు, వంటకా లను రాష్ట్ర ప్రజలందరికి రుచి చూపేందుకు సర్కారు ట్రైబల్ కెఫ్ ఏర్పాటు చేసిందన్నారు.
అటవీ ఉత్పత్తు లతో తయారుచేసిన చిరుతిళ్లు, ఇతర వంటకాలను ప్రజలందరికీ పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ వద్ద గల తెలుగు సంక్షేమ భవన్‌లో గిరిజన మ్యూజియం ముందు గిరిజన ఆహారశాల పేరుతో స్టాల్ ఏర్పాటు చేశారు. 20 రకాల ట్రైబల్ వంటకాలు ను అందుబాటు లో ఉంచారు. మంత్రి సీతక్క గిరిజన వంటలను రుచి చూశారు. గిరిజన ఆడిటోరియంలో ప్రదర్శించిన ఆదివాసుల ఆరాధ్య దైవం కొమురం భీం పోరాటం, అమరత్వం ఇతివృతంగా రూపొందించిన కొమరం భీమ్ డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శనను గిరిజన ఆదివాసి ఎంఎల్‌ఎ లతో కలిసి సీతక్క వీక్షించారు.