Home దునియా స్వీట్ సిక్స్‌టీ

స్వీట్ సిక్స్‌టీ

Aging

 

వృద్ధాప్యం జీవితంలో
ఓ తప్పనిసరి దశ..
కాలంతోపాటే కమ్ముకొచ్చే అన్ని దశలనూ ఆస్వాదించాల్సిందే..
ఇంట్లో పెద్దవారుంటే
ఆ ధైర్యమే వేరు…
కష్టాల కడలిని ఎలా ఈదాలో చెప్పే, ఎప్పటికప్పుడొచ్చే సమస్యల్ని సమర్ధవంతంగా
ఎదుర్కొనే మనోస్థైర్యం వారు…
వారెంతో ఇచ్చినా,
వారేం కోరుకుంటున్నారు
చిన్న పలకరింత..
వారిని విస్మరించని గుర్తింపు…
జస్ట్ అంతే!

వందేళ్లు చిరంజీవిగా వర్థిల్లమంటూ పెద్దవాళ్లు దీవిస్తుంటారు. దాదాపు ప్రపంచంలోని అన్ని సమాజాలలో సరాసరి ఆయుర్దాయం వందలోపే. అరవై దాటితేనే మహా గొప్పగా చెప్పుకుంటారు. అందుకే షష్టిపూర్తి కూడా ఘనంగా జరుపుకుంటారు. ప్రస్తుతం ఆయుర్దాయంలో మార్పు కనబడుతోంది. సరాసరి ఆయుర్దాయం పెరుగుతోంది. విజ్ఞాన వైద్య శాస్త్రాలు వయసును పెంచుతున్నాయి. ఈ రెండు శాస్త్రాలూ పలు రోగాలను అంతం చేస్తున్నాయి. అనేక రోగాలకు చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా అరవై దాటడం సహజంగా మారింది. షష్టిపూర్తిని సంప్రదాయంగా జరుపుకుంటున్నారేగానీ అదో ఘనతగా భావించడంలేదిప్పుడు. ప్రభుత్వాలు కూడా రిటైర్మెంట్ వయసును 60కి పెంచాయి. మరి కొన్ని ఉద్యోగాలలో 62, 65 ఏళ్ల వయసు వరకు పనిచేసే వెసులుబాటు కల్పించింది.

వయసు మళ్లడం అనేది సహజ ప్రక్రియ. ఈ ప్రక్రియను ఆరోగ్యవంతంగా మళ్లించడం మన చేతిలో పని. కొందరి జీవితాలు హాయిగా వయసు మళ్లిన దశకు చేరుతాయి. ఆ తేడాను గుర్తించి సరైన వయసులో తగినన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అమెరికన్ పౌరులను దృష్టిలో పెట్టుకుని చేసిన అధ్యయనమే అయినప్పటికీ అవి అన్ని దేశాలకూ వర్తిస్తుంది. వయసులో ఉండగా చేసుకున్న అలవాట్లు పాటించిన నియమాలే వయసు మళ్లిన వారికి కవచంగా నిలుస్తాయి. ఇదే సంప్రదాయ భారతీయ జీవన విధాన రూపశిల్పులు ప్రజలకు చెప్పింది. క్రమబద్ధ జీవితం వల్లనే ఆరోగ్యంగా ఉండగలరన్నది వారు ఆచరించి చూపారు. వేకువజామున లేవడం, సూర్యనమస్కారాలు చేయడం, అనేవి ప్రతి ఒక్కరికీ అవసరం. యోగాసనాలు మంచివి. ప్రస్తుతం చాలా మందికి ఇలాంటి అలవాట్లు లేవు. వ్యాయామం లేదు.

దాదాపుగా 60 శాతం మంది నడకను వదిలేశారు. ఒకచోట గంటల తరబడి కదలగుండా కూర్చుని పనిచేస్తున్నారు. సహజమైన గాలిని మరిచిపోయారు. వీటికి తోడు కొత్త అలవాట్లు చేసుకుంటున్నారు. దీని వల్ల 40 ఏళ్ల నుంచే అనారోగ్యపు లక్షణాలు మొదలవుతున్నాయి. ఆర్థికపరమైన అంశాలలో అశ్రద్ధ చూపుతున్నారన్నది ఆందోళన కలిగించే విషయం. ఖర్చుమీద అదుపులేని తరం ఇది. ఒక వయసు తర్వాత ఆర్థికపరమైన సమస్యలు చుట్టు ముట్టకూడదు. అటువంటి ప్రమాదం ఏర్పడిందంటే అనారోగ్యం వస్తుంది. అత్యాశతో పెట్టుబడులు పెట్టిన వాటి మీద ఆదాయంపై సందేహాలున్న దశలో వయసు మళ్లడం మంచిదికాదు. తాము పెట్టిన పెట్టుబడులు, వాటి ద్వారా కలిగే లాభాలు, నష్టాల మీద స్పష్టత 50 ల్లోనే సాధించాలి. ఆ తర్వాత తీసుకుంటే రిస్క్. ఏదీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు. మెదడుతో పనిచేయడం పెరిగింది.

దీంతో ఒత్తిడి తప్పడం లేదు. వృత్తిపరమైన సమస్యలకు తోడు ఆర్థిక కుటుంబ పరమైన సమస్యలు తోడైతే వృద్ధాప్యం బాధాకరం అవుతుంది. గతంలో కన్నా ఇప్పుడు నాడీ సంబంధ వ్యాధులు పెరగడానికి కారణం ఒత్తిడే. స్ట్రోక్స్ పెరుగుతున్నాయి. రెండు మూడు దశాబ్దాల క్రితం మన సమాజంలో అంతగా కనిపించని డిమెన్షియా అల్జీమర్స్ వ్యాధులు ఇప్పుడు అధికంగా కనిపిస్తున్నాయి. వైద్య పరీక్ష పరికరాలు అందుబాటులోకి వస్తున్న కొద్దీ కొత్త అనారోగ్యాల గురించి అర్థం చేసుకోవాలి. అమెరికా వంటి దేశాలలో 70ఏళ్ల వరకు పనిచేస్తున్నారు. ఐరోపా ఖండ దేశాలలో 80, 90ల వరకు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వీలైతే వందేళ్లు బతకాలన్న కోరిక బలంగా ఉంటోంది. నలభైలో వుండగా వందేళ్లపాటు జీవించాలనుకునేవారు దానికి తగిన విధంగా జీవితం మలచుకోకపోతే కోరుకున్న జీవితం కష్టాలతో నిండి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

నేడున్న భారతీయ సమాజం యువ సమాజం. దాదాపుగా 60 శాతం జనాభా 35 సంవత్సరాలలోపు వయసున్న జనాభా. శక్తివంతమైన ఈ జనాభా తన పూర్తి సామర్థాన్ని ప్రదర్శించగలిగితే భారతదేశం 2020కి అగ్రరాజ్య మవడం సులువే. యువ జనాభా భారతదేశానికి ఓ వరంగా లభించింది. ప్రపంచంలో మరే ఇతర దేశానికీ లేని గొప్ప అవకాశం ఇది. ఈ యువ జనాభా మరో మూడు నాలుగు దశాబ్దాలలో వయసు మళ్లిన జనాభాగా మారడం సహజం. ఆరోగ్యం సక్రమంగా లేని వృద్ధుల జనాభాని భరించేందుకు ప్రభుత్వం, సమాజం భారీగా నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా ఇది కష్టసాధ్యమే. ఇటువంటి సమస్యను కొన్ని ఐరోపా ఖండ దేశాలు ఎదుర్కొంటున్నాయి. నేటి యువ జనాభా తమ శక్తితో ఎంతగా దేశ ఉత్పత్తిని పెంచుతుందో అందుకు రెట్టింపు నిధులను తమ సంక్షేమం కోసం వయసు మళ్లిన తర్వాత డిమాండ్ చేస్తుంది. ఆర్థిక పరంగా ప్రభుత్వానికి భారంగా మారడమంటే నష్టమే.

మానవ సంబంధాలు మెరుగుపడాలి
ప్రస్తుతం సామాజిక సంబంధాలు దెబ్బతింటున్నాయి. బంధుత్వాలు, స్నేహాలు తగ్గిపోతున్నాయి. ఒక చోట స్థిరంగా ఉద్యోగాలు చేసే అవకాశం లేదు. వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుకోవడం కన్నా సామాజిక మీడియా సంభాషణలు ఎక్కువయ్యాయి. దీర్ఘకాల సంబంధాలు ఉండట్లేదు. ఫలితంగా వయసు మళ్లే సరికి ఏ ఊరిలో ఉండబోతున్నదీ వారికే తెలియదు.
విశ్రాంత జీవితం సుఖమయం కావాలి: ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో రిటైర్ కావాల్సిందే. పుట్టిన తేదీ బట్టి అది ముందుగా తెలిసే విషయం. దీన్ని బట్టి అందుకు కావాల్సిన ఆర్థిక, మానసిక భరోసాను కల్పించుకోవడం మన చేతుల్లో ఉన్న పనే. లేకుంటే మలి వయసులో కష్టాల్ని ఆహ్వానించినట్లే.

పాత రోజులు మారాయి
పాత తరాల వారికి యాభైల వయసు చూపటమే ఒక కలగా ఉండేది. ప్రసవ మరణాలు, బాల్య మరణాలు, అంటురోగాల మరణాలు ఇలా ఎన్నో రకాల మరణాలతో పుట్టిన వారంతా బతుకుతారన్న నమ్మకం ఏమాత్రం ఉండేది కాదు. ఆ దశలో ఉన్న సమాజాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. ఫలితంగా వైద్య, విద్య, ఆరోగ్య అంశాల మీద భారీగా పెట్టుబడులు పెట్టి ఒక్కొక్క అవరోధం తొలగిస్తూ ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి తోడ్పడ్డాయి. నేడు అంటురోగాలు అంతగా లేవు. పుట్టిన బిడ్డల్ని బతికించుకుంటున్నారు. అంతాబాగానే ఉన్నా కొత్త సమస్యలు మాత్రం పుట్టుకొస్తున్నాయి. కొత్త కొత్త రోగాలు వెంటబడుతున్నాయి. ఆరోగ్యం లేని వయసును భరించాల్సి వస్తోంది. పింఛన్ తీసుకునే సంవత్సరాలు ఎక్కువయ్యాయి.

భారత దేశంలో ప్రతి పదిమందిలో ఒకరు అరవై ఏళ్లకు పైబడిన వృద్ధులేనని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 2050 నాటికి భారత దేశంలో అరవై ఏండ్లకు పైబడినవారు సుమారు 30 కోట్లకు చేరుకుంటారని ఓ అంచనా. అంటే ఇప్పుడున్న వృద్ధులకు దాదాపు మూడున్నర రెట్ల మంది వృద్ధులుగా తయారవుతారన్నమాట.

పార్లమెంటులో చట్టం
పార్లమెంటు వృద్ధుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని 2007లో ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. అదే ‘మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్’. ఈ చట్టం ప్రకారం సంతానం, బంధువులు… వృద్ధుల అవసరాలను తీర్చవలసిన బాధ్యత కలిగి ఉండాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాశ్రమాలను స్థాపించాలి.
తెలుగు రాష్ట్రాల్లో వృద్ధాప్య పింఛన్ స్కీం ఎంతో ప్రయోజనకరంగా ఉన్నది. తమకొచ్చే కొద్దిపాటి పింఛన్, రేషన్ బియ్యంతో బతికే నిరుపేద వృద్ధులు లక్షలాది మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

కాస్త పలకరించండి
ఒంటరిగా ఉండే పెద్దలు తమ గతాన్ని నెమరువేసుకుంటూ బాధపడటాన్ని దినచర్యగా మార్చుకుంటున్నారు. దీంతోపాటు వారికొచ్చే అనారోగ్య సమస్యలు మరింత కుంగదీస్తున్నాయి. ఇటువంటివారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులది. వృద్ధులకు స్వాంతన కలిగించాలి. బయటి నుంచి రాగానే ఈరోజు ఏం చేశారు, తిన్నారా లేదా… వంటి పలకరింపు మాటలు మాట్లాడాలి. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వారి నుదుటిపై చెయ్యిపెట్టి ఓదార్చాలి. అప్పుడు పెద్దవారు చిన్నపిల్లలైపోయి తమను పట్టించుకునేవారున్నారనే భరోసాను పొందుతారు. ఈ భరోసానే వారి మిగతా జీవితానికి పట్టుగొమ్మ అవుతుంది.

వాళ్లకి ఎన్ని సౌకర్యాలున్నా అవన్నీ కుటుంబీకులు అందించే ప్రేమానురాగాలకి సాటిరావు. తరచూ వాళ్లని కలిసి మాట్లాడుతుంటే ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఆ అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. పిల్లలు ఎక్కడో ఉంటుంటారు. దాంతో వాళ్లను మర్చిపోలేక తమదైన జీవితాన్ని గడపలేక కుంగుబాటు (డిప్రెషన్) బారిన పడుతున్న వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఫోన్లూ, వీడియోచాట్‌ల ద్వారా నిత్యం వాళ్ల యోగక్షేమాలు కనుక్కుంటూ మాట్లాడే కుటుంబసభ్యులున్న పెద్దల్లో డిప్రెషన్ శాతం తక్కువగా ఉన్నట్లు తమ పరిశీలనలో తేలింది అంటున్నారు అరెగాన్ హెల్త్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు. నేటి పరిస్థితులు పూర్వ రోజులకు భిన్నంగా ఉన్నాయి.

ఆర్థికపరమైన లాభాలను దృష్టిలో పెట్టుకుని సామాజిక సంబంధాలను పరిమితం చేసుకుంటున్నారు. పిల్లల సంఖ్య పరిమితం. పిల్లలను సుదూర తీరాలకు ఉద్యోగాలకు, చదువులకు పంపుతున్నారు. చివరకు ఒంటరిగా మిగిలి ఉన్న జంటలు దేశంలో ఎక్కువ శాతం ఉన్నారు. అటువంటివారిని ఎవరు చూసుకోవాలి. వారికి సౌకర్యాలు ఎవరు కల్పించాలన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న.

అరవైలోనూ యంగ్‌గా…
* అరవై ఏళ్లు దాటాయో లేదో వయసై పోయిందనుకుంటారు చాలామంది. నాలుగడుగులు వేస్తే కాళ్ల నొప్పులు.. తింటే ఆయాసం.. తినకపోతే నీరసం.. ఇదీ సంగతి. మంచి డైట్ ఫాలో అవుతూ, ప్రతిరోజూ ఓ గంట సమయం శారీరక శ్రమకు కేటాయిస్తే ముదిమి వయసులోనూ ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు వైద్యులు.
* అరవై ఏళ్లు దాటాక శరీరం తొందరగా అలసిపోతుంది. ఆహారనియమాలు. అలవాట్లు కూడా ఈ వయసులో ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా స్మోకింగ్ వీడకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
* 60 నుంచి 70 ఏళ్ల మధ్య గుండె జబ్బులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే అరవైలోకి రాగానే డైట్‌లో మార్పులు తప్పనిసరిగా పాటించాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. వైద్యుల సూచన మేరకు ఉప్పు వాడకం తగ్గించాలి.
* రిటైర్ అయ్యాక రోజంతా ఇంట్లోనే ఉండటం, వేళకు భోజనం చేయడం, శారీరక శ్రమ తగ్గిపోవడం, మధ్యాహ్నం వేళలో నిద్రపోవడం.. ఇవన్నీ ఒబెసిటీకి దారితీస్తాయి. కండరాల్లో కొవ్వు చేరితే అనేక జబ్బులకు దారితీస్తుంది. ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మధ్యాహ్నం వేళలో కునికిపాట్లను దూరం ఉంచాలి. బద్ధకాన్ని వదిలించుకుంటే అనారోగ్యం ఛాయలకు రాదు.
* వ్యాయామం సకల సమస్యలకు చెక్ పెడుతుంది. అలాగని భారీ వర్కవుట్స్ చేయాల్సిన అవసరం లేదు. ఉదయం, సాయంత్రం వాకింగ్ ఒక దినచర్యగా పాటించాలి.
* పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవాలి. పళ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల
జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. పాలు, వెన్న, పెరుగు వంటి ఫ్యాట్ ఉండే పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. మాంసాహారులైతే స్కిన్‌లెస్ చికెన్, చేపలు అప్పుడప్పుడూ తీసుకోవచ్చు. రాగులు, సజ్జలు, జొన్నలతో చేసిన రొట్టెలు తీసుకోవాలి. మొలకెత్తిన గింజలను తరచూ తీసుకోవాలి.

Aging

అమ్మకోసం..
ఒక అమ్మాయి యాభై ఏళ్ల తన తల్లికి భర్త కావాలని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. చాలామందికి ఈ ఐడియా నచ్చి సపోర్ట్ చేసి ఆమెతో కలిపి మంచి భర్తని వెతకడానికి వచ్చారు. ఈ పోస్ట్ చూసి మరో కూతురు తన యాభై ఆరేళ్ల తల్లికి భర్త కావాలంటూ అమ్మతో కలిసి దిగిన ఫొటోను తీసి సోషల్‌మీడియాలో పెట్టింది. అయితే దానికి క్యాప్షన్‌గా 55 నుంచి 60ఏళ్లు శాకాహారి, ధూమపానం, మద్యపానం అలవాట్లు లేనివారు, పిల్లల్ని మంచిగా చూసుకునే నాన్న కావాలంటూ పెట్టింది.

* ప్రపంచంలో ఎక్కువ మంది వృద్ధులు ఉన్న దేశంగా చైనా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 60 ఏళ్లకు పైబడినవారు 16 కోట్ల 70లక్షల మంది, 80ఏళ్లకు పైబడినవారు పది లక్షల మంది ఉన్నారు.
* జపాన్‌లో నూటికి 30 శాతం మంది 60 ఏళ్లు పైబడినవారున్నారు.
* ౩౦ ఏళ్ల క్రితం వయసు మళ్లిన వారు అన్ని దేశాల్లోనూ తక్కువ. 2010 నాటికి 23 దేశాల్లో వీరి సంఖ్య క్రమంగా పెరిగింది.
* 2050 నాటికి 64 దేశాలు 30 శాతం వృద్ధులతో నిండిపోతున్నాయి. అంటే వృద్ధుల జనాభా 120 కోట్లకు చేరుతుంది.
* అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే 80శాతం మంది వృద్ధులుంటారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.

* భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పుడు సగటు ఆయుర్దాయం కేవలం 27 ఏళ్లు. జీవన ప్రమాణాలు మెరుగుపడటం, వైద్యరంగంలో వచ్చిన అనూహ్య పురోగతి కారణంగా దేశంలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
* భారతదేశ జనాభా 1960లో 2.4కోట్ల మంది వృద్ధులుండగా…
2001 జనాభా లెక్కల నాటికి 7 కోట్లకు చేరుకున్నారు. ప్రస్తుతం సుమారుగా 10కోట్ల పైబడి, 60 ఏళ్లు దాటిన వారున్నారు.
* ఈ సంఖ్య 2050 నాటికి 30కోట్లు పైన ఉండే అవకాశం ఉంది. వీరిలో ఆడవారి శాతం ఎక్కువ. 7-0శాతం పైబడి గ్రామీణ ప్రాంతాలలో జీవిస్తున్నారు. * వృద్ధుల జనాభా ఎక్కువవడానికి ముఖ్యమైన కారణం జీవితకాలం పెరగటం, మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం.

* ఇప్పటికీ దేశ జనాభాలో అధిక భాగం గ్రామాల్లోనే కనిపిస్తుంది. నూటికి 70 మంది సీనియర్ సిటిజన్లు పల్లెల్లోనే నివసిస్తున్నారు. దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారు 60 ఏళ్ల తర్వాత శరీర సత్తువ తగ్గి సంపాదించుకోలేకపోతున్నారు. వీళ్లకు ఏ విధమైన ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల ఆకలితో అలమటిస్తున్నారు.

                                                                                                            మల్లీశ్వరి వారణాసి
Aging is a Mandatory step in Life