Friday, March 29, 2024

సంపాదకీయం: అప్రజాస్వామికం

- Advertisement -
- Advertisement -

Agriculture bill passed in Parliament రాజు తలచుకుంటే ఎటువంటి బిల్లులనైనా శాసనాలు చేయించుకోడం ఓ లెక్కా! ఆదివారం నాడు రెండు అత్యంత వివాదాస్పద వ్యవసాయ బిల్లులపై ప్రధాని మోడీ ప్రభుత్వం రాజ్యసభ ఆమోద్ర ముద్ర వేయించుకున్న తీరు గమనించే వారికి ఈ అభిప్రాయం కలగడం సహజం. 245 మంది సభ్యులు గల రాజ్యసభలో పాలక భారతీయ జనతా పార్టీకి సొంతంగానూ, ఎన్‌డిఎ కూటమి పరంగానూ ఏ విధంగా చూసుకున్నా స్పష్టమైన మెజారిటీ లేదు. బిజెపి సొంత బలం 85 కాగా, కూటమిలోని భాగస్వామ్య పక్షాల స్థానాలను కూడా కలుపుకుంటే అది 112కి చేరుకుంటుంది. సాధారణ మెజారిటీకి అవసరమైన బలం 123. గతంలో కీలక బిల్లుల విషయంలో బిజూ జనతాదళ్ బిజెడి (9), తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్‌ఎస్ (7), వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్‌ఆర్‌సిపి (6)ల మద్దతు కూడగట్టుకునేది. ఆదివారం నాటి రెండు బిల్లులకు బయటి నుంచి ఒక్క వైఎస్‌ఆర్ సిపి మద్దతు మాత్రమే లభించింది. బిజెడి, టిఆర్‌ఎస్‌లు వ్యతిరేకించాయి.

అదే సమయంలో ఇటీవలి వరకు ఎన్‌డిఎ కూటమిలో భాగస్వామిగా ఉన్న అకాలీదళ్ కూడా ఎదురు తిరిగింది. ఈ నేపథ్యంలో ఓటింగ్ జరిపి ఉంటే ఈ రెండు బిల్లులు రాజ్యసభలో ఓడిపోయి ఉండేవి. ఇది అందరికీ అర్ధమయ్యే అతి సులభమైన లెక్క. ఆ రోజుకి నిర్ణీత వ్యవధి అయిపోయినందున సభ వాయిదా వేయాలని ప్రతిపక్షాలు కోరినా వినకుండా, బిల్లులను ప్రత్యక్ష ఓటింగ్‌కు పెట్టాలన్న వాటి అభ్యర్థనను తోసిపుచ్చి రాజ్యసభ ఉపాధ్యక్షులు హరివంశ్ నారాయణ సింగ్ సభా సమయాన్ని పొడిగించి మరీ మూజువాణీ ఓటు రూటులో బిల్లులకు ఆమోద ముద్ర వేయించారు. ఈ విధంగా పాలక పక్షం ముందస్తు పథకం ప్రకారం బిల్లులను పాస్ చేయించుకోదలచిన తీరుకు నిరసనగా ప్రతిపక్షం విరుచుకుపడింది. కొందరు ఎంపిలు సభాధ్యక్ష వేదిక వద్దకు దూసుకుపోయి నిబంధనల పుస్తకాన్ని, ఇతర పత్రాలను చించి ఉపాధ్యక్షుని మీదికి విసిరి అక్కడున్న మైక్రోఫోన్‌ను విరిచేశారు. అసాధారణమైన అల్లరి సృష్టించినందుకు 8 మంది ప్రతిపక్ష సభ్యులను సమావేశాలు ముగిసే వరకు చైర్మన్ వెంకయ్య నాయుడు సోమవారం నాడు సస్పెండ్ చేశారు.

నిబంధనలను అతిక్రమించి బిల్లులకు ఆమోద ముద్ర వేయించినందుకు డిప్యూటీ చైర్మన్‌పై ఆదివారం నాడే టిఆర్‌ఎస్ సహా ఎనిమిది పార్టీలకు చెందిన 100 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. దేశంలో 80 శాతానికి మించి గల సన్నకారు, చిన్న రైతుల ప్రయోజనాలను కార్పొరేట్ ఉక్కు పాదాల కిందకు తోసివేసే కుట్రతో తలపెట్టిన శాసన చర్యను తమకున్న సంఖ్యాబలంతో అడ్డుకొని వ్యవసాయ రంగాన్ని, ఆహార భద్రతను కాపాడుకోవాలనే మహత్తర దీక్షతో ఎంతో బాధ్యతాయుతమైన వైఖరి తీసుకున్న ప్రతిపక్ష సభ్యులను అల్లరి మూకగా పరిగణించి క్రమ శిక్షణ చర్య తీసుకోడం రెచ్చగొట్టి మచ్చ వేయడం తప్ప మరొకటి కాదు. రాష్ట్రపతి సంతకం చేయగానే శాసన రూపం ధరించనున్న ఈ బిల్లులు గత జూన్‌లోనే ఆర్డినెన్స్‌ల రూపంలో దేశం మీద పడిపోయాయి. రాష్ట్రాల అధీనంలో గల వ్యవసాయ మార్కెట్లకు సమాంతరంగా కార్పొరేట్ శక్తులు డబ్బు సంచులతో రంగ ప్రవేశం చేసి రైతులతో నేరుగా ఒప్పందాలు కుదుర్చుకొని వారి ఉత్పత్తులను కొనుగోలు చేసుకోడానికి ఈ చట్టాలు అవకాశం కలిగిస్తాయి. తేనె పూసిన కత్తుల్లా ఆరంభంలో అధిక ధరలను చెల్లించినా క్రమంగా రైతులను లోబర్చుకొని వారిని దోచుకోడమే లక్షంగా కార్పొరేట్ శక్తులు అడుగులు వేస్తాయన్నది అనుభవ సత్యమే. ఆ క్రమంలో మద్దతు ధరలు, మార్కెటింగ్ యార్డుల వ్యవస్థలు అంతరించి పోడం ఖాయం.

అప్పుడు రైతులు అంబానీలు, అదానీల వంటి బడా సంస్థల నిర్దేశం మేరకు, వారు కోరిన పంటలనే పండించక తప్పని దుస్థితికి దిగజారిపోతారు. మరో విధంగా చెప్పాలంటే వారి భూముల్లోనే వారు కూలీలుగా మారిపోయే దుష్పరిణామం దేశమంతటా కోరలు చాచుకొంటుంది. టిఆర్‌ఎస్ అన్నట్టు వ్యవసాయ దేశం కార్పొరేట్ దేశంగా పరిణమిస్తుంది. భారీ వ్యవసాయ క్షేత్రాలున్న అమెరికాలో అమల్లో గల ఈ విధానాన్ని చిన్న, సన్నకారు రైతులే గల భారత దేశంలో ప్రవేశపెట్టడమంటే చీమలు పెట్టిన పుట్టలను పాముల ఆక్రమణకు అమర్చి పెట్టిన చందమే. అటు పంజాబ్, హర్యానా రైతులు తీవ్ర ఆందోళనలు చేపట్టి వ్యతిరేకిస్తున్నా, ప్రతిపక్షాలు తగిన సంఖ్యాబలంతో రాజ్యసభలో గట్టిగా అభ్యంతరం చెప్పి నిబంధనల ప్రకారం ప్రజాప్వామ్య నియమానుసారం వ్యవహరించాలని ఎంతగా చెప్పినా వినకుండా ఈ బిల్లులకు శాసన రూపం ఇవ్వవలసిన అవసరం ప్రభుత్వానికి కలగడం విడ్డూరం. ఇది జనహితం కోసం చేసినది ఎంతమాత్రం కాదని కార్పొరేట్ల మేలుకేనని నిరూపితమవుతుంది. ప్రజాస్వామిక నియమాలను కాలరాసి ఇటువంటి చట్టాల ను జాతి మీద రుద్దిన క్షణం చీకటి క్షణంగా చరిత్రలో నమోదవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News