Home లైఫ్ స్టైల్ ఎదిగిన పిల్లల ఎదపై కుంపట్లై

ఎదిగిన పిల్లల ఎదపై కుంపట్లై

lifeఆత్మహత్య రైతు కుటుంబాల తల్లుల వేదన 

గత డిసెంబర్ 23వ తేదీనాడు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా భువనగిరి జిల్లాలోని రైతు ఆత్మహత్య కుటుంబాల సమావేశం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముగిసింది. బాధిత కుటుంబాల సభ్యులందరు వారివారి గ్రామాలకు వెళ్లిపోతున్నారు. చివరగా ఇద్దరు అక్కలు మా దగ్గరికి వచ్చారు. అందులో ఒక అక్క బోరున ఏడ్చేసింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపిందించి. నాకు ఆ అక్క గత 6 సంవత్సరాలుగా తెలుసు కానీ ఏ రోజు ఆమె కంటిలో నీళ్లు చూసిన గుర్తు లేదు. “ఎందుకు రా ఏడుస్తున్నావు. అప్పుల వాళ్లు ఏమన్నా అన్నారా, ఆరోగ్య సమస్యలా, ఆర్థిక సమస్యలా ఏమిటి నీ సమస్య” అని నేను, మిత్రుడు ఇస్తారి మరోసారి అడిగాము. అన్నా ఈ సమస్యలు ఎప్పుడూ ఉన్నవే కానీ, పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత మా కష్టాలు కొంతైనా తీరుతాయి అనుకుంటే ఆ పిల్లలే ఇప్పుడు ఎదురు తిరిగి మాట్లాడుతున్నరు. కొన్ని సార్లు కఠినంగా మాట్లాడుతున్నరు. ఏమి పాపం చేశామో మీ కడుపున పుట్టాము అని మరింత బాధ పెడుతున్నరు. ఇతరుల పిల్లలతో పోల్చుకుని తమకు ఆ అవకాశాలు లేవని మా మీద బాధపడుతున్నరు” అన్నారు. అప్పుడు ఆ సమయానికి “మీరేమీ బాధపడకండి మేమొచ్చి మీ పిల్లలతో మాట్లాడుతాము” అని చెప్పాము. ఈ పిల్లలకు వాళ్ల అమ్మలు పడుతుండే కష్టాలు పూర్తిగా అర్థం కావటం లేదనిపిస్తుంది.
సగటున 30 సంవత్సరాల వయసులో భర్తను కోల్పోయి అప్పుల వారి బాధలు ఎదుర్కొని ఆ తల్లులు వీళ్లను పెద్ద చేయటానికి ఎన్ని కష్ట, నష్టాలను ఓర్చుకున్నారో ఈ పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది. మీకు ఏమి చేస్తే బాగుంటుందని అడిగినప్పుడు ఈ కుటుంబాల మహిళలు అందరూ ఒక్క కంఠంతో చెప్పిన మాట “మాకు కావలసిందంతా పిల్లల భవిష్యత్ ” అనే. నిజం చెప్పాలంటే ఈ సమాజంలో పిల్లల భవిష్యత్‌పై ఆశతో అత్యంత ధైర్యంగా బతుకుతున్న వారు ఎవరైనా ఉన్నారంటే మొదట చెప్పాల్సింది ఈ తల్లుల పేర్లే. ఈ సందర్భంగా ఒక సంఘటన గుర్తు చేయాలనిపిస్తుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ హెచ్‌ఆర్‌ఎఫ్ బాధ్యులు పరిమళతో కలిసి వనపర్తి పక్కనే ఉన్న గ్రామంలో ఒక రైతు ఆత్మహత్య కుటుంబం వద్దకు వెళ్లాము. సహజంగా దగ్గరికి వెళ్లి మాట్లాడిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతు ఫొటో (ఫ్రేమ్ చేయించి ఇంట్లో పెట్టుకునే ఫొటో, అందులో ఆత్మహత్య చేసుకున్న తేదీ కూడా ఉంటుంది)ను అడుగుతూ ఉంటాము. ఆ విధంగానే ఫొటో అడిగాము. ఆ అక్క ఫొటో బీరువాలో దాచానని చెప్పింది. సాధారణంగా ఎవరూ అలా బీరువాలో దాచరు. ఏ గోడకో తగిలిస్తారు. అందుకే నేను అడిగాను ఫొటో బీరువాలో ఎందుకు దాచారని, అప్పడు ఆ అక్క చెప్పింది. “ఈ మధ్య అప్పుల వాళ్ల సమస్యలు, పిల్లలను సాదడం మరీ కష్టమైందన్నా, కొన్నిసార్లు రాత్రి నిద్రపట్టక ఆయన ఫొటో వైపు చూస్తూ నేనూ అలా చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఒకవేళ అలా చేస్తే పిల్లల పరిస్థితి ఏమైపోతుందో అని కనీసం ఆ ఆలోచన రాకుండా ఉండటానికి ఆయన ఫొటో కనిపించకుండా బీరువాలో పెట్టాను” అని చెప్పి అప్పుడు ఫొటో తీసుకువచ్చి చూపించింది. “పిల్లల భవిష్యత్తేకదన్నా మాకున్న ఏకైక ఆశ” అని చెప్పింది. తల్లులు పిల్లల కోసం ఇలా కష్టాలను దిగమింగుకుని ముందుకు వెళ్తుంటే పిల్లలు కూడా పరిస్థితులను అర్థం చేసుకోవాలి. కాని ఈ విషయంలో మనం పిల్లలను కూడా అపార్థం చేసుకోవలసిన అవసరం లేదు. పరిస్థితులు, సామాజిక మాధ్యమాల ప్రభావం వారిమీద పడుతున్నది. పోటీతత్వంలో అన్ని అవకాశాలున్న మిగిలిన యువతతో వారు సెల్ ఫోన్లు, సినిమాలు తదితర విషయాలలో పోటీపడవలసి వస్తున్నది.
మెంటర్స్ గ్రూప్
సమాజంలో యువతలో కూడా చాలా మార్పు వస్తున్నది. రైతు ఆత్మహత్యల గురించి పట్టణాలలో నివసిస్తున్న యువత, విద్యాధికులు ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనలో నుంచి వచ్చినదే ఈ మెంటర్స్ గ్రూప్. హైదరాబాద్‌లో నివసిస్తున్న యువకులు ఈ రైతు ఆత్మహత్య కుటుంబాలలోని యువకుల చదువు, వారి జీవనోపాధుల గురించి ఆలోచించటానికి ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమవుతారు. ఆ కుటుంబంలోని పిల్లలను, యువకులను కలుసుకుంటారు. ప్రస్తుతానికి వారు భువనగిరి జిల్లాలోని రైతు ఆత్మహత్య కుటుంబాలను కలిసి వారికి కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వారి చదువు పూర్తయిన తర్వాత లభించే అవకాశాల గురించి సూచనలు, సలహాలు ఇస్తారు. అంతేకాకుండా వారి తల్లిదండ్రులు వ్యవసాయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, కుటుంబ పెద్దను కోల్పోయిన తర్వాత మిగిలిన వాళ్లు పడుతున్న కష్టాలను సున్నితంగా వివరిస్తారు. ఈ మెంటర్స్‌లో కొంత మంది కొందరు పిల్లల బాధ్యత తీసుకొని వారి చదువు, కుటుంబ పరిస్థితుల గురించి రెగ్యులర్‌గా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులలో ఒకరుగా కలిసిపోతారు. ఐదు సంవత్సరాలు వెనక్కు వెళదాం. న్యూయార్క్ టైమ్స్ దినపత్రిక వారు రైతు ఆత్మహత్యలపై కాస్త భిన్నంగా అధ్యయనం చేద్దామనుకున్నారు. సాధారణంగా మీడియా వారు ఎవరైనా రైతు ఆత్మహత్య జరిగిన తర్వాత దానికి దారితీసిన పరిస్థితులు, అప్పటి కుటుంబ నేపథ్యం, ఆ కుటుంబంలోని పిల్లల చదువు, ఉపాధి మొదలగు విషయాలపై దృష్టి పెడతారు. కానీ వీరు మాత్రం ఆత్మహత్యకు ప్రయత్నించి బయటపడ్డ వాళ్లను కలిసి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై అధ్యయనం చేద్దామన్నారు. అప్పటికే 6 సంవత్సరాలుగా రైతు ఆత్మహత్యలపై పనిచేస్తున్న మేము కూడా ఇలా ఆత్మహత్యకు ప్రయత్నించి చివరి క్షణాలలో ప్రాణాలతో బయటపడ్డ వారిని కలుసుకోవాలనుకొన్నప్పుడు కొంత ఆశ్చర్యానికి లోనయ్యాము. ఎటువంటి వాస్తవాలు బయటికి వస్తాయో అన్న ఆసక్తి కూడా ఏర్పడింది. ఇక రైతు ఆత్మహత్య కుటుంబాల సమాచారం మా దగ్గర ఉండేది కాని ఆత్మహత్యకు ప్రయత్నించి బయటపడ్డవారి సమాచారం ఉండేది కాదు. అప్పుడు మేము హుస్నాబాద్ హాస్పిటల్‌కు వెళ్లి 108 వారి సహకారంతో డాక్టర్లకు విషయం వివరించి కొంతమంది ఆత్మహత్యకు ప్రయత్నించి బతికి బయటపడ్డవారి సమాచారం తీసుకున్నాము. వారి దగ్గరకు వెళ్లి ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం వరకు వెళ్లవలసి వచ్చిందని అడిగినప్పుడు, అప్పులు, పంట నష్టం, బోరు విఫలం, పంటకు ధర లేకపోవడం లాంటి ఎప్పటి నుండో తెలిసిన కారణాలే చెప్పారు. కాని వారు చెప్పిన మరో కారణం మమ్మల్ని మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. మేము ఇన్ని బాధలు, అప్పులు, అవమానాలతో సతమతమవుతుంటే చేతికొచ్చిన పిల్లలు (యువత) అవేవీ పట్టనట్టు సెల్‌ఫోన్లు, సినిమాలు, క్రికెట్టు అంటూ వారి లోకంలో వారు ఉంటున్నారు. వారు మా కష్టాలు తీరుస్తారని కాదు కాని, మా కష్టనష్టాలను బాధలను వారు విని ఉంటే మాకు కొంతైనా ఉపశమనం ఉంటుంది కదా అని ఆత్మహత్యకు ప్రయత్నించి బయటపడ్డ ఒక రైతు చెప్పిన మాట ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ అధ్యయనానికి ముందు, తర్వాత కూడా మేము ప్రస్తుత వ్యవసాయం రైతు ఆత్మహత్యలకు దారితీస్తున్న పరిస్థితుల గురించి చాలా కళాశాలల్లో సమావేశాలు నిర్వహించాము. అప్పుడు కూడా కొంత మంది యువత ఆదివారాలు, సెలవు రోజులలో వ్యవసాయ పనుల్లో కుటుంబానికి సహకరిస్తామన్నారు. కాని విత్తనాల ధరలు, మార్కెట్ రేట్లు మొదలగు విషయాలు మా నాన్నకే తెలుసు అనే సమాధానంవచ్చేది.
వ్యవసాయం చదువులో భాగం కావాలి
మనది పూర్తిగా వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి చిన్నప్పటి నుండి వ్యవసాయంలో ఉన్న లాభ, నష్టాలు ప్రకృతి వైఫల్యాలు, మార్కెట్టు ధరలు, మన ఆహార పంటలు తదితర విషయాలు పాఠ్యాంశాలుగా ఉంటే వ్యవసాయంలో తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు వారికి అర్థమవుతాయి. కొంతమంది రైతు ఆత్మహత్య కుటుంబాలలోని యువకులు ఎన్నో కష్టాలు ఎదుర్కొని తమ కాళ్లపై తాము నిలబడి కుటుంబ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ కాలంలో యువతలో వస్తున్న మార్పుకు ఒక ఉదాహరణ నాకు గుర్తుకు వస్తుంది. సంగారెడ్డి పట్టణంలో గత నవంబర్ 11 నాడు జరిగిన ఒక పెళ్లికి హాజరయ్యాను. సాధారణంగా యువకులు చాలా హంగామాగా పెళ్ళిళ్లు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఒక పెళ్లికి మించి ఇంకొక పెళ్లికి ఖర్చు పెట్టించాలనుకొంటారు. అలా లెక్కలేసుకుంటూపోతే దేశంలో ప్రతి సంవత్సరం పెళ్లిళ్లకు చేస్తున్న ఖర్చు 2 లక్షల కోట్లు అని అంచనా. ఆ రోజు సంగారెడ్డిలో జరిగిన నీలిమ, ఆవినాష్ పెళ్లికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, అర్థం చేసుకున్నారు. పెద్దలను ఒప్పించారు. అంతేకాదు దేశానికి అన్నం పెట్టే రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకోవలసి వస్తుందో అధ్యయనం చేశారు. వారి పెళ్లి సందర్భంగా మామూలుగా అయ్యే ఖర్చును తగ్గించుకుని కొన్ని రైతు ఆత్మహత్య కుటుంబాలకు చేయూతనిద్దామని అనుకున్నారు. వారి పెళ్లిలో అది అమలు చేసి చూపించారు. వ్యవసాయ సంక్షోభంలో అమరులైన ఆ కుటుంబాలను వేదిక మీదికి పిలిచి సన్మానించి, చేయూతనందించారు. ఈ సందర్భంగా మీడియాను ప్రత్యేకంగా అభినందించాలి. మొత్తం సంగారెడ్డి మీడియా అంతా పెళ్లి దగ్గర ఉందా అనిపించింది. ఏది ఏమైనా దేశంలో యువతలో మార్పు వస్తున్నది. రైతుల గురించి ఆలోచించే వారి సంఖ్య పెరుగుతున్నది. ఇదో మంచి పరిణామం. నీలిమ, ఆవినాష్ లాంటి దంపతులు ఈ దేశ రైతాంగానికి ఎంతో అవసరం. ప్రభుత్వ విషయానికి వస్తే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలోని పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని జి.వో. 194లో ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులు ఎక్కడా ఈ పిల్లల చదువు బాధ్యత తీసుకోలేదు. పిల్లలను సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు పంపటానికి తల్లులు ఇష్టపడటం లేదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఇది కొంత నిజమే కావచ్చు. ఎందుకంటే అప్పుడే భర్తను కోల్పోయిన మహిళ ఆ షాక్ నుండి తేరుకోకముందే పిల్లలను కొద్దిగా దూరంగా పంపటానికి ఇష్టపడకపోవచ్చు. ఇక అధికారులకు మరుసటి సంవత్సరం ఈ పిల్లలు కాని, ఈ కుటుంబాలు కాని గుర్తుకు రారు. ఐతే కేవలం సాంఘిక సంక్షేమ వసతి గృహలలోనే కాకుండా ఇంటి దగ్గరి నుండి ఈ పిల్లలు చదువుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలి. దేశంలోనే రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగిన రాష్ట్రం మహారాష్ట్ర. ఆ రాష్ట్రంలోని మరట్వాడ ప్రాంతంలోని బీద్ జిల్లాలో ప్రభుత్వం, శాంతి నివాస్ సంస్థ ఆత్మహత్య చేసుకొన్న రైతు కటుంబాల పిల్లలు ధైర్యం కోల్పోకుండా ఉండటానికి, వారు జీవితంలో నిలదొక్కునే విధంగా చేయడానికి సహకరిస్తున్నట్టు తెలిపారు. మన రాష్ట్రంలో ప్రభుత్వం, సామాజిక సంస్థలు, ఇప్పటికే స్థిరపడిన యువత ఈ పిల్లల బాధ్యత తీసుకుంటారని ఆశిద్దాం.