Friday, April 19, 2024

క్యాన్సర్ చికిత్సలో “ ఎఐ” సాయం

- Advertisement -
- Advertisement -

క్యాన్సర్ కణాల మనుగడకు కీలకమైన జన్యువులను గుర్తించడానికి పరిశోధకులు కృత్రిమ మేథో పరిజ్ఞానం( artificial intellegence) తో కూడిన సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. ఈ విధానం క్యాన్సర్ రోగుల వ్యక్తిగతీకరించిన చికిత్సకు ఉపయోగపడుతోందని నూతన అధ్యయనం వెల్లడించింది. వివిధ రకాల జన్యువులపై ఆధారపడే అనేక రకాల క్యాన్సర్ కణాలను అర్థం చేసుకోడానికి పరిశోధకులు అనేక రకాల క్యాన్సర్ కణాలను విశ్లేషించారు. బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ సస్సెక్స్‌కు చెందిన పరిశోధకులు ఈ ప్రక్రియను రూపొందించడంలో విజయం సాధించారు. దీనికోసం కచ్చితంగా అంచనా వేయగల కంప్యూటరీకరణ అల్గారిథమ్ ( algorithm) ను అభివృద్ధి చేశారు.

ఇది క్యాన్సర్ ట్యూమర్ ( కణితి) లోని జన్యుమార్పుల ద్వారా ఏ జన్యువులు కణానికి ముఖ్యమో అంచనా వేస్తుంది. సకాలంలో కార్యాచరణ లక్షాలను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. రోగుల వ్యక్తిగత చికిత్సకు వైద్యులను మార్గదర్శకం చేస్తుంది. డిఎన్‌ఎ క్రమబద్ధీకరణకు అయ్యే ఖర్చును తగ్గించడానికి, క్యాన్సర్ కణాల తేడాను గుర్తించే శక్తి కృత్రిమ మేథస్సుకు పెంపొందించడానికే తమ విజన్‌గా పరిశోధకులు వివరించారు. అంటే వ్యక్తిగతంగా క్యాన్సర్ రోగులకు సరైన చికిత్సను అందించడం. “కణం లోని కేవలం డిఎన్‌ఎ జన్యుసరళి, ఆర్‌ఎన్‌ఎ స్థాయిల బట్టి నిర్ధిష్ట జన్యు ఆధారిత కణాలను గుర్తించగలిగే సామర్థాన్ని సంపాదించామని పరిశోధకులు వివరించారు. ట్యూమర్ జీవాణుపరీక్ష నమూనాల నుంచి సులభంగా, చౌకగా వీటిని పొందవచ్చని చెప్పారు. క్యాన్సర్ చికిత్స విధానాల్లో డాక్టర్లకు బాగా ఉపయోగపడే టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి దృష్టి కేంద్రీకరిస్తున్నామని తెలియజేశారు. క్యాన్సర్ ఉనికి, రకం బట్టి క్యాన్సర్ చికిత్సలు ఆధారపడి ఉంటాయి.

క్యాన్సర్ ట్యూమర్లలో జన్యుపరమైన తేడాలు క్యాన్సర్ ప్రామాణిక చికిత్సలను పనికిరానివిగా చేస్తుంటాయి. వ్యక్తిగతీకరణ విధానంలో చికిత్స జరిగితే క్యాన్సర్ రోగుల జీవన ప్రమాణం తోపాటు నాణ్యత కూడా పెరుగుతుంది. అనవసరమైన చెడు ఫలితాలు బాగా తగ్గుతాయి. ప్రతి కణం లోను దాదాపు 20,000 జన్యువులు ఉంటాయి. అవి ప్రోటీన్ల తయారీకి కావలసిన సమాచారంతో ఉంటాయి. ఆ జన్యువుల్లో దాదాపు 1000 చాలా ముఖ్యమైనవి. అంటే కణం జీవించడానికి అవి చాలా అవసరం. మామూలు కణాలు ఏవైతే క్యాన్సర్ కణాలుగా తయారౌతాయో ఆంకోజీన్స్ అంటే క్యాన్సర్‌ను కలిగించే బలం ఉన్నవి క్రియాశీలకం ( activated)గా తయారౌతాయి. ట్యూమర్లను అణచివేసే జన్యువులు క్రియాశూన్యమౌతాయి.

ఫలితంగా కణం అమరిక మారిపోతుంది. ఇది కణాన్ని మనుగడ కోసం కొత్త జన్యు సమూహంపై ఆధారపడే దానిగా తయారు చేస్తుంది. క్యాన్సర్ కణాలను చంపడానికి ఇది దోపిడీకి గురి కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కృత్రిమ పరిజ్ఞాన సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ట్యూమర్ ఆధారిత జన్యువుల ప్రొటీన్ల పదార్థాలను టార్గెట్ చేయవచ్చు. ఫలితంగా క్యాన్సర్ కణాలు నాశనమౌతాయి. ఈ జన్యువులపై ఆధారపడని సాధారణ కణాలను విడిచిపెట్టడమవుతుందని అధ్యయనం వెల్లడించింది జన్యువులపై ఆధారపడే క్యాన్సర్ కణాలను లేబొరేటరీ టెక్నిక్‌ల ద్వారా కూడా గుర్తించ వచ్చు. అయితే ఇది ఎంతో వ్యయం, సమయంతో కూడుకున్న పని. అంతేకాక అన్ని ట్యూమర్ల నమూనాలను విశ్లేషించడం సాధ్యం కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News