Home బిజినెస్ ప్రమోషన్లు, నియామకాలు ఆపేయండి

ప్రమోషన్లు, నియామకాలు ఆపేయండి

Air India

 

ఎయిర్ ఇండియాకు సూచించిన ప్రభుత్వం
విక్రయానికి సిద్ధమవుతున్నందు వల్లే ఈ నిర్ణయం

ముంబై: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందువల్లో సంస్థలో ఉద్యోగులకు ఎలాంటి ప్రమోషన్లు, కొత్త నియామకాలు చేపట్టరాదని ఎయిర్ ఇండియా యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వం సూచించిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. ఈ సంస్థకు దాదాపు రూ.50 వేల కోట్లకు పైగా అప్పులు ఉన్న విషయం తెలిసిందే. జూలై 15 వరకు ఎయిర్ ఇండియా ఖాతా పుస్తకాలను క్లోజ్ చేసి, వాటిని బిడ్‌ల సందర్భంలో వినియోగించనున్నారు. ఎయిర్ ఇండియాను విక్రయించనుండడం వల్లే ప్రమోషన్లు, కొత్త నియామకాలు కూడా నిలుపుదల చేశారు. కొత్త విమానాలను కూడా అత్యవసరమైతేనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖ నుంచి ఈ మార్గదర్శకాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ప్రైవేటీకరణ అసంపూర్తిగా ఉండటం వల్ల ఎయిర్ ఇండియాకు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదనేది యాజామన్యం భావిస్తోంది. అందుకే ప్రమోషన్లను నిలిపివేయనున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 10 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. వచ్చే నాలుగు లేదా ఐదు నెలల్లో ఎయిర్ ఇండియా వాటాల అమ్మకాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ప్రతి రోజు ఈ సంస్థ దాదాపు రూ.15 కోట్లు ఆదాయాన్ని ఆర్జిస్తోంది. 2018లో ఈ విమాన సంస్థలో 76 శాతం వాటాలను విక్రయించేందుకు ప్రయత్నాలు చేయగా అవి సఫలం కాలేదు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన దీన్ని పూర్తిచేయాలని చూస్తోంది. ఇప్పటికే దీనిపై మంత్రుల బృందం కసరత్తులు ప్రారంభించింది. మార్చి 31న ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గానూ ఎయిరిండియా రూ.50వేల కోట్లకు పైగా అప్పుల్లో నిర్థారణకు రావడంతో ప్రైవేటీకరణ తప్పదని కేంద్రం నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే నిధుల లేమితో జెట్ ఎయిర్‌వేస్ మూత పడిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. రాబోయే కొన్ని వారాల్లో ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశమయ్యే అవకాశముంది.

AI India freezes promotions, new appointments