Home Default ఎంఐఎం ఓటు మీరా కుమార్‌కే

ఎంఐఎం ఓటు మీరా కుమార్‌కే

AIMIM-Meira-Kumar

హైదరాబాద్ : రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థి మీరాకుమార్‌కు ఓటు వేయాలని ఎంఐఎం నిర్ణయించుకుంది. ఎంఐఎంకు ఒక ఎంపి, తెలంగాణలో ఏడుగురు, మహారాష్ట్రలో ఇద్దరు శాసనసభ్యులు కలిపి మొత్తం పది ఓట్లు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్న సమయంలోనే కాంగ్రెస్‌తో ఎంఐఎం సంబంధాలు బెడిసికొట్టాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత అధికార టిఆర్‌ఎస్‌కు ఆ పార్టీ మద్దతునిస్తుంది. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రాంనాథ్ కోవింద్‌కు టిఆర్‌ఎస్ మద్దతిచ్చినప్పటికీ ఆయన ఎంపికను ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిని అవకాశంగా మీరాకుమార్‌ను సమర్థించాలని కోరుదామని కాంగ్రెస్‌లో విహెచ్ తదితరులు పిసిసికి సూచించినా, కొందరు మైనారిటీ నాయకులు మాత్రం ఇష్టపడలేదు. ఎంఐఎం దేశవ్యాప్తంగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తూ కాంగ్రెస్‌కు నష్టపరుస్తుండడంతో పాటు, ఇక్కడ టిఆర్‌ఎస్‌తో సన్నిహితంగా ఉన్నప్పుడు వారిని స్వయంగా వెళ్ళి మద్దతు కోరాల్సిన అవసరం లేదని వాదించారు. దీంతో మీరాకుమార్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఎంఐఎం నాయకులను కలవలేదు. అయితే మద్దతునివ్వాల్సిందిగా కోరుతూ ఎంఐఎంకు లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నిక సమీపించడంతో శనివారం నాడు మీరాకుమార్‌కు ఓటేయాలని ఎంఐఎం నిర్ణయానికి వచ్చింది.