లక్నో: అయోధ్య స్థలంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఎఐఎమ్ పిఎల్ బి) పేర్కొంది. సుప్రీం తీర్పుపై లక్నోలో శనివారం అన్నీ ముస్లిం పార్టీలతో ముస్లిం పర్సనల్ లా బోర్డు సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయ్యాలా? వద్దా? అని చర్చించిన బోర్డు చివరకు రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించినట్లు జమియత్ ఉలామా ఐ హిందీ అధ్యక్షుడు అర్షద్ మదానీ తెలిపారు. దశాబ్దాలుగా ఉన్న అయోధ్య రామజన్మభూమి-బాబ్రీమసీదు వివాదంపై ఈనెల 9న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద అయోధ్య స్థలంలో రామ మందిరం నిర్మించాలని, మసీదుకు అయోధ్యలోనే మరో చోట 5 ఎకరాల భూమి ఇవ్వాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యూపి సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు స్వాగతించింది.
AIMPLB to File Review Petition Against Ayodhya Verdict