Thursday, April 18, 2024

సంపాదకీయం: ఎయిర్ ఇండియా చౌక బేరం!

- Advertisement -
- Advertisement -

sampadakiyam పోటీని దీటుగా తట్టుకుంటూ లాభాల్లో నడిపి దేశ ఆర్థిక సౌష్టవానికి దన్నుగా నిలిపే శక్తి సామర్ధాలున్నా ఆ సంకల్పం, దీక్ష కొరవడి ప్రజా ప్రభుత్వాలే పబ్లిక్ రంగ పరిశ్రమలకు చేతులారా తల కొరివి పెట్టడం యుగధర్మం అయిపోయిన రోజుల్లో ఎయిర్ ఇండియాను కారుచౌకగా అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడడం ఆశ్చర్యపోవలసిన పరిణామం ఎంతమాత్రం కాదు. ఈ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థలో 76 శాతం వాటాలను విక్రయించడానికి 2018 ఏప్రిల్‌లో ప్రధాని మోడీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం కొనేనాథులు లేక విఫలమైంది. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భం అది. అందుచేత అప్పట్లో మరింత చౌకగా అమ్మకానికి పెట్టడానికి పాలకులు సాహసించలేకపోయారు. ఇప్పుడటువంటి భయం లేదు. ఇప్పట్లో ఎన్నికలు లేవు, రావు. ఇంత విలువైన, ప్రతిష్ఠాత్మకమైన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థను ఇంత తక్కువ ధరకు ప్రైవేటుకు కట్టబెట్టడం ఏమిటి, ఎందుకు అని ప్రజలు తమను నిలదీస్తారనే బెదురు కొంచెమైనా ఉండడానికి అవకాశం లేదు.

అందుకే అప్పటి కంటే ఎంతో సరళతరమైన, సుళువైన షరతులను ఇప్పుడు విధించారు. కనీసం రూ. 5000 కోట్ల కిమ్మత్తు వ్యాపారం సాగిస్తున్న సంస్థలే వేలంలో పాల్గొనాలని అప్పుడు విధించిన షరతును ఇప్పుడు బాగా నీరుగార్పించారు. కేవలం రూ. 3500 కోట్ల కిమ్మత్తు వ్యాపారం గల సంస్థలు పాల్గొనవచ్చని ప్రకటించారు. అలాగే ఎయిర్ ఇండియాకున్న మొత్తం (రూ. 60,074 కోట్లు) అప్పును భరించనక్కరలేదని సుమారు మూడో వంతు (రూ. 23,286 కోట్లు) తీరిస్తే చాలని తీసుకున్న నిర్ణయం కొనుగోలుదారు నెత్తిన పాలు పోసే విధంగా ఉంది. ఇలా పలు రకాలయిన ఆకర్షణలతో ఎలాగో ఓలాగ ఎయిర్ ఇండియాను వొదిలించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం గమనించవలసిన అంశం. ప్రజాధనంతో నెలకొని చిరకాలం పాటు విజయవంతంగా నడిచిన లాభసాటి సంస్థలను అదే స్థాయిలో కొనసాగించవలసిన బాధ్యతను పూర్తిగా వదిలిపెట్టి వాటిని ప్రైవేటు రంగానికి అప్పగించాలని ఆత్రుత పడడం ప్రజా ప్రభుత్వాల లక్షణం ఎంత మాత్రం కాదు. ఎయిర్ ఇండియాకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. స్వాతంత్య్రం రాక పూర్వం 1932లో ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త జెఆర్‌డి టాటా ఈ సంస్థను టాటా ఎయిర్ లైన్స్ అనే పేరిట స్థాపించాడు. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం 1946 జులైలో ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. స్వాతంత్య్రానంతరం 1948లో ఈ సంస్థలోని 49 శాతం వాటాలను భారత ప్రభుత్వం కొనుగోలు చేసింది.

1953లో మెజారిటీ వాటాలు ప్రభుత్వపరం అయ్యాయి. 1977లో పూర్తిగా ప్రభుత్వరంగ సంస్థగా మారిపోయింది. అప్పుడు సంస్థకు ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ అని పేరు పెట్టారు. అంతర్జాతీయ విమానాలను ఎయిర్ ఇండియాకు అప్పజెప్పి దేశంలో విమానాలు నడపడానికి ఇండియన్ ఎయిర్ లైన్స్‌ను ఏర్పాటు చేశారు. స్వాగతం పలికే మీసాల మహారాజా చిహ్నంతో విశ్వ వ్యాప్త ఖ్యాతిని గడించిన ఎయిర్ ఇండియా 1960లో బోయింగ్ 707 విమానాన్ని కూడా కొనుగోలు చేసింది. ఆ విధంగా జెట్ విమానాలను నడిపిన తొలి ఆసియన్ ఎయిర్ లైన్‌గా ప్రసిద్ధికెక్కింది. 2007లో ఎయిర్ ఇండియాలో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేసినప్పటి నుంచి నష్టాల బాట పట్టింది. ఎయిర్ ఇండియాకు అనుబంధంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ అనే అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ మూడింటినీ కలిపి గంపగుత్తగా అమ్మేయడానికి తాజా ప్రతిపాదనలను ప్రభుత్వం రూపొందించింది.

ఈ సంస్థకు 9400 మంది శాశ్వత సిబ్బంది, 3600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులున్నారు. ఇంత సునాయాసమైన షరతుల మీద కూడా ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడం సులభతరం కాబోదని కొనేవారి మీద పడే రూ. 2300 కోట్ల రుణ భారం తక్కువేమీ కాదని సంస్థను తక్షణమే లాభాల్లో పెడితేగాని దానిని తీర్చడం సాధ్యం కాదని అది ఏ ప్రైవేటు సంస్థకూ అలవికాని పని అని నిపుణులు అంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో మరింత ప్రజాధనాన్ని కుమ్మరించి అయినా ఆ ప్రైవేటు సంస్థను ఆదుకోడానికి ఇప్పటి పాలకులు వెనుకాడకపోవచ్చు. గతంలో ఎన్నికలకు భయపడి ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించిందని ఇప్పడా భయం లేదని హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో ఎటువంటి సాహస చర్యలకైనా వెనుకాడదని ఎయిర్ ఇండియాకు కొత్త యజమానులు దొరికి తీరుతారని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వ్యక్తం చేస్తున్న ధీమా గమనించదగినది. తెగనమ్ముకోడానికి సిద్ధపడిన చోట ప్రజల ఆస్తులు కొనుక్కోడానికి ఎవరైనా ముందుకు వస్తారు. దేశం నడుస్తున్న బాట అటువంటిది.

 

Air India Sale in Low Rate by Modi Government
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News