Home కలం తెలంగాణ బతుకు చిత్రణ

తెలంగాణ బతుకు చిత్రణ

Book

 

మామిడి హరికృష్ణ ‘ఊరికి పోయిన యాళ్ల’

ఢిల్లీలో జరిగిన ‘నేషనల్ సింపోజియమ్ ఆఫ్ పోయెట్స్ 2020’కి ఎంపికైనందుకు గాను పురస్కారం అందుకుంటున్న మామిడి హరికృష్ణ (ఫైల్ ఫోటో)

మూడు దశాబ్దాలకు పైగా సాహిత్య రంగంలో తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరుచుకుని విభిన్న కోణాల్లో , విభిన్న భావజాల సమాహారంతో నిరంతరం కవితలు రాస్తున్నారు మామిడి హరికృష్ణ గారు. వీరి కవిత్వం నదీ ప్రవాహంలో చిన్నచిన్న పాయలు కలిసినట్టుగా అన్ని భావజాలాలు కలిసిపోయి ప్రవహిస్తూనే ఉంటుంది. నూతనంగా తెలుగు సాహిత్యంలో ‘ఫ్యూజన్ షాహిరి‘అనే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ యాస లోకూడా ఎన్నో కవితలు రాస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నారు . అలాగే ప్రపంచ కవిత పేరిట ప్రపంచంలోని ప్రముఖుల కవితలను తెలుగులో అనువదిస్తూ ప్రపంచ సాహిత్యాన్ని తెలుగువారికి అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా కవిత్వంలో వస్తున్న విభిన్న వాదాలను పరిచయం చేస్తున్నారు.

భారతీయ సినిమా మీదనే కాక వీరు, అంతర్జాతీయ సినిమా మీద కూడా పరిశోధనాత్మక వ్యాసాలు రాస్తున్న బహుముఖప్రతిభాశాలికూడా. ఉత్తమ సినిమా విమర్శకునిగా హరికృష్ణ గారు మూడు పర్యాయాలు నంది అవార్డు అందుకున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా కూడా, తెలంగాణ సంస్కృతిలో భాగమైన విభిన్న కళల్ని , సంస్కృతిని నిరంతరం విశ్వవ్యాప్తం చేస్తూ, తెలంగాణ అస్తిత్వానికి పూర్వవైభవాన్ని కలిగిస్తున్నారు. అంతేకాకుండా వీరు స్వయంగా కవియే కాకుండా విమర్శకుడు, అనువాదకుడు ్,ఆర్టిస్ట్, బహుభాషావేత్త,బహుముఖ వ్యాసకర్త. తెలంగాణ సంస్కృతి పట్ల విస్తృతమైన జ్ఞానం కలిగిన వారు.

ఆ జ్ఞానాన్ని విభిన్న కోణాల్లో విస్తృతంగా ప్రాచుర్యం కలిగించడం విశేషం. కవిత్వమంటే వీరికి ప్రాణం. పుట్టిన ఊరంటే ఇంకా ప్రాణం.అందుకేనేమో తాను పుట్టిన ఊరికి తన మనసులో ఎంతటి స్థానాన్ని కల్పించారో, ’ఊరికి పోయిన యాళ్ల’అనే శీర్షికతో వెలువడిన కవితా సంకలనమే నిదర్శనం. ఈ పుస్తకాన్ని 2018 సెప్టెంబర్ 20న కవి తన అమ్మ వర్ధంతి సందర్భంగా ఆ అమ్మకే అంకితమిస్తూ, తన తండ్రి చేతులమీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.. ఈ సంకలనంలోని ‘పండుగ‘ అనే కవితనే ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్ సింపోజియం ఆఫ్ పోయెట్స్- 2020‘ కి ఎంపిక కావడం గమనార్హం.

ఒక ఊరి చరిత్రను, ఆత్మీయుల అనుబంధాల తండ్లాటను మరియు ప్రతి మనిషికి పుట్టిన ఊరు మీద ఉండాల్సిన సోయిని తెలియజేసే కవితా సంకలనమే ఊరికి పోయిన యాళ్ల. జీవితంలో వృత్తిరీత్యా పుట్టిన ఊరికి దూరంగా మనుగడ సాగిస్తున్న మనిషి తన సొంత ఊరికి చాలా రోజుల తర్వాత వెళ్తున్నప్పుడు అతనిలో కలిగిన విభిన్న సంఘర్షణల అనుభూతులు, అనుభవాల జ్ఞాపకాలు మస్తిష్కంలో ఎన్నో మెదులుతాయి. అటువంటి భావజాల రూపానికి అక్షర రూపమే ఈ కవిత. కవి తన చిన్ననాటి స్మృతులను వర్తమాన కాలంలో గుర్తు చేసుకుంటూ తన మనసును తడిమిన గతంలోపలి ఊరి సమూహం అంతరంగాన్ని తాకుతూ, వారితో తనకున్న అనుబంధాన్ని జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తెలంగాణ యాస లో తాను పుట్టిన ఊరి మట్టి పరిమళాన్ని పాఠకులకు అందించేలా రాయడం జరిగింది.

ఇందులో అనుబంధాలను ప్రేమించే మనసు తన ఆత్మీయుల్ని కలుసుకునే సందర్భంలో ఎటువంటి భావావేశానికి లోనవుతారో అటువంటి సంఘర్షణను కవి తన ప్రతిభతో చక్కగా చిత్రించారు. పుట్టిన ఊరంటే ఒక ఆత్మీయ బంధం, ఒక మనిషి నిత్య జీవితంలో మనుగడ సాగించడానికి కావలసిన మనోధైర్యాన్ని, అవసరమైన జ్ఞానాన్ని అందించడంతో పాటు సామూహిక జీవనాన్ని నేర్పుతుంది.ఆ ధైర్యమే వివేకంతో కూడిన విజ్ఞానాన్ని ,సమయస్ఫూర్తిని కలిగిస్తుంది.అందుకే కవి తనని ఉన్నత శిఖరాలను అందుకునేలా చేసి,సమాజం గౌరవించేలా చేసిన ఊరిని యాది చేసుకుంటూ రాసిన అక్షరాలు, ప్రతి మనిషిని స్పందించేలా చేస్తుంది.

కవి ఊరులోని కులవృత్తులను స్పృశిస్తూ మంగలి ,తమ్మల ,బోయ , మేరా ,ఔసలి , శాల, కంచరి ,సుంకరి, గొల్ల ,కుమ్మరి, తెనుగు, కాపు ఫకీర్ ,బాలసంతు, పంబల, కూనపులి , ముత్త రాసి ,గౌండ్ల,పూసబెర్ల. ఈ రకంగా ఆయా కులాలను గుర్తు చేసుకుంటూ, వారి వృత్తి ధర్మాన్ని సూచిస్తూ , తన మనసు పొరల్లో వారితో తనకున్న అనుభూతిని తెలుపుతూనే అంతరించిపోయిన కుల వృత్తుల పట్ల ఆవేదన వ్యక్తం చేయడం కనిపిస్తుంది. తెలంగాణ గొలుసుకట్టు చెరువుల కు ప్రత్యేకం. అటువంటి చెరువులు కలిగిన ఊరు శాయంపేట.

ఆ ఊరు చెరువులన్నిటిిని గుర్తుచేసుకుంటూ ఆధునిక కట్టడాల తో అంతరించిపోయిన కుంటలపట్ల ఆవేదన వ్యక్తం చేయడం కూడా చూడవచ్చు. అలాగే గుడిసె రామస్వామి టాంగాను, తురక రబ్బానీ ఆటోని, వారితో తనకున్న జ్ఞాపకాన్ని నెమరు వేసుకోవడం కనిపిస్తుంది .ఊరికి పోవడం అంటే ఊరికే పోవడం కాదని, కొత్త ఊపిరి కోసం ,ఆ ఊపిరి జీవితంలో గతి తప్పకుండా ఉండడం కోసం పోవడమని, నగరంలోని యాంత్రిక జీవితాన్ని నదితో పోలుస్తూ ఆ నదిలోని తెప్ప దారి తప్పకుండా చూడడం కోసం పోవడమని, సమాజంలోని ఒత్తిడిని జయించి మనసుకు స్వాంతన కలిగించే ప్రయత్నమే ఊరికి పోవడమని వ్యక్తపరచడం విశేషం.

చినిగిన నెక్కరు లోని బాల్యం,గడీల బడి సూరు నుంచి దిగిన సూర్యుడు, పెద్దబడి బాదం చెట్టు నుండి రాలిన తరగతి పాఠాలు, మోదుగు చెట్టు ముదురు మట్టి ఎండుటాకుల నుంచి ఎండాకాలం సెలవుల వీరత్వం చూడటమే ఊరికి పోవడమంటాడు కవి. ఒకప్పుడు ఊరిలో ఖచ్చురాల బండ్లు ,ఎడ్ల బండ్లు, నాగళ్లు,మగ్గం గుంటలు, పెంకుటిల్లు కనిపించేవని, ఇప్పుడన్నీ కాలానుగుణంగా మారిపోయాయని, బతుకుదెరువు కోసం భీమండి సూరత్ వెళ్ళిన ఆత్మీయులు అమెరికా ఆస్ట్రేలియా దారి పట్టారని, ఇదంతా దశావతారంలో తొలి అవతారం గుడి ఊరిలో ఉండటమే అంటూ, కవి తన ప్రతిభతో ఆధ్యాత్మికంగా ఊరి పరిణామక్రమాన్ని చూపినాడు.

మా ఊరు శాయంపేట ,ఎన్నిసార్లు తలుచుకున్న తరగని ఊట, దూప అయినప్పుడల్లా నేను ఎనుకులాడే చెలిమె, దిక్కుతోచనప్పుడల్లా నాలో సూర్యుని రాజేసే కొలిమి ,ఆకలి అయినప్పుడల్లా ముడి విప్పే జ్ఞాపకాల సద్ది మూట,అగులు బుగులు అయినప్పుడల్లా నాకు దారి చూపే బోధి వృక్షం. అంటూ తన అంతరంగంలోని మనసుకు చెప్పుకుంటూ వాపోతాడు కవి. దీనిని బట్టి కన్నతల్లి తన పొత్తిళ్లలో శిశువును దాచుకున్నట్టు పుట్టిన ఊరు కూడా ఆత్మీయంగా దాచుకుంటుందని తెలుస్తున్నది. అలాగే మానసికంగా మనసుకు ఒత్తిడి కలిగించే అంశాల నుండి విముక్తి పొందడానికి చిన్నప్పటి సోపతిగాళ్ల జ్ఞాపకాలు ఒత్తిడిని తొలగించి మానసిక ఆనందాన్ని కలిగిస్తాయని కవి వర్ణించిన విధానంలో కనిపిస్తుంది.

ఇదంతా ఒక ఎత్తయితే ఈ కవితా సంకలనంలో ‘పండుగ ‘శీర్షికతో తెలంగాణ భాషలో వ్రాయబడిన కవిత హరికృష్ణ గారిని జాతీయ కవి గా ఆవిష్కరింప చేసింది . ఇందులో తమ తండ్రి కళ్లల్లో పెట్టుకొని పెంచిన పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయాక ఏదైనా పండుగకి తిరిగి వస్తారని , కన్నబిడ్డల కోసం ఒంటరిగా ఎదురు చూసే తండ్రి ఆవేదన కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తుంది. పండుగకి వచ్చి వెళ్ళిపోయిన పిల్లల్ని తలుచుకొని దిగాలున కూలబడ్డ తండ్రి మనో వేదన అంతా ఇంతా కాదు.ఈ రకంగా తెలంగాణ బతుకు చిత్రం లోని సంఘటనని తనస్వీయ అనుభవంతో చిత్రించినాడు.ఒక తండ్రి తన పిల్లల కోసం పడే తండ్లాటను కవి పాఠకుని హృదయానికి హత్తుకుపోయినట్లు చూపించినాడు.

భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత భాషల మధ్య వైరుధ్యాలు లేకుండా సమన్వయం కలిగించేలా కవితలు అనువాదాలు జరగాలని 1956 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం దేశంలోని 22 భాషల్లోని ఒక్కొక్క భాష కు చెందిన ఉత్తమ కవితను ఆల్ ఇండియా రేడియో ద్వారా ఎంపిక చేసి ఈ బృహత్తర సాహితీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది కేంద్ర ప్రభుత్వ ప్రసారభారతి. ఈ ‘ నేషనల్ సింపోజియం ఆఫ్ పోయెట్స్ -2020‘కి ఎంపికైన కవితలను దేశంలోని 22 భాషల్లోకి అనువదించి ,జనవరి 25న రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఈ కవితలన్నింటిని రాత్రి 10 గంటల సమయంలో ఆల్ ఇండియా రేడియో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్రాల్లో ప్రసారం చేస్తుంది.

ఒక ప్రాంతానికి పరిమితమైన కవి యొక్క భావజాల సంఘర్షణ దేశంలోని 22 భాషల్లోకి అనువదించి , ఆ ప్రాంత అస్తిత్వాన్ని ఆవిష్కరింప చేయడం ఆ కవియొక్క గొప్పదనమే అవుతుంది. మొదటిసారిగా తెలంగాణ భాష లో రాయబడిన కవిత కి ఈ ఘనత దక్కడం, అంతే కాకుండా అతి పిన్న వయసులోనే దక్కడం తెలంగాణ సాహితీలోకం మామిడి హరికృష్ణ గారికి అక్షర నీరాజనాలు అందిస్తున్నది. ప్రతి మనిషికి సహజంగా, తాను పుట్టిన ఊరి పట్ల కలిగే స్పందనని , కవి తన స్వీయ అనుభవంతో కవితారూపంలో చిత్రించి ప్రతి మనిషిని, సమాజాన్ని ఆలోచించేలా చేయడం కవి గొప్పదనమే.

అంతేకాకుండా వారి వారి బాల్య స్మృతులను గుర్తు చేసుకొని తమ అస్తిత్వపు మూలాల్ని వెతుక్కునేలా చేయడం,కవి తన కవిత ద్వారా విజయం సాధించినట్టే అవుతుంది. ఈ కవితా సంకలనంలో తెలంగాణ పల్లె సౌందర్యం, ఆత్మీయ అనుబంధాలు ,విభిన్న వృత్తులు ,భౌగోళిక అంశాలు మరియు విభిన్న సంఘటనలను కవి నిక్షిప్తం చేయడం జరిగింది. అందుకే ఈ కవితకి, జాతీయ స్థాయిలో కవికి పురస్కారాన్ని అందించింది .కవి మామిడి హరికృష్ణ గారు తెలంగాణ భాష లో తెలంగాణ బతుకు చిత్రాన్ని లిఖించి జాతీయ కవి గా గుర్తించబడటం గొప్ప విశేషం. ఇదే కోవలో కవి తెలంగాణ సోయితో మరి కొన్ని కవితా సంకలనాలు వెలువరించాలని సాహితీలోకం కోరుకుంటున్నది.

(మొదటిసారి తెలంగాణ భాషలో రాయబడిన మామిడి హరికృష్ణగారి కవిత ‘నేషనల్ సింపోజియం ఆఫ్ పోయెట్స్ -20 20’ క ఎంపికైన సందర్భంగా రాసిన వ్యాసం.ఈనెల 27,28న ఢిల్లీలో జరిగినది)

AIR organises National Symposium of Poets 2020