Home తాజా వార్తలు స్వచ్ఛమైన గాలికి దూరం

స్వచ్ఛమైన గాలికి దూరం

air-pollution40 రకాల ఉద్గారాలు నిత్యం గాలిలోకి విడుదల,  ఎక్కువ అవుతున్న అతి సూకా్ష్మతి సూక్ష్మ ధూళికణాలు,  పర్యావరణ నిపుణులతో చర్చిస్తున్న సిపిసిబి

హైదరాబాద్: రోజురోజుకు వాయుకాలుష్యం పెరుగుతోంది. తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు శివారు జిల్లాల్లో పిఎం 10 తో పిఎం 2.5 తీవ్రతలు ఎక్కువ అవుతున్నాయని సిపిసిబి గణాంకాల్లో వెల్లడయ్యింది. దీనివలన మనం పీల్చుకునే గాలిని ఉద్గారాలు కలుషితం చేయడమే కాదు ఆరోగ్యంపైన తీవ్ర దుష్ప్రభావాలు చూపుతున్నాయి. దాదాపు 40 రకాల ఉద్గారాలు నిత్యం గాలిలో విడుదలవుతున్నాయి. వీటి లో ఓజోన్, నైట్రోస్ ఆక్సైడ్‌ల వలన పిఎం 10, పిఎం 2.5లు అధిక ప్రభావం చూపి స్వచ్ఛమైన గాలిని దూరం చేస్తున్నాయి. సూక్ష్మపు ధూళికణాలతో కూడిన పిఎం 2.5 కంటికి కనిపించవు, వెంట్రుక కంటే సన్నగా ఉంటా యి. ఈ గాలిని పీల్చినప్పుడు ఈ ధూళికణాలన్నీ నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరిపోతాయి. రక్తంలో కలిసిపోయి శ్వాసకోశ, గుండెజబ్బులకు దారి తీస్తుంటాయి.

పిఎం 2.5 తీవ్రత మరింతగా పెరుగుతోందని, అతి సూకా్ష్మతి సూక్ష్మ ధూళికణాలు బెడద ఎక్కువ అవుతుందని, వాటికి పిఎం 1గా నామకరణం చేయాలని కేంద్ర కాలు ష్య నియంత్రణ మండలి (సిపిసిబి) సైతం భావిస్తోందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. దీనిపై రాష్ట్రాల వారీగా మండళ్లు, నిపుణుల సలహాలను తీసుకుంటోందని నిపుణులు తెలిపారు.

రోడ్డుపై దుమ్ముతో వచ్చే ఉద్గారాలు 10 నుంచి 100 మైక్రాన్లు

కాలుష్య తీవ్రత ఉన్న నగరాలను, పట్టణాలను నియంత్రణ మండళ్లు ఎప్పటికప్పుడు గమనిస్తుంటాయి. ఆయా ప్రాంతాల్లోని రాష్ట్రాల్లోని మండళ్లు కలిసి కాలుష్య స్థితిగతుల తీవ్రతను లెక్కిస్తుంటాయి. నమోదయ్యే వివరాల ఆధారంగా కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతుంటాయి. ఇటీవల కొంతకాలంగా అతిసూక్ష్మ ధూళికణాలు (పిఎం 2.5) విజృంభిస్తున్నాయి. ఘనపు మీటరు గాలిలో ఇవి 24 గంటల సగటుకు 60 మైక్రోగ్రాములు, వార్షిక సగటు 40 మైక్రోగ్రాములకు మించకూడదు. కానీ అది 70 నుంచి 80 ఎంజీల వరకు వెళుతోంది.

తీవ్రత మరీ పెరగడంతో పిఎం1 ప్రమాణాన్ని తీసుకురావాలని భావించి పర్యావరణ శాస్త్రవేత్తలతో సిపిసిబి చర్చిస్తున్నట్టు తెలిసింది. గతంలో 0 నుంచి 100 మైక్రాన్ల వర కు లెక్కించేవారు. రోడ్డుపై దుమ్ము కారణంగా వచ్చే ఉద్గారాలు 10 నుంచి 100 మైక్రాన్ల దాకా ఉంటాయి. వీటితో పెద్దగా నష్టం ఉండదు. 0 నుంచి 10 మైక్రాన్ల ప్రమాణం వాహనాలు, పరిశ్రమలు వ్యర్థాలు, చెత్త, ఇతరత్రా వస్తువులను కాల్చడం వల్ల వస్తుంటుంది. మరి 0 నుంచి 10లో పిఎం 2.5 ఉండేవి, అవి ఇంకా సన్నగా ఉంటాయి. ఇవే పిఎం 2.5 ఉద్గారాలు ఇప్పుడు 0 నుంచి 1 మైక్రాన్లను సంబంధించి పిఎం 1గా తీసుకు వచ్చేందుకు సిపిసిబి చర్చిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.

అన్ని చోట్లా 60 ఎంజీలు దాటింది

అమెరికా ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో కాలుష్య ఉద్గారాలకు సంబంధించి పిఎం1గా లెక్కిస్తున్నారు. సూకా్ష్మతి సూక్ష్మ ధూళికణాలు నమోదయ్యే ప్రాంతా ల్లో అందుకు అనుగుణంగా నివారణ చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట, జూపార్కు, బాలానగర్‌తో పాటు పాత సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, పాశమైలారం, ఇక్రిశాట్, నల్లగొండ ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత విపరీతంగా ఉంటోంది. వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే ఉద్గారాల కారణంగా సూక్ష్మ, అతిసూక్ష్మ ధూళికణాలు పెరుగుతున్నాయి. ఈ స్థితిని అరికట్టాల్సి ఉంది.

స్వచ్ఛమైన గాలిని దూరం చేసి పలురకాల అనారోగ్య సమస్యలను కారణమయ్యే పిఎం 10 గతేడాది నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఒక్కచోట కూడా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) నిర్ధేశిత పరిమితుల కంటే తక్కువగా నమోదు కాలేదు. అన్ని చోట్లా 60 ఎంజీలు (మైక్రోగ్రాములు) దాటింది. బాలానగర్, జీడిమెట్ల వద్ద 133 ఎంజీలుగా నమోదయ్యింది. ఉప్పల్, జూబ్లీహిల్స్, ప్యారడైజ్, చార్మినార్, లంగర్‌హౌస్. కూకట్‌పల్లి, ఆబిడ్స్, జూపార్కు తదితర ప్రాంతాల్లో 100 ఎంజీల కంటే ఎక్కువగా ఉంటోంది. ట్యాంక్‌బండ్, శామీర్‌పేట్, రాజేంద్రనగర్, హెచ్‌సీయూ, కెబిఆర్ పార్కు దగ్గర పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే మారితే ఢిల్లీ పరిస్థితి రావడం ఖాయమని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.

Air Pollution is Increasing in Telangana