Home తాజా వార్తలు తుది అంకానికి చేరిన ఎయిర్‌మెన్ ఉద్యోగాల ఎంపిక

తుది అంకానికి చేరిన ఎయిర్‌మెన్ ఉద్యోగాల ఎంపిక

airmen-jobs airmen-jobs.jpg1

మెదక్: ఎయిర్‌మెన్ రిక్రూట్ మెంట్ ర్యాలీ తుది అంకానికి చేరింది. శనివారం తెలంగాణాలోని మిగిలిన ఐదు జిల్లాలకు చెందిన అభ్యర్థులువచ్చారు. నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల వారికి ఎయిర్‌మెన్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను శనివారం ప్రారంభించారు. దీంతో మూడు రోజుల క్రితం గురువారం కరీంనగర్, నిజాబాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్ జిల్లాల వారికి ఎంపిక నిర్వహించగా 80 మంది ఎంపికయ్యారు. మిగిలిన ఐదు జిల్లాల నుంచి ఎంత మంది ఎంపికవుతారనేది ఆదివారం తెలుస్తుంది. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా రాష్ట్రం మొత్తానికి కలిపి సంగారెడ్డిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఎయిర్‌ఫోర్స్ ఆధ్వర్యంలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. మొదటి రెండు రోజులు బోధనకు సంబంధించిన ఉద్యోగాలకు ఎంపిక జరిగింది. ఇక గురువారం ఎయిర్‌మెన్ ఉద్యోగాల కోసం ఎంపిక ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులు తొలి రోజుల్లో తీవ్ర ఇబ్బందులకు గురై అసహనంగా వెనుదిరిడంతో జిల్లా యంత్రాంగం, ఎయిర్ ఫోర్సు అధికారులు కొన్ని ఏర్పాట్లు చేశారు. సుమారుగా 3500 మంది శనివారం ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి వచ్చారు. వీరి సర్టిఫికెట్లు, ఇతర పరిశీలన తర్వాత 2266 మందిని లోనికి అనుమతించారు. వీరిలో 1457 మందిని రాత పరీక్షకు అనుమతించారు. వీరి నుంచి పరుగు పందానికి ఎంపిక చేసి, దానిలో ఉత్తీర్ణులైన వారికి ఎయిర్‌మెన్ ఉద్యోగాలు ఇస్తారు. అభ్యర్దులకు రెడ్‌క్రాస్ వారు పండ్లు, బ్రెడ్ సరఫరా చేశారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి రజినీప్రియ, డిఎస్‌డిఓ హరనాథ్, సమాచార శాఖ ఎడి శ్రీనివాస్, తహసిల్దార్ గోవర్దన్ తదితరులు పరేడ్ గ్రౌండ్‌లోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.