Home ఆదిలాబాద్ హక్కుల సాధనే మహాసభల లక్ష్యం

హక్కుల సాధనే మహాసభల లక్ష్యం

B-Vijaya-Lakshmiప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఐక్య పోరాటాలతో తిప్పికొడుతాం
ముగిసిన ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర తొలిమహాసభలు
మూడో రోజు సభలో పలు తీర్మానాలకు ఆమోదం

మనతెలంగాణ/మంచిర్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విదానాలను ప్రతిఘటిస్తూ వారి హక్కులను కాపాడడమే ఎఐటియుసి మహాసభల లక్ష్యమని, ఎఐటియుసి జాతీయ కార్యదర్శి బి. విజయలక్ష్మి అన్నారు. మంచిర్యాల మండలం శ్రీ రాంపూర్‌లో రాజ్‌బహుదూర్‌గౌర్ మైదానంలో కొనసాగిన మూడు రోజుల మహాసభలు మంగళవారంతో ముగిసాయి. మూడో రోజున మంగళవారం తెలంగాణలోని పది జిల్లాల నుండి తరలివచ్చిన ఎఐటియుసి, అనుబంధ సంఘాల ప్రతినిధులు పలు తీర్మాణాలు ప్రవేశపెట్టగా హజరైన సభ్యులు, నాయకులు వాటిని ఆమోదించారు. సింగరేణి అభివృద్ధికై చర్యలు చేపడుతూ భూగర్భ గనుల విస్తరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రామలు చేపట్టాలన్నారు. సింగరేణి వ్యాప్తంగా చనిపోయిన 3500 మంది కార్మికుల వారసులు, మెడికల్ అన్‌ఫిట్, కార్మిక వారసులు ఎన్నోఏళ్లుగా ఎదురు చూస్తున్న వారసత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, సింగరేణి కార్మికులకు వైద్య లాంటి మౌళిక సౌకర్యాలను కల్పించాలన్నారు.

ఓపెన్‌కాస్టుల  విస్తరణ కోసం భూములు కోల్పొయిన వారు కొత్త రాష్ట్రంలోనైనా కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలోనైనా తమ సమస్యలు తీరుతాయని భావించారని, వారి ఆశలకు అనుగుణంగా సింగరేణి విస్తర్ణపై దృష్టి సారించి, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తూ, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని మహాసభ తీర్మాణించింది. ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నా స్వదేశి, విదేశి కార్పొరేట్లకు ప్రభుత్వ రంగ సంస్థలను ధారదత్తం చేసేందుకు మోదీ సర్కారు కంకనం కట్టుకుందని, గతంలో యుపిఏ ఇలాంటి ప్రయత్నాలు చేసినా పో రాటాలతో ప్రతిఘటించామని, మరోమారు మోదీ సర్కారు విధానాలపై అలాంటి ఉద్యమాలకే సిద్ధం కావాలని, మహాసభ తీర్మాణించింది.

కాంట్రాక్టు,అవుట్‌సోర్సింగ్ ఉద్యోగు లకు ఎన్నికల సమయంలో కేసిఆర్ ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగులను క్రమబద్ధీకరించి, రెగ్యులరైజేషన్ చేయా లని, అప్పటి వరకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇతర చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, గ్రామపం చాయతీ గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల సిబ్బంది, పశుసంవర్థక శాఖ ఇలాంటి శాఖల్లో పని చేస్తున్న సుమారు 1.20 లక్షల మందికి ఎన్నో రోజులుగా కోరుతున్న జీవో నెం.03 ప్రకారం వేతనాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, హెల్త్ డిపార్టుమెంట్ దార్డుపార్టీ కాంట్రాక్టు వర్కర్స్, 104,108, ఆరోగ్య మిత్రలు, ఆర్‌డబ్య్లుఎస్, మార్కెట్ యార్డులు, మీ-సేవా, దేవాదాయశాఖ లాంటి ప్రభుత్వ పథకాలలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందించే సౌకర్యం కల్పించాలని తీర్మాణించారు. రేయాన్, ఆదిలాబాద్ జిల్లాలోని సిసిఐ, సిర్పూర్ పేపర్ మిల్ లాంటి మూత బడిన ప్రభుత్వ రంగ సంస్థలకు స్పెషల్ ప్యాకేజీ కింద ఆర్థిక సాయం అందించి, నూతన టెక్నాలజీతో పునర్‌ప్రారంభించేలా చర్యలు తీసుకో వాలని, ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో ఆర్‌టిసికి చెల్లించాల్సిన రాయితీల మొత్తాన్ని కేటాయించాలని, రీయంబర్స్‌మెంట్‌ను మూడు నెలలకు కాకుండా నెలకొక్కసారి చెల్లించేలా నూతన బస్సులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి, ఆధుకోవాలని మహాసభ తీర్మాణించింది.

రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పని చేస్తున్న లక్షలాది మంది కార్మికులైనా ఆటో, హమాలీ, ట్రాన్స్‌పోర్టు రంగాలలోని కార్మికుల కోసం సంక్షేమం బోర్డు ఏర్పాటు చేసి, పె న్షన్, ప్రమాదబీమా ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉపాధి హామీ చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ నిరుపేద కుటుంబాలకు 200 రోజుల పనిదినాలను కల్పిస్తూ రోజుకు రూ. 250 వేతనంగా అందించాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి హెచ్‌ఆర్ పాలసీని వర్తింపజేయాలని, మేట్లకు కనీస వేతనాలు అమలు చేయాలని,యాత్రీకరణను నిషేదించి, అవినీతిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, మహాసభ తీర్మాణించింది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేయాలని,రాష్ట్రంలోని సహజ వనరులను పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని, బీమా, రైల్వే, రక్షణ రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వ్యతిరేకించాలని,మార్కెట్ యార్డులలో పని చేస్తే హమాలీల సమస్యలపై స్పందించాలని, వ్యవసాయ మార్కెట్లకు 15 కిలోమీటర్ల పరిధిలో మార్కెట్ యార్డు చట్టం ప్రకారం.. కాంటాలను క్రయవిక్రయాలను నిషేధించాలని, తెలంగాణలోని పది జిల్లాలో లేబర్ కోర్టులను విధిగా ఏర్పాటు చేయాలని, ఆకోర్టుల్లో సిబ్బందిని నియమించి, కార్మికుల కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని మహాసభ తీర్మాణించింది.

జిల్లాలోని కార్మిక కార్యాలయాలలో ఖాళీగా పోస్టులను భర్తీ చేసి, ట్రేడ్‌యూనిన్ల రిజిస్ట్రేషన్లు 15 రోజులోపు చేయాలని, సాధ్యమంత వరకు త్వరగా కార్మికుల గ్రాట్యూటీ, బోనస్, ప్రమాద నష్టపరిహారాల చట్టాల కింద నమోదు అవుతున్న కేసులను 90 రోజుల్లోగా పరిష్కరించాలని, కార్మిక చట్టాల్లో సవరణలను ప్రతిఘటించేందుకు ఉద్యమాలు చేపట్టాలని తీర్మాణించింది. అంగన్‌వాడీ, ఆశా, మున్సిపల్, మధ్యాహ్న భోజనం పథకం, ఈజిఎస్, గ్రామపంచాయతీ కార్మిక సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని మహాసభ తీర్మాణించింది.

అన్ని వర్గాలతో కలిసి ఐక్య పోరాటాలు
కార్మికుల సమస్యలను సాధించే దిశగా చేపట్టే ఉద్యమాల్లో అన్ని వర్గాలతో కలసి ఐక్య పోరాటాలతో ఉందుకు సాగుతామని ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహన్ అన్నారు. ఒకవైపు కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమాలు చేస్తుంటే స్పందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ జులుంతో వారిని అణచివేసేందుకు ఆహంకార పూరిత చర్యలు చేపడుతున్నారన్నారు.ఉద్యమాలతో ఇలాంటి ప్రభుత్వాలకు బుద్ది చెప్పుతామన్నారు.

కేసిఆర్ మాటలు నీటి మూటలు
ఎన్నిక ప్రచారంలో భాగంగా కేసిఆర్ ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారాయని, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్ అన్నారు. ఆ హామీలు నెరవేర్చాలని కార్మికులు ఉద్యమాల బాట పడుతుంటే వారి ధయనీయమైనస్థితి చూసి, వారికి సంఘీభావంగా, మద్దతుగా వామపక్షాలు ఉద్యమాలు చేపడితే కేసిఆర్ వాటి విషయంలో అవహేలనగా మాట్లాడడం ఆయన ధురంహంకారానికి నిదర్శనమన్నారు. భవిష్యత్‌లో దీనికి ఆయన మూల్యం చెల్లించకతప్పదన్నారు.

రైతు ఆత్మహత్యలపై ఆందోళన
రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలవుతుందని, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో వరుస నష్టాల కష్టాలను భరించలేక రైతులు బలణ్మారణాలకు పాల్పడుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మాజీశాసన సభ్యుడు గుండా మల్లేష్ అన్నారు. సమస్యలపై గలమెత్తిన ప్రతిపక్షాలను సస్ఫెన్షన్లతో బెదరగొట్టడం కేసిఆర్‌కే చెల్లిందన్నారు. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కేసిఆర్‌కు రాబోయే కాలంలో ప్రజలు గుణపాటం చెప్పుతారన్నారు.

భూగర్భ గనులను విస్తరించాలి
తెలంగాణ వ్యాప్తంగా నాలుగు జిల్లాలల్లో విస్తరించి ఉన్న బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు భూగర్భ బొగ్గు గనులు విస్తరించాలని ఎఐటియుసి కార్యవర్గ సభ్యులు, సింగరేణి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మరణించిన, మెడికల్ అన్‌ఫిట్ కార్మికుల వారసులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారసత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలన్నారు. ఈసమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించకుంటే కార్మికులతో కలసి ఐక్య పో రాటాలకు కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఈమహాసభల్లో ఎఐటియుసి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ప్రేమపావని, ఎస్‌సిడబ్య్లు అధ్యక్షుడు గట్టయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేణ శంకర్, ఎఐటియుసి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. విలాస్, మంద మల్లారెడ్డి, మంచిర్యాల సిపిఐ నియోజకవర్గం ఇంఛార్జీ కలవేణ కుమారస్వామి, ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు ఖలీందర్ అలీఖాన్, నాయకులు బానుదాస్, నగేష్ వివిశాస్త్రీ, వీరభద్రయ్య,షఫీ దేవిపోచం, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరక మహేందర్, పది జిల్లాల ఎఐటియుసి, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.