Friday, April 19, 2024

కిడ్నాప్ కేసు.. ముగిసిన అఖిలప్రియ కస్టడి

- Advertisement -
- Advertisement -

ముగిసిన అఖిలప్రియ కస్టడి
మూడు రోజుల్లో 300 ప్రశ్నలు
కీలక ప్రశ్నలకు మౌనంగా నిందితురాలు
బెంగళూరులో కిడ్నాప్ పథకం..మధ్యవర్తిత్వం బెడిసికొట్టడంతో అపహరణకు ప్లాన్


మనతెలంగాణ/హైదరాబాద్: బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు, మాజీ మంత్రి అఖిలప్రియకు పోలీసు కస్టడీ బుధవారం నాటికి ముగిసింది. ఈక్రమంలో అఖిలప్రియను గురువారం మధ్నాహ్నం తిరిగి చంచల్‌గూడా జైలుకు తరలించనున్నారు. కాగా మూడు రోజులు పాటు అఖిలప్రియను పోలీసులు 300 ప్రశ్నలు అడిగారు. కాగా కీలక ప్రశ్నలకు ఆమె మౌనం పాటించారు. అయినప్పటికీ పోలీసులు అఖిలప్రియ నుంచి కీలక విషయాలను రాబట్టారు. కిడ్నాప్ సమయంలో ప్రవీణ్‌రావు నివాసం దగ్గర తన భర్త భార్గవ్‌రామ్ రెక్కీ నిర్వహించినట్లు అఖిలప్రియ అంగీకరించింది. ఈక్రమంలో ప్రవీణ్‌రావుతో పాటు ఆయన ఇద్దరు సోదరులను కిడ్నాప్ చేసిముగ్గురిని భార్గవ్ ఫామ్‌హౌస్‌లో బంధించి వారి నుంచి డాక్యుమెంట్స్‌పై సంతకాలు సేకరించినట్లు విచారణలో వెల్లడైంది. ఇదిలావుండగా ఈ కేసులో ప్రధాన నిందితులు భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

వీరితో పాటు మొత్తం 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. కిడ్నాప్‌లో జగత్‌విఖ్యాత్‌కు ప్రమేయం ఉన్నట్లు అఖిలప్రియ వెల్లడించినట్లు సమాచారం. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌తో పాటు అతడు కూడా బాధితుడు ప్రవీణ్‌రావు ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఐటి అధికారులమంటూ వారిని బెదిరించినట్లు సమాచారం. వీరిద్దరు స్పాట్‌లో ఉండగా లోథా అపార్ట్‌మెంట్‌లో ఉన్న అఖిలప్రియ ఫోన్ చేసి మాట్లాడినట్లు విచారణలో తేలింది. బాధితుల కిడ్నాప్ తర్వాత భార్గవ్, జగత్‌విఖ్యాత్ ఒకే వాహనంలో వెళ్లినట్లు కూడా విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగత్ విఖ్యాత్‌ను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చనున్నట్లు తెలుస్తోంది.
బెంగళూరులో మంతనాలు: బోయినపల్లి కిడ్నాప్ కేసుకు కారణమైన హఫీజ్‌పేట్ భూవివాదానికి సంబంధించి భూమా కుటుంబీకులు, ప్రవీణ్ కుటుంబీకులు గతంలో బెంగళూరులో పలుమార్లు మంతనాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ ఘటనకు కొన్ని రోజుల ముందు కూడా మీటింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ భేటీల్లో తెలంగాణకు చెందిన ఇద్దరు ప్రముఖుల సమక్షంలో రాజీకి ప్రయత్నాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వారెవరు? ఏయే అంశాలపై చర్చించారు? అనే కోణాలపై దృష్టిసారించారు. చర్చలు విఫలమవ్వడంతోనే కిడ్నాప్ జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
మొత్తం 19 మంది నిందితులు ః
బోయిన్‌పల్లి కేసులో ఎ1 అఖిలప్రియ ఇప్పటికే అరెస్ట్ కాగా ఎ2 సుబ్బారెడ్డిని విచారించి సిఆర్‌పిసి నోటీసులు ఇచ్చి వదిలేశారు. అయితే ఈ కేసులో మొత్తం 19 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కాగా డిసిపికి ఫోన్‌కాల్ వచ్చిన నంబరు మల్లికార్జున్‌రెడ్డి అనే వ్యక్తి పేరిట ఉన్నట్లు గుర్తించారు. ఎపిలోని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన మల్లికార్జున్ మియాపూర్‌లో ఉంటూ.. అఖిలప్రియ భర్త భార్గవరామ్ వద్ద పిఎగా పనిచేస్తున్నట్లు నిర్ధారించి, అరెస్టు చేశారు. అతడితోపాటు అనంతపురం జిల్లా ఆళ్లగడ్డకు చెందిన బోయ సంపత్‌కుమార్, కడప జిల్లా బ్రహ్మంగారి మఠం ప్రాంతానికి చెందిన డ్రైవర్ దొర్లు బాలచెన్నయ్యకు కూడా ఫోన్‌కాల్స్ వెళ్లడంతో వారిద్దరినీ అరెస్టు చేశారు. తదుపరి విచారణలో వారు కిడ్నాప్ స్కెచ్, అపహరణ పథకం అమలు దాకా జరిగిన పరిణామాలను పోలీసులకు వివరించారు.
సాంకేతిక ఆధారాలు సేకరించాంః సిపి
బోయిన్‌పల్లి అపహరణ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని, అపహరణ కేసులో సాంకేతిక ఆధారాలు ఇప్పటికే సేకరించినట్లు అంజనీకుమార్ వెల్లడించారు. కేసులోని మిగిలిన నిందితులందరినీ ఒకట్రెండు రోజుల్లో పట్టుకుంటామన్నారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న ప్రధాన నిందితురాలు మాజీ మంత్రి అఖిలప్రియను సీనియర్ అధికారులు విచారిస్తున్నారని ఆయన చెప్పారు. గురువారం మధ్యాహ్నంతో అఖిలప్రియ కస్టడీ ముగుస్తుందని, ఈక్రమంలో అఖిలప్రియను తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలిస్తామని వివరించారు. ఈ కేసులో నిందితులు చెప్పిన అంశాలను క్రోడీకరించి కోర్టుకు సమ్పర్పిస్తామని చెప్పారు.
ఈ కేసులో గోవా, విజయవాడ, గుంటూరులో మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారని, నిందితులను పూర్తిస్థాయిలో విచారిస్తామన్నారు. అపహరణకు సంబంధించి వీరంతా గ్యాంగ్ చిత్రం చూసి ఏ విధంగా ఐటీ అధికారులుగా నటించారు..? బెదిరింపులకు గురిచేసి మరీ ఎలా బాధితులను కిడ్నాప్ చేశారు..? వంటి అంశాలపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు సిపి తెలిపారు.

Akhila Priya custody ended in Kidnap Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News