Thursday, April 25, 2024

ప్రయోగాత్మక చిత్రాలతో దూసుకెళ్తున్న కింగ్

- Advertisement -
- Advertisement -

Akkineni Nagarjuna 61st birthday special

సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున శనివారం తన 61వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. నాగార్జున బర్త్‌డే సందడితో సోషల్ మీడియా మారుమోగిపోతోంది. ఈ నేపథ్యంలో అభిమానులు తమ ఫేవరేట్ హీరో గురించి ముచ్చటించుకుంటున్నారు. ఇదిలాఉండగా సీనియర్ స్టార్ నాగార్జున కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆయన చేయని జోనర్ లేదు. మాస్, క్లాస్, డివోషనల్, రొమాన్స్, యాక్షన్, సోషల్, ఫాంటసీ, కామెడీ, థ్రిల్లర్.. వీటిలో నాగ్ టచ్ చేయని జోనర్ లేదు. రికార్డులు, కలెక్షన్లతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు నాగార్జున. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకి వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగార్జున తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పరుచుకున్నారు. తమ హీరో పుట్టినరోజు వేడుకలను అక్కినేని అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరపడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. ట్విట్టర్‌లో #HBKingNagarjuna హ్యాష్‌ట్యాగ్‌తో నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

అభిమానులు కింగ్‌ను ఆకాశానికి ఎత్తుతూ ట్వీట్లు చేస్తున్నారు.ఇక ‘విక్రమ్’ సినిమాతో హీరోగా పరిచయమైన నాగార్జున.. ‘మజ్ను’, ‘గీతాంజలి’ సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఆ తరువాత రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ సినిమాతో నాగ్ అసలు సిసలు మాస్ హీరోగా మారారు. ఈ చిత్రం టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఇక ఆ తరువాత నాగార్జున వెనుదిరిగి చూడలేదు. ‘హలో బ్రదర్’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘అన్నమయ్య’, ‘నువ్వు వస్తావని’, ‘ఆజాద్’, ‘సంతోషం’, ‘మన్మథుడు’, ‘శివమణి’, ‘నేనున్నాను’, ‘మాస్’, ‘శ్రీరామదాసు’, ‘కింగ్’, ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘ఊపిరి’, ‘దేవదాస్’.. ఇలా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వచ్చారు నాగార్జున. టాలీవుడ్‌లో ప్రయోగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన హీరో నాగార్జున అంటే అతిశయోక్తికాదు. నాగ్ చేసినన్ని ప్రయోగాలు ఏ హీరో చేయలేదనే చెప్పాలి. ఇప్పటి వరకు 91 సినిమాల్లో నటించిన నాగార్జున సెంచరీ దిశగా దూసుకెళ్తున్నారు. కుమారులు నాగచైతన్య, అఖిల్‌లకు గట్టిపోటీనిస్తున్నారు.

ఇక కేవలం వెండితెరకే పరిమితం కాకుండా బుల్లితెరపై కూడా సత్తా చాటారు నాగ్. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకి హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున.. టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. నాగార్జునను ఆదర్శంగా తీసుకొని ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని టెలివిజన్ ప్లాట్‌ఫాంపై అడుగుపెట్టారు. అదేవిధంగా నాగ్ ‘బిగ్ బాస్’ షోతో బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం మూడు సీజన్లతో అలరించిన ఈ గ్రాండ్ రియాలిటీ షో ఇప్పుడు నాలుగో సీజన్ లోకి అడుగు పెట్టింది. గత సీజన్‌ను అద్భుతంగా రక్తి కట్టించిన కింగ్ నాగార్జునే మళ్లీ ఈ షోను హోస్ట్ చేస్తుండడంతో మరోసారి అంచనాలు పెరిగాయి. ‘బిగ్ బాస్ 4’ సెప్టెంబర్ 6న సాయంత్రం 6 గంటలకు గ్రాండ్‌గా లాంచ్ కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News