Friday, April 19, 2024

భారీ వర్షాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Alert for Heavy rains in Telangana

హైద‌రాబాద్‌: తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయని, వాగులు వంకలు పొంగపొర్లుతున్నాయని,  మ‌రికొద్ది రోజుల‌ పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సూచించారు.  రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులను రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేశించారు. ఈ మేరకు మంత్రి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ప‌రిధిలోని ములుగు, భూపాల‌ప‌ల్లి, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, జ‌న‌గామ త‌దిత‌ర జిల్లాల క‌లెక్ట‌ర్లు, సిపి, ఎస్పీలు, పంచాయ‌తీరాజ్ శాఖ, ఇత‌ర సంబంధిత శాఖ‌ల‌ అధికారులతో మంత్రి సోమ‌వారం టెలీఫోన్ లో మాట్లాడారు. మ‌రోవైపు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, తదితర అధికారులను కూడా అప్ర‌మ‌త్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడారు.  ఇదే సమయంలో వర్ష ప్రభావం వల్ల రాష్ట్రంలోని ప్ర‌భావిత ప్రాంతాలు, ప్ర‌త్యేకించి ములుగు, భూపాల‌ప‌ల్లి, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, కాజీపేట, జ‌న‌గామ‌ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాల‌ని ఆదేశించారు.

ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అధికారులకు దిశా నిర్ధేశం చేయాలన్నారు. ములుగు జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాలలో ముంపు ప్రభావం అధికంగా ఉంటుందని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఆస్తి నష్టం జరగకుండా ప్రత్యేకంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ములుగు జిల్లా కలెక్టర్ ను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.

అదే విధంగా గత సంవత్సరం వరంగల్ నగరంలో భారీ వర్షాల వల్ల వరద ప్రవాహం పెరిగి నష్టం జరిగిన దృష్ట్యా ప్రత్యేకంగా ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని మంత్రి దయాకర్ రావు కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులు సమన్వయంతో కృషి చేసి ఏ చెరువు గాని, రోడ్డు గాని, తెగిపోకుండా చూడాలని అయన కోరారు. రోడ్డుపై ఒక అంగుళం కన్న ఎక్కువ ఎత్తుగా నీరు ప్రవహించినట్లయితే ముందు జాగ్రత్త చర్యగా ఆ రోడ్డును తాత్కాలికంగా బ్లాక్ చేయాలని అయన కోరారు. అదే విధంగా విద్యుత్ స్తంభాలకు ఏ విధమైన నష్టం లేకుండా చూడాలని అయన కోరారు. భారీగా వర్షం పడుతున్న సందర్భంగా ముందు జాగ్రత్తగా చర్యగా తాత్కాలికంగా ఆ ప్రాంతాలో విద్యుత్ ను నిలిపివేసి నష్టాన్ని నివారించాలని ఎర్రబెల్లి సూచించారు. వరద నష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని నివారణ చర్యలు చేపట్టడానికి టోల్ ఫ్రీ నెంబర్లను జిల్లా కలెక్టర్ కార్యాలయంల, వరంగల్ నగర పాలక సంస్థ కార్యలయంలో ఏర్పాటు చేయాలని అయన కోరారు.

మిషన్ భగీరథ మంచినీటి సరఫరాకు ఆటంకాలు రాకుండా చూడాల‌ని, ఒక‌వేళ ఎక్క‌డైనా స‌మ‌స్య‌లు త‌లెత్తితే వెంట‌నే పున‌రుద్ధ‌ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. వరద నీటి కోతకు రోడ్లు తెగిపోవడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఒకవైపు పిఅర్ రోడ్లను పరిరక్షించిడంతో పాటు అలాగే కోతలకు గురైన రోడ్ల వివరాలు, నష్టం అంచనాలు సేకరించాలని, వాటి పునరుద్ధరణ, మరమ్మతుల చర్యలకు ఉపక్రమించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేశించారు.

వర్షాలకు బాగా కురుస్తున్న కారణంగా, రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని, వర్షాకాల సీజనల్ వ్యాధుల ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశిచారు వెంటనే జిల్లా పరిషత్ సిఇఒలు, ఎంపిడిఒలు, ఎంపిఒలు, గ్రామ కార్యదర్శులను అప్రమత్తం చేయాలని మంత్రి సూచించారు. ప్రజలు సైతం వర్షాలు తగ్గే వరకు ప్రయాణాలు పెట్టుకోవద్దని, రోడ్ల మీదకు రావద్దని చెప్పారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News