Home తాజా వార్తలు నిజనివాసాలకు తరలిన తల్లులు

నిజనివాసాలకు తరలిన తల్లులు

Medaram Chinna Jatara9గంటల పాటు దర్శించిన భక్తజనం
ప్రధాన ద్వారంలో సందడి చేసిన నాగుపాము
మేడారంలో భారీగా మొక్కులు సమర్పించిన భక్తులు

జయశంకర్ భూపాలపల్లి: మినీ మేడారం(మండమెలిగె పండగ)లో ప్రధాన ఆకర్షణగా దర్శనమిచ్చిన తల్లుల ప్రతిరూపాలు అయిన ఆడెపుబుడ్లు గురువారం ఉదయమే భక్తుల జయజయద్వానాల మధ్య గద్దెల నుంచి అట్టహాసంగా నిజనివాసాలకు తరలివెళ్లాయి. దానితో జాతరలో అతిముఖ్యఘట్టం ముగిసినట్లయ్యింది. ఈనెల 20నుంచి 23వరకు జరిగే తిరుగు జాతర సందర్భంగా తొమ్మిది గంటలపాటు భక్తులు ఆదివాసీ ఇలవేల్పులను దర్శించి ఘనంగా మొక్కులు సమర్పించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో గిరిజన ఆరాధ్యదైవాలైన సమ్మక్క సారలమ్మ తల్లులు భక్తులకు ఇలవేల్పులు అయినందున రాష్ర్టేతర ప్రాంతాల నుంచి అసంఖ్యాక భక్తజనం తరలివచ్చారు. అమ్మల ప్రతిరూపాలు గద్దెలకు చేరేముందు ప్రవేశద్వారం వద్ద అంత జనంలో నాగుపాము గతంలో ఎప్పుడూ లేనివిధంగా సందడి చేయడం ప్రధాన చర్చనీయాంశమయ్యింది. అంతమందిలో పాము సంచరించి ఎవరికీ ఏవిధమైన హాని చేయకపోవడంతో అంతా తల్లుల దయ అని చేతులు భక్తులు జోడించారు.

ఇదిలా ఉంటే జాతరా స్థలిని గురువారం పర్యవేక్షించేందుకు జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ భాస్కరన్ వచ్చి తల్లులను దర్శించి సరిహద్దు ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. మొక్కులు సమర్పించుకునేందుకు వచ్చే భక్తులు తొలుత పుట్టు వెంట్రుకలు సమర్పించి షవర్ల కింద పుణ్యస్నానాలు చేసి గద్దెల ప్రాంగణంలోని హుండీలలో కానుకలు వేసి తల్లులకు పసుపు, కుంకుమలు సమర్పించి దీవెనలు పొందారు. అమ్మవార్ల ప్రతిరూపాలను మేడారం గ్రామంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాలకు గిరిజన పూజారులు వేరువేరుగా వెళ్లి అసంఖ్యాక భక్తజనం మధ్య తల్లులను జయజయ ధ్వానాలతో బుధవారం రాత్రి 9గంటల సమయంలో గద్దెలకు తీసుకువచ్చారు. ముందుగా సమ్మక్క గద్దెపైకి చేరుకోగా, గంట వ్యవధిలో సారలమ్మ గద్దెపై కొలువుదీరింది.

గిరిజన వాయిధ్యాలు అయిన డోలు, కొమ్ములను వాయిస్తూ భక్తి పారవశ్యంతో గద్దెలకు చేర్చి రాత్రి 9గంటల నుంచి తెల్లవారుజామున 6గంటల వరకు భక్తులు 9గంటలపాటు తల్లుల దర్శనం కలిగించారు. అనంతరం ఆప్రతిరూపాలను గిరిజన వాయిద్యాల మధ్య పూర్వ స్థానాలకు చేర్చారు. శివసత్తుల పూనకాలు, కోడిపిల్లల ఎగురవేత, జంతుబలులతో బంగారుతల్లులు ప్రతిమల రూపంలో అక్కడ భక్తులకు దర్శనభాగ్యం కలిగించారు. తల్లుల ప్రతిరూపాలు రాత్రి నుంచి ఉదయం 6గంటల వరకు ఉంచి తిరిగి గమ్యస్థానాలకు చేర్చే సమయంలో భక్తుల రద్దీతో ఆప్రాంగణం అంతా సందడిగా మారింది. క్యూలైన్లలో తరలివచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా చేసిన ఏర్పాట్లతో భక్తులు గద్దెల వద్ద తమ మొక్కులు చెల్లించుకున్నారు.

రాత్రి తల్లుల రాక ముందు 8నుంచి 9గంటల సమయంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా కిక్కిరిసిన అంతమందిలో ప్రధాన ద్వారం వద్ద పాము సందడి చేయడం ప్రధాన చర్చనీయాంశమయ్యింది. సమ్మక్కతల్లి పామురూపంలో భక్తులకు దర్శనమిచ్చిందని ఆప్రాంతంలో కొంత మంది అభిప్రాయపడి సమ్మక్క తల్లికి చేతులు జోడించి మొక్కారు. మొత్తానికి పాము రాక శుభసూచకమని, ఈసంవత్సరం అంతా మేలే జరుగుతుందని ఆలయ పూజారులన్నారు.

All about Medaram Chinna Jatara