Home తాజా వార్తలు సికింద్రాబాద్ రాజకీయ ముఖచిత్రం

సికింద్రాబాద్ రాజకీయ ముఖచిత్రం

Secunderabad Constituency1957లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటినుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీలుగా గెలుపొందిన అభ్యర్థ్ధులు బండారు దత్తాత్రేయ, అంజన్‌కుమార్ యాదవ్, టంగుటూరి అంజయ్య, టంగుటూరి మణెమ్మ, ఎం.ఎం హషీమ్‌లు గెలిచారు.

మన తెలంగాణ/సిటీబ్యూరో: జాతీయ, రాష్ట్ర రాజకీయాలను జీర్ణించుకుంటూ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ తన విభిన్నత్వాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం జరిగే ఎన్నికలు ఒఎత్తుగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఇవి. గతంలో జరిగిన అంటే 2014 వరకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం 17 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజల తీర్పు ఎటువైపు ఉంటుందనేది కొంత ఆసక్తిగా ఉన్నది. అయితే, ఇటీవలనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలు పట్టంకట్టారు. మరి రానున్న ఎన్నికల్లో అధికార పార్టీనే గెలిపిస్తారనే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

1957 నుంచి..

తెలంగాణలో ప్రేమగా లష్కర్ అని పిలుచుకునే సికింద్రాబాద్ 1957లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ ఒకే పార్లమెంట్ నియోజకవర్గంగా ఉండేది. అప్పుడు మొట్టమొదటి లోక్‌సభకు వివిధ రాజకీయ పార్టీలు పోటీపడ్డాయి. సికింద్రాబాద్‌గా విడిపోయిన ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 19,54,813 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి ఓటర్లు అనాదిగా కాంగ్రెస్ పార్టీకి పట్టంకడుతూ వస్తున్నారు. మధ్య మధ్యలో నాలుగు సార్లు భారతీయ జనతా పార్టీని గెలిపించారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ లోక్‌సభ పరిధిలో ముషీరాబాద్, అంబర్‌పేట,ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్,నాంపల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.

ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో రెండవ లోక్‌సభ ఎన్నికలు మొదలుకొని 16వ లోక్‌సభ ఎన్నికల వరకు పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ తొమ్మిది సార్లు విజయకేతనం ఎగురవేసింది. నాలుగు సార్లు భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. రెండవ లోక్‌సభకు 1957-లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ మొహియుద్దీన్ గెలుపొందారు. మూడవ లోక్‌సభకు 1962లో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్ధి అహ్మద్ మొహియుద్దీన్‌ను విజయం వరించింది. నాల్గవ లోక్‌సభకు 1967-లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థ్ధిగా బకర్ అలీ మీర్జా, ఐదవ లోక్‌సభ 1971లో తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థిగానూ ఆరవ లోక్‌సభ(1977లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎం.ఎం. హషీమ్‌లు గెలుపొందారు. ఏడవ లోక్‌సభకు 1980లో కాంగ్రెస్ అభ్యర్థిగా పి.శివశంకర్, ఎనిమిదవ లోక్‌సభకు 1984లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థ్ధిగా టంగుటూరి అంజయ్య, తొమ్మిదవ లోక్‌సభకు 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థ్ధిగా టంగుటూరి మణెమ్మ, పదవ లోక్‌సభ 1991లో తొలిసారిగా భాజపా అభ్యర్థిగా బండారు దత్తాత్రేయ విజకేతనం ఎగురవేశారు.

పదకొండవ లోక్‌సభకు 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పి.వి.రాజేశ్వరరావు, పన్నెండవ లోక్‌సభకు జరిగిన 1998లో నిర్వహిచిన ఎన్నికల్లోనూ, పదమూడవ లోక్‌సభకు 1999లో వరుసగా భాజపా అభ్యర్థి బండారు దత్తాత్రేయ విజయం సాధించారు. పద్నల్గవ, పదిహేనవ లోక్‌సభ 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థ్ధిగా అంజన్ కుమార్ యాదవ్ విజయం సాధించారు. పదహారవ లోక్‌సభకు 2014లో జరిగిన ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా బండారు దత్తాత్రేయ గెలుపొందారు.

బీజేపీదే ఆధిక్యత..

2014 ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్‌లో భాజపా అభ్యర్ధి బండారు దత్తాత్రేయ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు ఏ ఒక్క పార్టీకి కట్టుబడి లేరు. రెండు పర్యాయాలు ఒక పార్టీని గెలిపిస్తే.. మరో రెండుసార్లు ఇంకొక పార్టీని గెలిపిస్తూ వచ్చారు. ఈ విధంగా ఓటర్లు తమ మనోభావాలను స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు సార్లు గెలిచిన దత్తన్న..

2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలలో నాలుగోసారి భాజపా తరఫున బరిలో దత్తాత్రేయ 2,54,735 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కేంద్ర మంత్రి అయ్యారు. దత్తాత్రేయ 4,38,271 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థ్ధి అంజన్ కుమార్‌కు 1,83,536 ఓట్లు లభించాయి. వరుసగా రెండుసార్టు గెలిచిన అంజన్ కుమార్ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఎంఐఎం అభ్యర్ధి ఎన్. మోహన్‌రావు మూడో స్ధానంలో, తెరాస అభ్యర్ధి భీమ్‌సేన్ 1,43,874ఓట్లతో నాలుగో స్థ్ధానంలో నిలిచారు.

All About Secunderabad Lok Sabha Constituency in Telugu