Home ఎడిటోరియల్ సంపాదకీయం : కాళేశ్వరం ప్రాజెక్టుకు లైన్‌క్లియర్

సంపాదకీయం : కాళేశ్వరం ప్రాజెక్టుకు లైన్‌క్లియర్

Sampadakeeyam-Logo

కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వ బృహత్తర లక్షసాధన ప్రక్రియలో ప్రధానమైన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు మార్గం సుగమమైంది. మల్లన్నసాగర్, ఇతర రిజర్వాయర్లతో పాటు పలు బ్యారేజీలు, సొరంగాలు, కాల్వలు త్రవ్వే పనులకు 7,920 ఎకరాల అటవీభూమిని ఉపయోగించు కునేందుకు కేంద్ర పర్యావరణ, అడవుల మంత్రిత్వశాఖ అనుమతి మంజూరుచేయటం ప్రభుత్వ భగీరథ ప్రయత్నానికి ఊరట మాత్రమే కాదు, పెద్ద ప్రోత్సాహం కూడా. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రద్దుచేసి వేగవంతంగా, మరింత ప్రయోజనదాయకంగా సాగునీటిని క్షేత్రాలకు చేర్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను రీడిజైన్ చేయటం తెలిసిందే. ప్రతీ నియోజక వర్గంలో ఒక లక్ష ఎకరాలకు సాగునీటిని అందించటం లక్షంగా పెట్టుకుంది. అందుకనుగుణంగా, తెలంగాణ భౌగోళిక పరిస్థితులకు తగినట్లు అనేక భారీ రిజర్వాయర్లు, బ్యారేజీలకు రూపకల్పన జరిగింది. గోదావరి, కృష్ణ నదులపై అనేక సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న 23మేజర్, 13మీడియం ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసింది. వాటిలో 7 ప్రాజెక్టులు సంపూర్ణంగా, 14పాక్షికంగా పూర్తయ్యాయి. వర్తమాన సంవత్సర బడ్జెట్లో కూడా ఇరిగేషన్ రంగానికి రూ.25కోట్లు కేటాయించింది. 70-75 శాతం ఖర్చు చేయగలిగినా మంచి పురోగతి సాధించినట్లే.
గోదావరి జలాల వినియోగంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇచ్చిపుచ్చుకునే రీతిలో సుహృద్భావంతో ఒప్పందం చేసుకోవటంవల్ల కాళేశ్వరం ప్రాజెక్టు సుసాధ్యమైంది. దాని ఎత్తు కొంత తగ్గించటం వల్ల పూర్తి ప్రయోజనం చేకూరదన్న వాదనలున్నప్పటికీ, వివాదాలతో కాలం వృధా చేసేదానికన్నా ఆమోదయోగ్యమైన ఒప్పందాలే మేలని ప్రభుత్వం భావించింది. అయితే వివిధ భారీ రిజర్వాయర్లు, బ్యారేజీలు, లిఫ్ట్‌లు, కాల్వల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ విషయంలో తొందరపాటు చర్యలు భూములు కోల్పోయే రైతులను అసహనానికి లోను చేశాయి, మల్లన్నసాగర్ రైతుల ప్రత్యక్ష పోరాటం విషయంలో ప్రభుత్వ ప్రతిష్టకుపోవటంతో సమస్య తీవ్రతరమైంది, కోర్టు కేసులకు దారితీసింది. కేంద్ర భూసేకరణ చట్టం(2013) ప్రకారం ముందుకెళ్లి ఉంటే ఇంత ప్రతిఘటన ఎదురయ్యేది కాదు. అందులోని ముఖ్యమైన క్లాజులను పక్కనబెట్టి, అందులో చెప్పినదానికన్నా ఎక్కువే నష్టపరిహారం ఇస్తామంటూ అధికారులను, మంత్రులను ప్రయోగించి నయానా భయానా భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నం బెడిసికొట్టింది.హైకోర్టు నుంచి కూడా అక్షింతలు తప్పలేదు. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని నిందించటం ద్వారా తన ఏకపక్ష చర్యలను సమర్థించుకో జూసింది. అటుతర్వాత కేంద్ర భూసేకరణ చట్టాన్ని అతిక్రమించకుండా, మెరుగైన పరిహారం ప్రతిపాదిస్తూ రాష్ట్ర భూసేకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం పొందింది. కేంద్రప్రభుత్వం సూచించిన కొన్ని సవరణలకు కూడా గత అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం పొందింది. దీంతో ప్రైవేటు భూముల సేకరణను వేగిరపరిచే అవకాశం ప్రభుత్వానికి లభించింది.
రెండోవైపున, అటవీ భూముల వినియోగానికి కేంద్రప్రభుత్వ అనుమతి లభిస్తేనే ప్రాజెక్టుల నిర్మాణ పనులు నిరాటంకంగా సాగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో అటవీ భూముల విస్తీర్ణం తక్కువ. దాన్ని విస్తరించేందుకు హరితహారం పేరుతో కోట్లాది మొక్కలు నాటే కార్యక్రమం ఏటా వర్షాకాలంలో జోరుగా సాగుతోంది. కాని వాటిని రక్షించటం, పోషించటంలో శ్రద్ధ కనబడటం లేదు. ఈ పరిస్థితుల్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల కొరకు దాదాపు 8వేల ఎకరాల అటవీ భూమిని వినియోగించేందుకు కేంద్రంనుండి ఇంత త్వరగా అనుమతి సాధించటం సానుకూల పరిణామం. ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఎంత వేగవంతం చేయగలరన్నది ఇప్పుడు ప్రభుత్వానికి పరీక్ష.