Wednesday, April 24, 2024

ద్వంద్వ నీతి వద్దు

- Advertisement -
- Advertisement -

All states should be treated equally in grain procurement:TRS MPs

ధాన్య సేకరణలో అన్ని రాష్ట్రాలను ఒకేవిధంగా చూడాలి

ఎలాంటి వివక్ష వుండకూడదు
పంజాబ్‌లో మొత్తం ధాన్యం సేకరించి, తెలంగాణలో ఎందుకు అలా చేయడం లేదు :
పార్లమెంట్‌లో నిలదీసిన కెకె
ధాన్యం సేకరించాలని 60రోజులుగా కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు
దీనిపై చర్చలకు సిద్ధంగా ఉన్నాం
బిజెపి పాలకులు ఢిల్లీలో ఒకరకంగా, తెలంగాణలో మరోరకంగా చెబుతూ ద్వంద్వ నీతి పాటిస్తున్నారు, ఇప్పటికైనా కొనుగోలుపై సభలో ప్రకటన చేయాలి : లోక్‌సభలో నామా
ఉభయసభల్లో రెండోరోజూ టిఆర్‌ఎస్ నిరసనగళం, వాకౌట్
సభా కార్యక్రమాలకు అంతరాయం

మన తెలంగాణ/హైదరాబాద్ : వరి ధాన్యం కొనుగోలుపై రెండవ రోజు కూడా టిఆర్‌ఎస్ ఎంపిల ఆందోళనలతో పార్లమెంట్ దద్దరిల్లింది. ఉభయ సభలకు పలుమార్లు అంతరాయం కలిగింది. ధాన్యం సేకరణపై కేంద్రం వెంటనే సమగ్ర జాతీయ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్రం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్ పోడియంల వద్దకు వెళ్లి కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణలోని ధాన్యాన్ని కేంద్రం పూర్తిగా కొనుగోలు చేయాల్సిందేనని పేర్కొంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కెసిఆర్ అడిగిన ప్రశ్నకు కేంద్రం ఎందుకు సూటిగా సమాధానం చెప్పడం లేదంటూ నిలదీశారు. ఈ విషయంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను ఎందుకు సమానంగా చూడడం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలులో పంజాబ్‌లో ఒక విధంగా…తెలంగాణలో మరో రకంగా ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నదని నిలదీశారు. దీంతో ఉభయ సభల్లో పలుమార్లు తీవ్ర అంతరాయం…గందరగోళం ఏర్పడింది. మంగళవారం సభ ప్రారంభం కాగానే టిఆర్‌ఎస్ ఎంపిలు మరోసారి ధాన్యం కొనుగోలు అంశంపై చర్చకు పట్టుబట్టారు. దీనిపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు తమ ఆందోళన ఆగదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యాన్ని సేకరించాలని ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. ధాన్య సేకరణపై జాతీయ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ చైర్‌లో కూర్చున్న రాజా ఆందోళన చేస్తున్న టిఆర్‌ఎస్ ఎంపిలను శాంతింపచేసేందుకు పలుమార్లు ప్రయత్నించారు. అయినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. స్పీకర్ పదేపదే చేసిన విజ్ఞప్తిని టిఆర్‌ఎస్ ఎంపిలు ఏ మాత్రం పట్టించుకోలేదు. రైతులను ఆదుకునేందుకు కేంద్రం తక్షణమే ముందుకు వచ్చి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని భీష్మించారు. స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. దీంతో సభను స్పీకర్ మరోసారి వాయిదా వేశారు.

మధ్యాహ్నం తరువాత సభ తిరిగి ప్రారంభమైంది. సభ మొదలుకాగానే టిఆర్‌ఎస్ ఎంపిలు ఎప్పటి మాదిరిగానే స్పీకర్ పోడియం దగ్గర మళ్లీ ఆందోళనకు దిగారు. దీంతో ఉభయ సభలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో బుధవారం నాటికి వాయిదాపడ్డాయి. విపక్షాల వాణి వినకుండా చట్టసభల్లోనే కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 మంది సభ్యులను సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేయడం చాలా దురదృష్టకరమన్నారు. రాజ్యసభలో కేంద్రం తీరును నిరసిస్తూ విపక్షాలతో కలిసి మంగళవారం టిఆర్‌ఎస్ సభ్యులు కూడా సభ నుంచి వాకౌట్ చేశారు.

కేంద్రం తీరును నిరిసస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో కెకె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సభ్యుల అనుచిత ప్రవర్తన కారణంగా సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడం సరికాదన్నారు. దీనిపై రాజ్యసభ చైర్మన్ తన నిర్ణయాన్ని మరోసారి పునసమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతు చట్టాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిని గతంలోనే తప్పుపట్టామని ఈ సందర్భంగా కెకె గుర్తు చేశారు. దేశానికి మంచి జరిగే బిల్లులపై అంశాల వారిగానే బిజెపికి మద్దతు ఇచ్చామన్నారు. అంతమాత్రాన బిజెపికి, టిఆర్‌ఎస్ దగ్గర అయినట్లు కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉండాలని కోరుకోవడంలో తప్పులేదన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలకు భంగం కలుగనంత వరకే ఈ బంధం కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలోని రైతులు రోడు ్డమీదకు తీసుకొచ్చే పరిస్థితిని కేంద్రం తీసుకరావడం వల్లే పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ పక్షాన ఆందోళనలను చేయాల్సి వస్తోందన్నారు. సాగు చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టామన్నారు.

బిజెపికి ఎప్పుడు టిఆర్‌ఎస్ వ్యతిరేకమేనని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగానే రాష్ట్రంలో రైతులకు అపార నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని మార్కెట్ యార్డుల్లోని ధాన్యం పూర్తిగా తడిచిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ముందుకు రాని కారణంగానే రాష్ట్రంలో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో సమగ్ర ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించాలని కెకె మరోసారి డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణలో అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా చూడాలన్నారు. ఇందులో ఎలాంటి వివక్ష ఉండకూడదన్నారు. కానీ కేంద్రం పంజాబ్‌లో మొత్తం ధాన్యం సేకరించి తెలంగాణలో ఎందుకు చేయదని ప్రశ్నించారు. ధాన్యం ఉత్పత్తిలో రెండు రాష్ట్రాలు సమానంగా ఉన్నాయన్నారు. కనీసం ఏడాది మొత్తం ఎంత మొత్తంలో ధాన్యం సేకరిస్తారో చెప్పాలని కెకె డిమాండ్ చేశారు. ఏడాదికి కేంద్రం నిర్దిష్ట ప్రణాళిక ఇస్తే దాని ప్రకారం రైతులను సన్నద్ధం చేస్తామన్నారు.

స్పష్టమైన ప్రకటన చేయాలి

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని టిఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆరోపించారు. 60 రోజులుగా రైతుల ధాన్యం సేకరణ చేయాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. అందుకే పార్లమెంట్ వేదికగా నిరసన తెలుపుతున్నామన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఒక రకంగా.. తెలంగాణలో మరో రకంగా చెబుతూ ద్వంద్వ నీతి అవలంభిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలుపై సభలో కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

రైతులను దగా చేస్తున్న కేంద్రం

రైతులను కేంద్రం మోసం చేస్తున్నదని టిఆర్‌ఎస్ ఎంపిలు తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపిలు దయాకర్, వెంకటేష్ నేత, మాలోతు కవిత, పి. రాములు- తదితరులు మాట్లాడుతూ, కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. రైతులను మోసగించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. అందరికీ తిండిపెట్టే రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఉందన్నారు. కానీ ఈ విషయంలో కేంద్రం నిర్లక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత అదనంగా గోడౌన్లు ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. బిజెపి నేతలకు రైతుల సంక్షేమం కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, మతాలు, కులాలతో చిచ్చుపెట్టడమేనని వారి పని అని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా తెలంగాణ రైతులకు సిఎం కెసిఆర్ 24 గంటల పాటు కరెంటు ఉచితంగా ఇస్తున్నారన్నారు. అలాగే ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు బంధు పేరుతో పెట్టుబడి అందిస్తున్నామన్నారు.

వృధాగా సముద్రంలో కలిసే నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నారని పేర్కొన్నారు. ఫలితంగా తెలంగాణ అంతటా భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ఇంటి నిర్మాణం కోసం పునాదులు తీస్తుంటేనే నీళ్లు వస్తున్నాయన్నారు. అందుకే గతంలో ఎప్పుడూ లేనంతగా సాగు విస్తీర్ణం పెరిగి… దిగుబడి రికార్డు స్థాయికి చేరుకుందన్నారు. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ యాసంగి పంట దిగుబడి తీసుకుంటుందా? లేదా? అన్న విషయంగా కేంద్రం స్పష్టంగా చెప్పాలని పదేపదే డిమాండ్ చేస్తున్నారన్నారు. అయినప్పటికీ కేంద్రంలో ఎలాంటి కదలిక లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ విషయంలో రెండు నెలల నుంచి కేంద్రం మానసికంగా వేధిస్తోందన్నారు. దీనిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తమను అవమానపర్చినా కూడా రైతుల కోసం భరిస్తున్నామన్నారు.

సిఎంను అనరాని మాటలు అంటున్నారు

సిఎం కెసిఆర్‌ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపి ధర్మపురి అరవింద్ అనరాని మాటలు అంటున్నారని టిఆర్‌ఎస్ ఎంపిలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రి అన్న కనీస మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లపై కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతుండడం సిగ్గుచేటని విమర్శించారు. ఆహార ధాన్యాలను సేకరించి ఆహార సమతుల్యత పాటించాల్సిన బాధ్యత కేంద్రానిది కాదా? అని ప్రశ్నించారు. ఆహారధాన్యాల దిగుబడి పెరిగినప్పుడు సేకరించడం, కొరత ఏర్పడినప్పుడు ఆహారభద్రతను కాపాడుతూ బఫర్ స్టాక్ నుంచి విడుదల చేయడం కోసమే ఎఫ్‌సిఐ సంస్థను ఏర్పాటు చేశారన్నారు. మరి ఎఫ్‌సిఐ విధులకు కూడా కేంద్రం అడ్డుతగులుతుండడం దుర్మార్గమన్నారు. ఒకప్పుడు ఎడారి మారిన తెలంగాణ ప్రాంతాన్ని సిఎం కెసిఆర్ అన్ని విధాలుగా హరిత తెలంగాణగా మార్చారన్నారు. ప్రదానంగా పంట విస్తీర్ణం పెరగడం కోసం ఎన్నో చర్యలు చేపట్టారన్నారు. రాష్ట్రాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చిన ఘనత కెసిఆర్‌దేనని అన్నారు. అలాంటి నేతపై సిగ్గులేని బండి సంజయ్, అరవింద్‌లు ఇష్టానుసారంగా మాట్లాడుతుండడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రయోజనం కోసం భూములు అమ్మితే తప్పేంటి?

రాష్ట్రంలో నీటి సదుపాయం, పారిశ్రామికాభివృద్ధి వల్ల భూముల విలువ విపరీతంగా పెరిగిందన్నారు. అధిక ధరలు పలుకుతున్న భూములను రాష్ట్ర ప్రయోజనం కోసం అమ్మితే తప్పేంటి? అని వారు ప్రశ్నించారు. మోదీ సర్కారు బ్యాంకులను, రైల్వేను, ఎల్‌ఐసీని అమ్మేయలేదా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసేముందు దమ్ముంటే కేంద్రాన్ని ముందుగా నిలదీయాలని రాష్ట్ర బిజెపి నేతలకు వారు సవాల్ విసిరారు. కేంద్రం చేస్తే తప్పుకాదు కానీ….రాష్ట్ర ప్రభుత్వం చేస్తే తప్పా? అని టిఆర్‌ఎస్ ఎంపిలు మండిపడ్డారు.

గాలిని, నీటిని, చివరకు దేశాన్నే అమ్మకానికి పెట్టబోయే ప్రభుత్వం బిజెపియేనని వారు ఆరోపించారు. విద్యుత్ చట్టం గురించి బిజెపి నాయకులు మాట్లాడుతూ…అందులో మీటర్ల అంశం ఎక్కడుంది అంటున్నారన్నారు. ముందు ఆ బిల్లును చదివి మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ప్రపంచదేశాల్లో ఆహార కొరతపై 160 దేశాలపై సర్వే చేస్తే భారత్ ర్యాంక్ 101 ఉందన్నారు. ఇందులో మన దేశం కంటే పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ మెరుగైన స్థానంలో ఉన్నాయన్నారు. ఇంతకన్నా సిగ్గుమరోటి ఉందా? అని నిలదీశారు. దేశంలో 22 కోట్లమంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని అత్యున్నత న్యాయస్థానం చెప్పిందన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆకలే లేదన్నారు. అత్యధికంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జరుగుతోందని వారు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News