Friday, April 19, 2024

మీడియా అకాడమీ భవనాన్ని త్వరలో పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

Allam Narayana visits media academy building in nampally

హైదరాబాద్: మీడియా అకాడమి భవనం త్వరలో పూర్తి చేయాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లను కోరారు. నాంపల్లిలో మీడియా అకాడమి భవన నిర్మాణ పనులను చైర్మన్ అల్లం నారాయణ గురువారం పరిశీలించారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ మీడియా అకాడమీ నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన జర్నలిస్టులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. జర్నలిస్టులకు ఉపయోగకరంగా ఉండే విధంగా మీడియా అకాడమి భవనాన్ని బహుళ అంతస్తుల భవనంగా నిర్మిస్తున్నట్లు ఇందులో 200 మందికి సరిపడే విధంగా ఆడిటోరియంను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ భవనంలో జర్నలిస్టులకు శిక్షణా తరగతులు, సర్టిఫికెట్ కోర్సుల నిర్వహణ, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, వీడియా కాన్ఫరెన్స్ తోపాటు ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆడిటోరియంను నిర్మిస్తున్నామన్నారు. ఈ భవనం ద్వారా జర్నలిస్టులకు మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ భవన నిర్మాణంలో అవసరమైన మార్పులను అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలని ఇంజనీర్లకు ఆయన సూచించారు. క్రమం తప్పకుండా పనులను పర్యవేక్షించాలని మీడియా అకాడమి అధికారులకు అల్లం నారాయణ సూచించారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవి, అసిస్టెంట్ ఇంజనీర్ నితిన్, మీడియా అకాడమి మేనేజర్ వనజ, అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణ చందర్ రావు, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News