Home తాజా వార్తలు మూసీ సుందరీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు

మూసీ సుందరీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు

Allot rs 500 crore to cleanse of waste from musi river

 

గుజరాత్ సబర్మతీ నదితరహాలో మూసీనది అభివృద్ధి
రూ.500 కోట్ల అంచనా వ్యయంతో ముందుకు..
మూసీ చుట్టూ పార్కులు, ఉద్యనవానలు
నది నుంచి వ్యర్థాల తొలగింపునకు శ్రీకారం

హైదరాబాద్: మూసీ సుందరీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గుజరాత్‌లోని సబర్మతీ నది తరహాలో మూసీనదిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. మూసీ నది వికారాబాద్ జిల్లా అనంతగిరి నుంచి ప్రారంభమై నల్లగొండ మీదుగా కృష్ణానదిలో కలుస్తోంది. ఇది రెండు ఉపనదులుగా విడిపోయి మూసీ, ఈసాలుగా నగరం వైపు వరద ఉధృతి పయనిస్తోంది. 1908 సంవత్సరంలో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకొని అప్పటి నిజాం నవాబు మూసీ, ఈసీల వరద ఉధృతిని ఆపడానికి గండిపేట వద్ద మూసీనదిపై (ఉస్మాన్‌సాగర్)ను, ఈ సానదిపై (హిమాయత్‌సాగర్) వద్ద రిజర్వాయర్లను నిర్మించారు. అవి నిండిన తరువాత ఆ రెండు నదులు లంగర్‌హౌస్ వద్ద ఒకటిగా కలుస్తాయి. అనంతరం అక్కడి నుంచి వాడపల్లి మీదుగా కృష్ణానదిలో మూసీ కలుస్తుంది.

నిజాం నవాబు రిజర్వాయర్లతో పాటు నాలాలను పదుల మీటర్ల వెడల్పుతో నిర్మించారు. అప్పట్లో నిర్మించిన నాలాలు చాలావరకు ఆక్రమణలకు గురయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మూసీరివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి (ఎంఆర్‌డిసిఎల్) ఆధ్వర్యంలో సుందరీకరణకు నడుంబిగించింది. ఇప్పటికే మూసీకి ఇరువైపులా ఉన్న అక్రమ కట్టాడాలను ప్రభుత్వం కూల్చివేయించింది. ప్రస్తుతం మూసీ పరివాహాక ప్రాంతాన్ని సర్వే చేయిస్తోంది. అందులో భాగంగా గండిపేట నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు, తూర్పువైపు ఉన్న గౌరెల్లి వరకు 47 కిలోమీటర్లు, హిమాయత్‌సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 8 కిలోమీటర్లతో కలిపి మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీనదిని గుర్తించేందుకు డ్రోన్ ద్వారా సర్వే చేపట్టారు. జీనో ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఈ సర్వే చేపట్టింది.

గత ప్రభుత్వాల హయాంలో మూసీ పరివాహాక ప్రాంతం…
గత ప్రభుత్వాల హయాంలో మూసీ పరివాహాక ప్రాంతంతో పాటు మూసీనదిలో పలు కట్టడాలను కబ్జాదారులు చేపట్టారు. ఈనేపథ్యంలో వర్షాలు వచ్చినప్పుడు వరదనీరుతో మూసీ ముందుకు కదల్లేక బస్తీలను ముంచెత్తుతోంది. ఒకప్పుడు తాగునీరు, సాగునీరు అందించిన మూసీనది పక్క నుంచి వెళ్లాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఎదులాబాద్, సూర్యాపేటకు చెందిన ప్రజలు కొన్ని సంవత్సరాల క్రితం వరకు మూసీ నీటిని తాగడానికి ఉపయోగించే వారు. ప్రస్తుతం మూసీలో వ్యర్థ రసాయనాలు ఎక్కువగా కలుస్తుండడంతో వాటిని వాడడం మానేశారు.

మూసీనది వలన కృష్ణానది సైతం కలుషితమవుతుందని అక్కడి ప్రజలు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. పర్యావరణ వేత్తలు మూసీ ఆక్రమణలతో పాటు కలుషితమవుతున్న తీరుపై ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం వాడుకోవడానికి ఉపయోగం లేదని, ఆ నీటితో పంటలను పండించవద్దని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. అయితే సిఎం కెసిఆర్ మూసీ నదిని సుందరీకరించాలన్న ఉద్ధేశ్యంతో ముందుకెళుతున్నారు. అందులో భాగంగా ముందుగా మూసీనదికి చుట్టుపక్కల పార్కులు, ఉద్యానవనాలను ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు.

మూసీ రివర్ బెడ్ నుంచి వ్యర్థాల తొలగింపు
ఇప్పటికే మూసీ రివర్ బెడ్ నుంచి వ్యర్థాల తొలగింపును చేపట్టారు. మూసీకి ఇరువైపులా అనువుగా ఉన్న ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, కాలుష్య నియంత్రణ తీరప్రాంత అభివృద్ధి లక్షంగా సమగ్ర ప్రణాళికను అధికారులు రూపొందించారు. అందులో భాగంగా కన్సల్టెన్సీ ఎంపిక కోసం ప్రతిపాదనలు ఆహ్వానించారు. ఈ ప్రక్రియకు ఎంఆర్‌డిసిఎల్ నోడల్ ఏజెన్సీగా వ్యవహారిస్తోంది. మూసీనవీకరణ, సుందీరకరణ డిజైన్లు సమర్పించాలంటూ అంతర్జాతీయ స్థాయిలో ఎంఆర్‌డిసిఎల్ బిడ్డింగ్ నిర్వహించగా తొమ్మిది అంతర్జాతీయ సంస్థలు ప్రతిపాదనలు సమర్పించాయి.

పది యంత్రాలతో ఫాగింగ్
బాపుఘాట్ నుంచి నాగోల్ బ్రిడ్జి వరకు 20 కిలోమీటర్ల మేర రివర్ బెడ్ నుంచి రూ.8.50 కోట్లతో చేపట్టిన వ్యర్థాల తొలగింపు పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ పనులు పూర్తయితే నదిలో ప్రవాహం సాఫీగా సాగనుంది. నదిలోని పొదలు, చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. దోమల నివారణకు రూ.31 లక్షలతో పది యంత్రాల ద్వారా ఫాగింగ్ చేస్తున్నారు. మూడు ప్రాంతాల్లో దోమల నాశన యంత్రాలను ఏర్పాటు చేశారు. నది మధ్యలో రసాయనాల పిచికారీ చేసేందుకు డ్రోన్లను వినియోగించనున్నారు. నాగోల్ నుంచి ఓఆర్‌ఆర్ గౌరెల్లి వరకు మూసీ నాలుగు వరుసల రేడియల్ రోడ్ల నిర్మాణానికి కసరత్తు మొదలయ్యింది. క్షేత్రస్థాయిలో సర్వే చేసిన స్టూప్ సంస్థ రూ.500 కోట్ల అంచనా వ్యయంతో నివేదిక సమర్పించింది.

Allot rs 500 crore to cleanse of waste from musi river