Tuesday, April 23, 2024

కొత్త చట్టాలు రెండేళ్లు అమలు కానివ్వండి

- Advertisement -
- Advertisement -

Allow Farm Laws For Year Or Two: Rajnath Singh

 

రైతులకు మేలు చేకూరకపోతే సవరించడానికి సిద్ధం : రాజ్‌నాథ్

చర్చలకు రండి : తోమర్

భూములు కార్పొరేట్లు లాక్కోలేవు : అమిత్ షా

లబ్ధి చేకూరకుంటే సవరణలు: రాజ్‌నాథ్‌సింగ్

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను ఏడాది లేదా రెండేళ్లు అమలు కానీయండి. దీనిని ఓ ప్రయోగంగా భావించండి. ఓవేళ రైతులకు వాటి వల్ల ప్రయోజనం లేదని గుర్తిస్తే సవరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధమని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ భరోసా ఇచ్చారు. నిరసనల్లో పాల్గొంటున్నవారు రైతు కుటుంబాలకు చెందినవారని, వారి పట్ల తమకు ఎంతో గౌరవం ఉన్నదని రాజ్‌నాథ్ అన్నారు. సమస్యలుంటే సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని, రైతులతో చర్చలు కొనసాగించాలని ప్రధాని మోడీ కూడా భావిస్తున్నారని, అందుకు ముందుకు రావాలని రాజ్‌నాథ్ విజ్ఞప్తి చేశారు. తాను కూడా రైతు బిడ్డనేనని రాజ్‌నాథ్ గుర్తు చేశారు. ఢిల్లీలోని ద్వారకలో ఏర్పాటు చేసిన ర్యాలీలో రాజ్‌నాథ్ ప్రసంగించారు.

చర్చలకు రండి : తోమర్

న్యూఢిల్లీ: ఆందోళన విరమించి చర్చలకు రావాలని పంజాబ్ రైతులకు కేంద్ర వ్యవసాయశాఖమంత్రి నరేంద్రసింగ్ తోమర్ విజ్ఞప్తి చేశారు. పంజాబ్ రైతుల మనసుల్లో కొన్ని అపోహలున్నాయని, చర్చలకు వస్తే చట్టాల పట్ల వారికి అవగాహన ఏర్పడుతుందని, దాంతో సమస్య పరిష్కారమవుతుందని తోమర్ అన్నారు. రైతు సంఘాల నేతలతో చర్చలకు కేంద్రం తరఫున తోమర్ నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రైతులతో కేంద్రం జరిపిన ఐదు రౌండ్ల చర్చలు విఫలమైన విషయం తెలిసిందే.

ఏ కార్పొరేట్ లాక్కోలేరు : అమిత్‌షా

దేశంలో ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం ఏ కార్పొరేట్ కూడా రైతుల భూమిని లాక్కోలేరని హోంమంత్రి అమిత్‌షా అన్నారు. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) కొనసాగుతుందని, మార్కెట్లు(మండీలు) మూతపడవని ఆయన అన్నారు. ఎంఎస్‌పిని రద్దు చేస్తారన్న ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలోని కిషన్‌గఢ్‌లో రైతులనుద్దేశించి అమిత్‌షా ప్రసంగించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News