Friday, March 29, 2024

అల్యూజన్ ప్రధాన ఆకర్షణ అయిన కవి

- Advertisement -
- Advertisement -

 Enugu Narasimhareddy

 

ఆధునిక వచనకవిత్వంలో allusion, illusion, elusion ఉండాలని ఎక్కడో చదివినట్టు జ్ఞాపకం. అల్యూజన్‌లో అన్యాపదేశంగా చెప్పడం, ఇల్యూజన్ లో భ్రమింపజేయడం, ఎల్యూజన్ లో దొరకకుండా తప్పించుకోవడం ఉంటాయి. Allegory అనే మరో పదం ఉంది సాహిత్య పరిభాషలో. దీన్ని కొందరు allusion కు సమానాత్మంగా వాడుతున్నారు కానీ, ఈ రెండింటి మధ్య స్వల్పమైన భేదం వుంది. మొదటిది రెండవదానికి ఒక ఉదాహరణ అన్నది నా అవగాహన. ప్రారంభంలో చెప్పిన మూడు అంశాలు కవిత్వ నిర్వచనం కిందికి రావని గుర్తించాలి. ఆధునిక వచనకవిత్వానికి అవసరమైనవి ఏవి అని ఒక కోణంలో ఆలోచించి చెప్పేందుకు మాత్రమే పనికొస్తాయి అవి.

Allusion ను అందంగా భాసిల్లజేసే కవులలో ఏనుగు నరసింహా రెడ్డి ఒకరు. ఈ లక్షణం ఆయన కవిత్వంలో ఈమధ్య ఎక్కువవుతున్నదని చెప్పేందుకు సాక్ష్యాలు ఆయన రాసిన కొత్తపలక, మూలమలుపు అనే కవితా సంపుటాలు. Allusion కు తెలుగులో ధ్వని, అన్యాపదేశం సరిపడే పదాలు. వీటినే ఇంగ్లిష్‌లో suggestion, reference or indirectness అని చెప్పుకోవచ్చు. ఆధునిక వచన కవిత్వం రాయడానికి సాధారణంగా మామూలు మాటలు చాలు అని అందరూ చెప్పేదాంట్లో వాస్తవముంది. అయితే, మామూలు పదాలను మామూలైన రీతిలో ఉపయోగించి రాస్తే అందులో కవిత్వం భాసిల్లదు – భావం గొప్పగా ఉన్నా కూడా! మామూలు మాటలను కవిత్వభాష (poetic diction) గా మార్చి వాడాలి. అల్యూజన్, ఇల్యూజన్, ఎల్యూజన్ మొదలైనవి మామూలు మాటలను కవిత్వభాషగా మార్చేందుకు పనికొస్తాయి. ఒక వ్యక్తి మరణించాడనే సంగతిని, లేదా అతని/ ఆమె ప్రాణం పోయిందనే విషయాన్ని చెప్పడానికి పిట్ట ఎగిరిపోయింది అనో, దీపం ఆరిపోయింది అనో రాస్తాం. ఇట్లా చెప్పడం ‘ధ్వని’తో కూడుకున్నది కనుక, అది మన రాతకు కవిత్వస్పర్శను ఆపాదిస్తుంది.

సమాంతర స్వప్నం సంపుటిలోని మొదటి కవితలో ‘నేను మన వూరికి రాకపోవచ్చు’ అని మధ్యమధ్య చెప్తూ ఒకచోట కవి, ‘మన వూరి బురుజు మీది పిట్టతో గొంతు కలపలేకపోతున్నా’ అంటారు. ఇది ధ్వన్యాత్మకంగా చెప్పడమే. మన వూరికి వచ్చి అందరితో మాట్లాడలేక పోతున్నా అన్నది అసలైన భావం. మామూలు కవులు ఇట్లానే రాసే అవకాశముంది. బురుజు మీది పిట్ట, గొంతు కలపడం – ఈ రెండూ మామూలు మాటల సమూహాలే. వీటిలో ప్రత్యేకమైన లేదా పెద్ద పదాలేవీ లేవు. కానీ, వీటితోనే కవిత్వస్పర్శ సిద్ధిస్తుంది. తర్వాతి కవితలో ఒకచోట
కడుపు నింపలేని అక్షరాలను భుజాన వేసుకొని
కలెక్టరాఫీసుల ముందు
కార్య నిర్వాహకశాఖల ముందూ
ఏడేళ్లుగా సూర్యోదయాల కోసం పడిగాపులు పడుతున్నాం
అంటారు. ఇక్కడ ‘సూర్యోదయాలు’ ఒక ప్రతీక రూపంలో ఉండి అల్యూజన్ కు ఆస్కారమిస్తున్నది. సూర్యోదయమంటే ప్రయత్నసాఫ్యల్యం లేదా సంతోషకరమైన ఫలితం అని భావం. ప్రతీకలున్న ప్రతి కవితాపంక్తి మంచి అల్యూజన్ కు ఉదాహరణ కాకపోవచ్చు. గుమ్మాలన్నీ కళ్ళనలంకరించుకున్నాయి అన్న పంక్తిలో పేరుకు ధ్వని వున్నా, ఇట్లాంటివి ఇంతకు ముందే చెప్పబడినాయి.
ఇదే పుస్తకంలోని షెల్టర్ చెట్టు అనే కవిత దాదాపు మొత్తం ధ్వన్యాత్మకతతో నిండివుంది. ప్రారంభ పంక్తులు ఎలా వున్నాయో చూడండి
దినం
నిర్దయగా రెండంకెల్లోకి ఎగసిపోతుంటే…….
అల్యూజన్ ను అవలంబించని కవి ఇదే భావాన్ని ఎట్లా చెప్పేవాడు? ఉదయం పూట పది గంటలవుతుంటే – అని రాసేవాడు బహుశా. అప్పుడందులో కవిత్వస్పర్శ ఎట్లా నెలకొంటుంది? మామూలు కవికీ అల్యూజన్ ను ఆశ్రయించే కవికీ మధ్యన వుండే భేదం యిదే. నవయోగి అనే కవితలో
గర్జించే సోమాలియాను గదిలో దాచేసి
ముఖానికి అందమైన అమెరికాను తగిలించుకుంటాను
అనడం కూడా అల్యూజన్ కిందికే వస్తుంది. యాభయ్యారక్షరాల గందరగోళం అన్న కవితలో అచ్చమైన అల్యూజన్ ను కలిగివున్న ఈ పంక్తులు చూడండి.
కాలయంత్రం నిర్దయగా నా మనసుమీద
ఇనుప శబ్దాలతో దాడి చేస్తుందో లేదో
ఇల్లు ఇల్లంతా లైట్లు పూస్తాయి
అలారం మోగుతుందో లేదో అని సింపుల్ గా చెప్పేబదులు, చక్కని అల్యూజన్ ను రంగరించి ఉత్తమ కవితాభివ్యక్తిని సాధిస్తాడు కవి. వినూత్నంగా, విశిష్టంగా చెప్పడమెలా అన్న ధ్యాస లేకపోతే ఇటువంటి కవితా పంక్తులు పుట్టవు. కొత్తగా కవిత్వం రాస్తున్నవారు ఇట్లాటి విశేషాలను శ్రద్ధతో గమనిస్తే, వారికి లాభం చేకూరుతుంది. ఇదే కవితలో మరొకచోట
ఆట హక్కును కొల్లగొడుతూ
కరకు కత్తులైన సిలబస్ కొండలు
అంటారు. రెండవ పంక్తిలోని పదాలు అన్యాపదేశంగా ఉండటాన్ని పక్కకు పెడితే, అవి కష్టపు ఉద్ధృతిని ఎంత బాగా సూచిస్తున్నాయి! మనసు పురివిప్పుకున్న నెమిలై అని వుంటుందొక చోట. నెమలి ఎప్పుడు పురి విప్పుతుంది? ఆనందం కలిగినప్పుడే కదా? సంతోషమై లేదా ఆనందం కలిగి అని రాసే బదులు ఇట్లా సూచనాత్మకంగా (suggestive గా) చెప్పడం జరుగుతుంది కొన్నిసార్లు. ఇక్కడ అద్భుతమైన అల్యూజన్ లేకపోవచ్చు. ప్రతి పంక్తిలో ధ్వన్యాత్మకతను ప్రవేశపెట్టడం బహుశా ఏ కవి వల్లా జరిగే పని కాదు. కొత్త పలక కవితా సంపుటిలో ధ్వనిప్రధానమైన పంక్తులెన్నో వున్నాయి. శాస్త్రీయ నృత్యాల అశోకచెట్టు/ సరికొత్తగా/ పక్కటెముకల్ని ప్రకటించుకుంది అంటారు కవి ఒకచోట. కొత్తగా కొమ్మలు పుట్టుకురావడాన్ని పక్కటెముకలు ప్రకటించుకోవడంగా వ్యక్తీకరించడం ధ్వనిపూరిత చర్య. పంచదార అనే మరో కవితలో ప్రియునికి తేనీరులో చక్కెరకు బదులు తేనె కలిపిన స్త్రీ ‘చెరుకుమొక్క మీద రాసిన పేరును/ తేనెటీగమీదికి జరిపానని’ అనుకుంటుందట. కవిత చివర్న ‘ఆమె గడసరి వేటగత్తే కాని/ నూకల్ని విసిరి/ వల పన్నడం మరచిపోయింది’ అంటాడు కవి అందమైన, ధ్వన్యాత్మకమైన కవిత్వభాషలో.

గతాన్ని తల్చుకోవడం అన్న భావంలో ఒకచోట ‘ఊయల వెనక్కి ఊగడం మొదలైనప్పుడు’ అంటాడు కవి. ఇట్లాంటి అన్యాపదేశ పంక్తులు పూర్వం ఏ కవీ చెప్పనివి ఐతే పాఠకునికి పరవశం కలగటంతో పాటు ఆలోచించే పని తగుల్తుంది. ఉదాహరణకు ‘ఇందరు మేకవన్నె పులుల్లో/ ఏ మృగానికి జేకొడదాం’ అని వస్తుందొక చోట. ఈ పంక్తుల్లోని సంకేతాలు ఒకరకంగా అల్యూజన్ కు తావిచ్చినా, ఇట్లాంటి పోలికలను పాఠకుడు ముందే చదివి ఉండటం వల్ల వాటి ప్రభావం అంత ఎక్కువగా ఉండకపోవచ్చు.

మూల మలుపు సంపుటిలోని జలదృశ్యం కవితలో ‘బోర్ల తూట్లు పడి జలగర్భం విచ్చిన్నం కాకముందు’ అన్నప్పుడూ అంతే. కాని, ఇంకొక కవితలో కాలాన్ని సూర్యునిగా సంకేతిస్తూ ‘కాలం క్రమంగా/ పడమటి ఆకాశానికి చేరినప్పుడు’ అనే పంక్తులున్నాయి. సూర్యాస్తమయ సమయమైనప్పుడు అని సింపుల్ గా చెబితే అందులో ఏ ధ్వనీ ఉండదనే విషయాన్ని మనం గుర్తించాలి. తహసీలాఫీసు వైపు అన్న కవితలో ధ్వనిపరంపర ఉన్న సందర్బాలున్నాయి. ఈ కింది పంక్తుల్ని పరిశీలించండి.
ఆఫీసు జోన్ లో ఎప్పుడూ
హెచ్చరిక లేని తుఫాన్ ఒకటి
తీరం దాటుతూనే ఉంటుంది
లిట్మస్ పేపరు లేని ప్రయోగశాలలో
సంతకం చేయాలో వద్దో
వేలు విడిచిన ఏ మేనమామా చెప్పడు….
దరఖాస్తు పట్టకొచ్చిన చందమామలు
వెన్నెల కురవడానికి జంకుతుంటాయి

ఈ పంక్తుల్లో హెచ్చరిక లేని తుఫాన్, లిట్మస్ పేపరు లేని ప్రయోగశాల, వేలు విడిచిన ఏ మేనమామా, చందమామలు, వెన్నెల కురవడానికి – ఇవన్నీ ఎంతో అందమైన అన్యాపదేశాన్ని నెలకొనేలా చేశాయి. నిజానికి మూల మలుపు అనే కవిత కూడా ఎంత ధ్వనిమయమైనదంటే, అభివ్యక్తి అన్న ఒక్క పదం లేకపోతే అసలు ఈ కవితలోని వస్తువేమిటి అని ఆలోచించవలసి వస్తుంది. ఆలోచింపజేయడం మంచి విషయమే కదా. ఈ కవిత కవిత్వం రాయటంలోని సాధకబాధకాలను సజెస్టివ్ గా వివరిస్తుంది. ఇక ఉద్దేశిత భావాన్ని మామూలుగా వ్యక్తం చేసేందుకు అవసరమయ్యే ఒక్కమాటను కూడా ఉపయోగించక, ‘ధ్వని’ని పండించటం దర్శనమిస్తుంది ఒకటి రెండు చోట్ల.

గతాన్ని నెమరు వేసుకోవడాన్ని లేదా పాత ప్రదేశాన్ని తల్చుకోవడాన్ని సూచిస్తూ, అవతలి తీరం కవితలో ఇట్లా అంటాడు కవి. ఇక్కడ నిలబడి/ అక్కడ చూడడం/ ఓడిపోవడం కానే కాదు. గొలుసు రాత కవితలో ఉన్న ఇట్లాంటి మరో ఉదాహరణను చూడండి. మనకు బాగా అలవాటైన సులభమైన విషయంలోనే ఒక్కోసారి తప్పులు చేస్తాం అన్న భావాన్ని సూచిస్తూ, ‘ఎప్పుడూ నడిచిన నేలమీదే/ ఒకప్పుడు జారిపడ్తాం’ అంటాడు కవి. ఈ రెండు పంక్తుల్లోని ఏ పదమూ ఉద్దేశిత భావాన్ని నేరుగా ప్రతిఫలించదు. అంటే వేరే పదాల ద్వారా ‘ధ్వని’ సాధింపబడిందన్న మాట. ఇది కూడా పొయెట్రీ రాయటం గురించిన కవితే.

ఏనుగు నరసింహారెడ్డి కవిత్వంలో ధ్వని మాత్రమే ఉంది, వేరేది ఏదీ లేదు అని చెప్పడం లేదు నేను. ఇంకా ఎన్నో మంచి లక్షణాలున్నాయి ఆయన కవిత్వంలో. అయితే, నేను ధ్వని (allusion) అన్న కోణంలోంచే రాశాను కనుక, వేరే సుగుణాల గురించి రాయలేదు. వాటి గురించి ఇంకెవరైనా రాసిఉండవచ్చు.

 

Allusion poet Enugu Narasimhareddy
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News