Home ఎడిటోరియల్ చరిత్రను చెరపలేరు

చరిత్రను చెరపలేరు

Amar jawan jyoti at india gate merged with eternal flame

దేశం కోసం ప్రాణాలు అర్పించే అమర జవానుల త్యాగం అసమానమైనది. వారి గొప్పతనాన్ని చాటిచెపుతూ నెలకొల్పిన స్మారక జ్యోతుల విషయంలో రాజకీయాలకు అణువంతైనా తావుండకూడదు. అటువంటి బాధాకరమైన సందర్భం ఇప్పుడు చోటు చేసుకోడం అత్యంత దురదృష్టకరం. 1971నాటి బంగ్లాదేశ్ యుద్ధ విజయ చిహ్నంగా ఢిల్లీ ఇండియా గేట్ వద్ద నెలకొల్పిన అమర్ జవాన్ జ్యోతిని శుక్రవారంనాడు అక్కడికి 400 మీటర్ల దూరంలో గల జాతీయ యుద్ధవీరుల స్మారక స్థలం వద్దనున్న పవిత్ర జ్యోతిలో కలిపి వేసిన ఘటన వివాదాస్పదం అయింది. 1971 లో భారత పాకిస్థాన్‌ల మధ్య జరిగిన యుద్ధంలో ఇండియా అఖండ విజయం సాధించింది. అది పాకిస్థాన్ రెండుగా చీలిపోడానికి, బంగ్లాదేశ్ అవతరణకు దారితీసింది. ఈ యుద్ధంలో 97000 మంది పాకిస్థాన్ సైన్యాధికారులు, సైనికులు ఇండియాకు బందీలుగా పట్టువడ్డారు. ఇంతటి ఘన విజయ సంకేతంగా అమర్ జవాన్ జ్యోతిని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1971 జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం నాడు ఇండియా గేట్ వద్ద నెలకొల్పారు. అక్కడికి సమీపంలో జాతీయ యుద్ధ స్మృతి చిహ్నాన్ని 2019 ఫిబ్రవరి 25న ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.

ఇక్కడ 25,942 మంది అమర సైనికుల పేర్లను చెక్కారు. అమర్ జవాన్ జ్యోతిని, నేషనల్ వార్ మెమోరియల్ జ్యోతిలో కలపడాన్ని కొందరు మాజీ సైనికాధికారులు, ప్రతిపక్ష నేతలు విమర్శించారు. ఇండియా గేట్ వద్ద గల అమర్ జవాన్ జ్యోతి భారతీయ ఆత్మ అని, మీరు, నేను, మన తరమంతా అక్కడి వీరజవానులను స్మరిస్తూ, వందనాలర్పిస్తూ వచ్చామని వైమానికదళ మాజీ వైస్ మార్షల్ మన్మోహన్ బహదూర్ ప్రధాని మోడీనుద్దేశించి ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ దీనిని జ్యోతి విలీనంగా కాకుండా ఆర్పివేయడంగానే పరిగణిస్తున్నది. తాము అధికారం లోకి వచ్చిన తర్వాత అమర్ జవాన్ జ్యోతిని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. అమర్ జవాన్ జ్యోతిని ఆర్పివేయడమంటే చరిత్రను చెరిపివేయడమేనని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మనీష్ తివారీ అన్నారు. బంగ్లాదేశ్ అవతరణకు కారణమైన 1971 భారత పాక్ యుద్ధంలో మన సైనికుల వీరోచిత పాత్ర చిరస్మరణీయమైనది. అంతటి గొప్ప యుద్ధ విజయానికి గుర్తుగా ఏర్పాటు చేసిన అమర్ జవాన్ జ్యోతిని అక్కడి నుంచి తరలించి వార్ మెమోరియల్ లో కలపవలసి రావడంలోని సదుద్దేశం ఏమిటో అర్ధం కావడం లేదు.

కాంగ్రెస్ పార్టీ ఖాతాలోని ఘన చరిత్రను తుడిచిపెట్టడమే దాని ఆంతర్యమైతే అది క్షమించరాని దుష్ట రాజకీయమే అవుతుంది. చరిత్రను ఎవ్వరూ చెరిపేయలేరనే సంగతిని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా ప్రధాని మోడీ ప్రభుత్వం ఆనాటి బంగ్లా యుద్ధ విజయం ఘనతను మరింత పెంచిందనే చెప్పాలి. పంజాబ్ జలియన్ వాలాబాగ్‌లో 1919లో బ్రిటిష్ జనరల్ డయ్యరు సృష్టించిన దారుణ మారణకాండ స్మృతి చిహ్నాన్ని అందగిస్తూ గత ఆగస్టులో ప్రధాని మోడీ ఆవిష్కరించిన కొత్త మెమోరియల్ ను సుప్రసిద్ధ చరిత్రవేత్తలు విమర్శించారు. ఇది జలియన్ వాలాబాగ్ ఘటన కఠోర వాస్తవికతను చెరిపివేయడమేనని విమర్శించారు. జలియన్ వాలాబాగ్‌లో 1919 ఏప్రిల్ 13 తేదీన జరిగింది ఏమిటో అందరికీ తెలుసు.భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో అత్యంత విషాదకర ఘట్టమది. ఆ రోజున బ్రిటిష్ జనరల్ డయ్యర్ దళాలు అక్కడ సమావేశమైన జనంపై, ప్రాణాలరచేత పట్టుకొని పారిపోడానికి వీలులేని చోట విచక్షణ రహితంగా కాల్పులు జరిపి సృష్టించిన మారణకాండ తెలిసిందే. ఆ దారుణానికి స్మారకంగా ఉన్న ఆ స్థలానికి కొత్తరూపు ఇచ్చి ప్రధాని మోడీ గత ఆగస్టులో దాన్ని జాతికి అంకితం చేశారు.

మరమ్మత్తుల కోసం దానిని ఏడాదిన్నర పాటు మూసి వుంచారు. తీరాచూస్తే జలియన్ వాలాబాగ్ దారుణ ఘటనకు సంబంధించిన చరిత్రను వక్రీకరిస్తూ ఆ కొత్తరూపు ఉన్నదని ప్రఖ్యాత చరిత్రకారులు విమర్శించారు. రెగినాల్ డయ్యర్ దళం కాల్పుల నుంచి తప్పించుకొనే మార్గం లేక జనం దూకేసిన బావిని పారదర్శకమైన గోడతో కప్పేశారని, ఆ స్థలానికి గల సన్నని ప్రవేశానికి శిల్పాలు అమర్చారని, ఆ నాటి ఘటనను వివరించే ఆకర్షణీయమైన ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని భయానక చరిత్రను అందంగా తీర్చిదిద్ది వక్రీకరణకు పాల్పడ్డారని చరిత్రకారులు విరుచుకుపడ్డారు. జలియన్ వాలాబాగ్‌ను సందర్శించేవారు బాధతో వేదనతో అక్కడి నుంచి రావాలని అందుకు బదులుగా వినోద విలాస స్థలంగా దానిని మార్చి వేశారని అభ్యంతరం తెలియజేశారు. పాలకులు చరిత్రలో జోక్యం చేసుకునేటప్పుడు ఎంతో విజ్ఞతతో వ్యవహరించాలి. భావితరాల కళ్ళకు గంతలుకట్టే నిర్వాకానికి పాల్పడరాదు. అమర్ జవాన్ జ్యోతిని 1971 యుద్ధ ఘన విజయానికి చిహ్నంగా కొనసాగనిచ్చి వుంటే ఎంతో బాగుండేది. దానిని జాతి మొత్తం గర్వించదగిన చరిత్రాత్మక విజయ జ్యోతిగా కాకుండా, కాంగ్రెస్ పార్టీకి చెందినదిగా చూసి ఇలా చేసి ఉంటే అది ఎంతమాత్రం క్షంతవ్యం కాదు.

Amar jawan jyoti at india gate merged with eternal flame