Monday, June 23, 2025

చెరిపేస్తే చెరిగిపోయేవి కావు కెసిఆర్ ఆనవాళ్లు:వేముల ప్రశాంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

ప్రపంచం గర్వించదగ్గ నిర్మాణాలు చేపట్టడం కెసిఆర్‌కే సాధ్యమని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ వేముల ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కెసిఆర్ ఆనవాళ్లను చెరిపేస్తా అని చెప్పిన వాళ్లు, ఇప్పుడు ఆ ఆనవాళ్ళనే ప్రపంచానికి చూయించుకునే పరిస్థితి ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదాద్రి దేవాలయం కెసిఆర్ హయాంలో నిర్మించిన తెలంగాణకు తలమాణికాలు అని, అవి గొప్ప నిర్మణాలు అని, చేరిపేస్తే చేరిగిపోవడానికి మట్టి రాతలు కాదని అన్నారు.అవి తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం శాశ్వతంగా నిలిచిపోయే కెసిఆర్ ఆనవాళ్లు అని తెలిపారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన పోటీదారులతో తెలంగాణ గొప్ప తనం ప్రపంచానికి తెలిసేలా చేయడానికి కెసిఆర్ కట్టించిన ఆ నిర్మాణాలు రాచరిక పోకడలు అని మాట్లాడి, తెలంగాణ చిహ్నం నుండి తొలగించాలి అనుకున్న చార్మినార్,కాకతీయ కళా వైభవాలే ఈ ప్రభుత్వానికి దిక్కు అయ్యాయని విమర్శించారు.

అలాగే తెలంగాణ అమరుల త్యాగం తెలంగాణ ప్రజల గుండెల్లో నిరంతరం జ్వలించేలా కెసిఆర్ కట్టించిన అమరుల స్మారక జ్యోతి చిహ్నం, బడుగు బలహీన వర్గాల కోసం పని చేయాలని పాలకుల్లో స్ఫూర్తిని నింపే విధంగా కెసిఆర్ కట్టిన 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహ ప్రాంగణాలను కూడా మిస్ వరల్డ్ పోటీదారులకు చూయిస్తే తెలంగాణ చరిత్ర,అమరుల త్యాగం,రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ గొప్పతనం విశ్వవ్యాప్తం అవుతుందని సూచించారు. రాష్ట్రం దివాళా తీసింది…ఎక్కడా అప్పు పుట్టటం లేదు.. కేంద్రంలో తనను చెప్పులు ఎత్తుకు పోయేవాడి లాగా చూస్తున్నారు అని సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని, కానీ అందాల పోటీల పేరుతో వందల కోట్ల దుబారా ఖర్చు ఎందుకు చేస్తున్నట్లు..? అని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తారని అన్నారు. రేవంత్‌రెడ్డి పరిపాలనతో విసుగు చెందుతున్న ప్రజలే ఆయన రాజకీయ ఆనవాళ్లు తెలంగాణ నుండి శాశ్వతంగా చేరిపేస్తారని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News