Home ఎడిటోరియల్ కలవర పరుస్తున్న అమెజాన్

కలవర పరుస్తున్న అమెజాన్

amazonవర్షాలు అధికంగా కురిసే విస్తారమైన అమెజాన్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు వ్యాపిస్తోంది. ఈ ప్రాంతం 55 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కార్చిచ్చు వ్యాపించడంవల్ల బ్రెజిల్ తూర్పున సముద్ర తీరం అంతా దట్టమైన పొగలతో నిండిపోయింది. ఆ ప్రాం తంలోనే జనం ఎక్కువగా నివసిస్తారు. జీవ వైవిధ్యానికి పేరుపడ్డ ఈ ప్రాంతంలో 2018తో పోలిస్తే ఈ ఏడాది అత్యధికంగా 74,000 సార్లు అడవికి నిప్పంటుకుంది. అడవులు అంటుకోవడం 84 శాతం పెరిగిందని బ్రెజిల్ అంతరిక్ష పరిశోధనా సంస్థ అంచనా. అడవులు అంటుకోవడం కొత్త కాదు. వేసవిలో అడవులు అంటుకోవడం పరిపాటే. కానీ ఈ సారి కార్చిచ్చు చాలా తీవ్రంగా ఉంది. ప్రపంచమంతా కలవరపడేట్టు చేస్తోంది.

ఈ ఏడాది పది అమెజాన్ మునిసిపాలిటీల్లో ఈ కార్చిచ్చు ప్రభావం ఎక్కువగా ఉందని అమెజాన్ పర్యావరణ పరిశోధనా సంస్థ అంటోంది. ఈ ప్రాంతాలన్నింటిలో అడవులు అంతరిస్తున్నాయి. ఈ కార్చిచ్చుకు 2016లో అనావృష్టి కూడా ప్రధాన కారణం. అయితే అనావృష్టివల్ల , లేదా సహజ పరిణామాలవల్ల కార్చిచ్చు వ్యాపిస్తోందన్న వాదనను తిరస్కరించాలని అమెజాన్ పర్యావరణ పరిశోధనా సంస్థ చెప్తోంది. అనావృష్టి ఉన్నప్పటికీ గత మూడేళ్లుగా అమెజాన్ ప్రాంతంలో గాలిలో తేమ సగటుకన్నా ఎక్కువగానే ఉంటోందని ఆ సంస్థ అంటోంది. అడవులు అంతరించడంవల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని ఆ సంస్థ అంచనా.

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోకు శీతోష్ణ స్థితి శాస్త్రం మీద గానీ, అటవీ సంరక్షణ మీద గానీ విశ్వాసం లేదు. బ్రెజిల్ లో అడవులు అంతరించడం చాలా ఎక్కువగా ఉందని బ్రైజిల్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం అధిపతి రికార్డో గాల్వావో ఆగస్టు ఆరంభంలోనే హెచ్చరించారు. అమెజాన్ లో 2,072 చదరపు కిలోమీటర్ల మేర అడవులు అంతరించాయని ఆయన 2019 జూన్ లోనే చెప్పారు. ఇంత మేర అడవులు అంతరించడం అంటే మాలి దేశ విస్తీర్ణం అంత ప్రాంతంలో అడవులు మాయమయ్యాని అర్థం. బోల్సనారో ఈ వాదన పచ్చి అబద్ధం అని వాదించి గాల్వావోను తొలగించారు. బ్రెజిల్ పర్యావరణ సహజ వనరుల పునరుత్పాదక సంస్థకు 2019 మొదటి ఆరు నెలల కాలానికి బోల్సొనారో నిధుల్లో 20 శాతం కోత పెట్టారు. బ్రెజిల్ పర్యావరన సహజ వనరుల పునరుద్ధరణ సంస్థ అధికారుల నిబంధనలు అత్యాశగా ఉన్నాయని విమర్శించారు. ‘వారు రెండు చేతుల్లో రెండు కలాలు పట్టుకుని వచ్చి విపరీతమన నిధులు కావాలని అడుగుతారు‘ అన్నారు.

అడవులు నరికే రంగానికి, గనులు తవ్వే పరిశ్రమకు, వ్యవసాయోత్పత్తుల పరిశ్రమకు చెందిన వారికి అమెజాన్ లో ఉన్న స్థానికులు పెద్ద అడ్డంకిగా కనిపిస్తున్నారు. అడవిని అమ్మకం సరుకుగా మార్చడాన్ని స్థానికులు ప్రతిఘటిస్తున్నారు. 1988 బ్రెజిల్ రాజ్యాంగం ప్రకారం ప్రధానంగా అమెజాన్ లో స్థానిక నివాసులకు అనేక రక్షణలు కల్పించారు. అమెజాన్ అడవుల్లో నివసించే వారు బ్రెజిల్ మొత్తం జనాభాలో 0.06 శాతం ఉంటారు. అమేర్ ఇండియన్ల పట్ల బోల్సనారో, ఆయన వత్తాసు దారులు నరహంతక వైఖరి అనుసరిస్తున్నారు. బోల్సనారో కరడుగట్టిన మితవాద రాజకీయ నాయకుడు. అమెజాన్ లో స్థానిక ప్రజలు ‘నరహత్య‘ పరిస్థితులను ఎదుర్కుంటున్నారని యవనావా తెగకు చెందిన తాష్కా యవనావా అంటున్నారు.

అమెజాన్ లో కార్చిచ్చు వ్యాపించడానికి ప్రభుత్వేతర సంస్థల యథాతథ విధానాలే కారణమని బోల్సనారో వాదిస్తున్నారు. బ్రెజిల్ ను ఇరుకున పెట్టడానికి, తన వ్యాపార అనుకూల వైఖరిని వ్యతిరేకించడానికి వాళ్లే అడవులకు నిప్పంటించారని బోల్సనారో అంటున్నారు. ఆయన వాదన నమ్మడానికి ఆధారాలేమీ లేవు. రెచ్చగొట్టడానికి బ్రెజిల్ అధ్యక్షుడు చేసే ప్రయత్నాల్లో ఇది మరొకటి మాత్రమే.

ఆగస్టులో రెండు వారాల కాలంలో బోల్సనారో మీద వ్యతిరేకత విపరీతంగా పెరిగింది. బ్రెజిల్ అంతటా భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. రియో డి జెనేరియో, సావో పావ్లోవోలో ఈ నిరసనలు మరింత విపరీతంగా వ్యక్తమైనాయి. ‘అమెజాన్ ప్రజలది, అమెజాన్ ఉంటుంది, బోల్సనారో వెళ్లిపోతారు‘ అన్న నినాదాలు మిన్నంటాయి. బోల్సనారోకు ఉన్న మద్దతు త్వరితంగా తగ్గుతోంది. ఈ ప్రభుత్వం ఘోరమైంది, దుష్టమైంది అని అభిప్రాయపడ్డారని సి.ఎన్.టి./ఎం.డి.ఎ. ప్రజాభిప్రాయ సేకరణ సర్వేలో తేలింది. గత జనవరిలో ఆయనను సమర్థించే వారు 38.9 శాతం అయితే ప్రస్తుతం వారు 29.4 శాతానికి తగ్గారు. అమెజాన్ కార్చిచ్చు, బోల్సనారో ఆశాస్త్రీయ వైఖరి, నిరసనల వల్ల ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.

యూరప్ నుంచి బహిరంగంగా విమర్శలు ఎదురు కావడంతో పరిస్థితి మరింత దిగజారింది. వాణిజ్య, విధానపరమైన లక్ష్యాలకు విఘాతం కలుగుతోంది. బ్రెజిల్ నుంచి పశు మాంసం దిగుమతి చేసుకోకూడదని యూరప్ రైతులు యూరప్ సమాజం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఇదే విఘాతం కలిగించేదైతే అర్జెంటీనా, బ్రెజిల్, పెరాగ్వే, ఉరుగ్వే, వెనుజులాతో కూడిన వాణిజ్య సముదాయమైన మెర్కోసర్ తో సంబంధాలు తెంచుకుంటామని యూరప్ సమాజం హెచ్చరించింది. బ్రెజిల్ ను ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఒ.ఇ.సి.డి.)లో చేర్చాలని బోల్సనారో భావించారు. 36 దేశాలతో కూడిన ఒ.ఇ.సి.డి. తమ దేశాలు అభివృద్ధి చెందినవని భావిస్తోంది. ప్రస్తుతం బ్రెజిల్ ఈ కూటమిలో చేరడం సాధ్యం కాకపోవచ్చు.

అమేజాన్ సంక్షోభాన్ని చర్చించడానికి ఫ్రాన్స్ లో జి.7 దేశాల ప్రత్యేక సమావేశం జరిగింది. బోల్సనారోతో సన్నిహితంగా మెలిగే అమెరికా అధ్యక్షుడు డోనాల్ ట్రంప్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. అమెజాన్ కార్చిచ్చును ఆపడానికి జి్-7 బృందం నామ మాత్రంగా 20 మిలియన్ డాలర్ల సహాయం ప్రకటించింది. అయినప్పటికీ జి-7 దేశాల స్పందన నామ మాత్ర సహాయానికి సంబంధించిందే తప్ప అమెజాన్ అడవుల ప్రాధాన్యతను గుర్తించలేదు. అక్కడ నివసించే ప్రజలను కూడా పరిగణనలోకి తీసుకోలేదు.

మరో వేపున బ్రెజిల్ అగ్ని కీలలు బొలీవియాలోకి కూడా ప్రవేశించాయి. బొలీవియా అధ్యక్షుడు ఎవో మొరేల్స్ మంటలను ఆర్పడానికి భారీ ట్యాంకర్ తెప్పించారు. బొలీవియాలో భూ మాతను మనుషులతో సమానంగా భావించే చట్టం ఉంది. బ్రెజిల్, బొలీవియా దేశాల వైఖరుల మధ్య ఉన్న విభేదాన్ని గమనిస్తే రాజకీయ-సైద్ధాంతిక విధానాలే జీవావరణ, మానవ సంక్షోభం పట్ల అనుసరించవలసిన వైఖరిని నిర్దేశిస్తున్నాయని రుజువు అవుతోంది. అమెజాన్ ను రక్షించాలంటే న్యాయమైన సామాజిక వ్యవస్థ ఏర్పడవలసిన ఆవశ్యకత నుంచి విడదీసి చూడలేం.

Amazon Forest Fire

* (ఇ.పి.డబ్ల్యు.సౌజన్యంతో)