Home లైఫ్ స్టైల్ సమగ్ర జలవిధాన విధాత…

సమగ్ర జలవిధాన విధాత…

Ambedkar

 

బహుళార్ధ సాధక
ప్రాజెక్టుల వ్యూహకర్త

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ తన జాతి ప్రజల సమానత్వం కోసం ఎంత కష్టపడ్డాడో దేశ భవిష్యత్తు నిర్మాణానికి అంతకంటే ఎక్కువ సమయాన్ని జ్ఞానాన్ని వెచ్చించి శ్రమించాడు. సాంకేతిక సమస్యల పట్ల ఆయనకున్న పట్టు, లోతైన అవగాహన చెప్పుకోదగినవి.

1942-46 కాలంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో కార్మిక, ప్రజా పనుల మంత్రిత్వ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జాతికి నేడు వెన్నుముక గా వున్న రెండు సాంకేతిక సంస్థలను స్థాపించాడు. అందులో ఒకటి ఇప్పటి సెంట్రల్ వాటర్ కమిషన్ కి, జలవిధానానికి కారణమైన సెంట్రల్ వాటర్‌వేస్ ఇరిగేషన్ అండ్ నావిగేషన్ (CWINC) సంస్థ, రెండవది Central Techni cal Power Board (CTPB)/ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA).
అంబేడ్కర్ తాను చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో సమగ్రతను సాధించాడు. జలమార్గాల ఆవశ్యకత, నదుల అనుసంధానం అవసరాన్ని, వాటర్ పాలసీ,దామోదర్ వ్యాలీ, హీరాకుడ్, సోనీ రివర్ ప్రాజెక్టుల నిర్మాణంలో తాను చూపించిన దార్శనికత తర్వాత వచ్చిన బహుళార్ధ సాధక ప్రాజెక్టులకు ఆదర్శంగా నిలిచాయి.

అంబేద్కర్ అనుభవం, జ్ఞానం ప్రభుత్వానికి అవసరమని భావించి ఆయనను కార్మిక, ప్రజా పనుల మంత్రిత్వ శాఖకు మంత్రిగా వైస్రాయి (గవర్నర్ జనరల్) ను నియమించి బ్రిటిష్ ప్రభుత్వం చేత ఆమోదింప చేశాడు.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత యుద్ధంలో పాల్గొన్న అన్ని దేశాలూ నష్ట నివారణ, పునర్నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇండియాదీ అదే పరిస్థితి. ఈ పునర్నిర్మాణంలో భాగంగా ప్రాజెక్టుల నిర్మాణం దేశ అవసరాల రీత్యా అనివార్యమైంది. ఈ పరిస్థితిలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ప్రాజెక్టులకు పరిపూర్ణ నిర్వచనం ఇచ్చాడు. ప్రాజెక్టులంటే వరద నివారణకు మాత్రమే అన్నట్లుగా ఉండే మూస ధోరణిని కాదని బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. అలా ప్రతిపాదించిన వాటిలో దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలిచింది.1942 లో,భారత ప్రభుత్వ చట్టం (1935) ప్రకారం నీరు, విద్యుత్తు రాష్ట్రాలు, సంస్థానాల కింద ఉండేవి. అందువల్ల కేంద్రానికి నీరు, విద్యుత్ లాంటి విషయాలలో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి పరిమితులుండేవి. కానీ దేశ పునర్నిర్మాణ కార్యక్రమంలోని వెసులుబాటును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చక్కగా సద్వినియోగం చేసుకొని చిన్న చిన్న ఆనకట్టల స్థానంలో బహుళార్ధ సాధక ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలను రూపకల్పన చేశాడు.

భారతదేశ ఆర్థిక అభివృద్ధి గురించి అంబేద్కర్ కి ఒక ఖచ్చితమైన దార్శనికత ఉంది .ఆర్ధిక స్థితిగతుల మెరుగుకు సహజ వనరుల సంపద ఉపయోగపడుతుందని నమ్మాడు, అందుకే అంబేద్కర్ దృష్టిలో నీరు జాతీయసంపద. సహజవనరులను పొదుపుగా, సమతుల్యంగా ఉపయోగించుకోవాలి అని ఆశించాడు. భూమిని, జీవనోపాధిని కోల్పోయే పేదవారి ఆర్థిక స్థితిగతులు పెంచడానికి ప్రాజెక్టులు ఉపయోగపడాలని ఆశించాడు. బెంగాల్ రాష్ట్రప్రభుత్వం దామోదర్ నది వరద సమీక్షా కమిటీని వేసింది. 3 జనవరి 1944 నాడు బెంగాల్ సచివాలయం దీనికి సంబంధించి ఒక సదస్సు ఏర్పాటు చేసి దానికి అంబేడ్కర్‌ను ఆహ్యానించింది. దీనిలో పాల్గొన్న అంబేడ్కర్, జల వనరుల రక్షణ, సద్వినియోగం చేసుకోవడం కోసం ఒక జాతీయ విధానాన్ని తీసుకొచ్చే యోచనలో భారత ప్రభుత్వం ఉందని చెప్పి, దాని అవశ్యకతను వివరించాడు. నదులను, అడవులను కేంద్రం పరిధిలోకి తేవడం ద్వారా అంతర్రాష్ట్ర సమస్యలను సోయిల్‌కన్వర్జేషన్(భూసారాన్ని రక్షించడం ) సమస్యలను పరిష్కరించడం ఎలా తేలిక అవుతుందో వివరించాడు.

Ambedkar,

 

వివిధ దేశాల్లో పరిణామాలు, భారత దేశ భౌగోళిక, పర్యావరణ పరిస్థితులు తెలిసిన వ్యక్తిగా భవిష్యత్‌లో తలెత్తే నీటి కొరతను అధిగమించేందుకు ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు అంబేడ్కర్. నదులలో నీటిని ఒడిసి పట్టుకోవడం వల్ల దేశం లోని వివిధ ప్రాంతాల్లో మంచినీరు, సాగునీరు కొరతను అధిగమించమించవచ్చని వివరించాడు. అయితే, ఈ ప్రాజెక్టుల వల్ల పర్యావరణానికి ఎంత ముప్పు వాటిల్లుతుందనేది కూడ ముఖ్యం, ఎందుకంటే అభివృద్ధి , పర్యావరణం ఒకే నాణేనానికి రెండు ముఖాల్లాంటివి. ఈ లోతైన అవగాహనతో అంబేడ్కర్ ఈ రెండు అంశాల్ని (అడవులు, నీళ్ళు) రాజ్యాంగం ఉమ్మడి (Article 262) 7 వ Schedule లో మొదటి( I) జాబితా) లో 56వది గా చేర్చారు. అంతే కాకుండా ప్రాజెక్ట్ అనేవి ఒక్క వరదల బారినుండి రక్షించేందుకో, వ్యవసాయ, విద్యుత్ అవసరాలకో కాదని వాటి ద్వారా జల మార్గాలను ఏర్పరుచుకోవాలని సూచించాడు. రైల్వేస్ లాగానే వాటర్ వేస్ (జల మార్గాలు)ఉండాలని ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించినందుకు ఆ సదస్సులో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ను అభినందించారు. దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు నిర్మాణం కోసం CWINC, CTPBలే కాదు స్థానికంగా తలెత్తే సమస్యలను పరిష్కరించి ఎదుర్కోవడానికి ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేశాడు. దీనికి మాన్సింగ్ నాయకత్వం వహించాడు.

అంబేడ్కర్ మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో బెంగాల్ -బీహార్‌లు సంయుక్తంగా తీసుకున్న చొరవ భారతదేశంలో తర్వాత చేపట్టిన బహుళార్ధ సాధక ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆదర్శంగా,దిక్సూచిగా నిలిచింది. జలవనరులను జాతీయ పరిధిలోకి తీసుకు రాకపోతే నీటిని, విద్యుత్తును వినియోగించుకోవడంలో రాష్ట్రాల, ప్రాంతాల మధ్య వివాదాలు తలెత్తగలవని అంబేడ్కర్ ఆనాడే పసిగట్టి వివరించారు. రాష్ట్రాలలో అంతర్రాష్ట్ర ప్రాజెక్టులలో పెట్టుబడి, ఉపయోగాలను బేరీజు వేసుకొని ఉమ్మడి ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ఆసక్తిని చూపబోవని గ్రహించి ఇలాంటి వివాదాలను రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాలు వాడుకుంటాయని ప్రాంతాల మధ్య ద్వేషాన్ని రగుల్చుతాయని భావించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వివరించిన తీరును సమావేశం మినిట్స్ లో చూడవచ్చు. ఇది దేశ ఐక్యతకు విఘాతం కలిగిస్తుందని ఆనాడే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ హెచ్చరించాడు.ఈ వివాదాలు రావద్దంటే అడవులు, నదులు(జల వనరులు) జాతీయ పరిధిలో ఉండటం ఒక్కటే పరిష్కారమని నొక్కి వక్కణించారు. ఆధిపత్య వర్గాల పెత్తనంలో సహజ వనరులు కేంద్రీకృతం అయిఉన్న సంగతి మరు వొద్దన్నారు. అందుకే తరువాత రాజ్యాంగ రచనలో అడవులను, అంతర్ రాష్ట్రాల మధ్య నిర్మించే ప్రాజెక్టులను ఏడవ షెడ్యూల్‌లో (ఉమ్మడి జాబితా) చేర్చి తన దూరదృష్టిని నిరూపించుకున్నాడు.

1944 మార్చిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెంట్రల్ వాటర్‌వేస్ అండ్ ఇరిగేషన్ కమిషన్ (CWINC)ని వైస్రాయ్ ఆఫ్ ఇండియా చేత ఆమోదింప చేసి 1946 ఏప్రిల్ 5న దానిని స్థాపించాడు. దామోదర్ వ్యాలీ, సోనీ రివర్ లాంటి బహుళార్ధ సాధక ప్రాజెక్టులలో తలెత్తే సమస్యలను పరిష్కరించి వాటిని ఈ సంస్థ ద్వారా నిర్మించి అంబేడ్కర్ దేశ పురోభివృద్ధికి ఒక ఇంజినీర్ లాగా తన శయాశక్తుల కృషి చేసిండు. దేశ సమగ్రాభివృద్ధికి ఇంత శ్రమించిన బాబాసాహెబ్ ను పీడితుల నాయకునిగానే గుర్తించారు కానీ ఏనాడూ జాతీయ నాయకుని(Statesman)గా ఈ దేశ ఆధిపత్య వర్గాలు గుర్తించలేదు. అందుకు పలు సంస్థలకు /చరిత్రకారులకు మనుసొప్పలేదు, కాని ప్రపంచం ఆయనను గుర్తించింది.
బహుళార్ధక హీరాకుడ్ ప్రాజెక్టు నిర్మాణానికి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చాలా మద్దతు ఇచ్చాడు. అర్ధర్ కాటన్ 1858లో

ఒరిస్సాలోని మహానదిని సందర్శించి వరదల నివారణ, సలహాలు, సూచనలు ఇచ్చాడు. 1928 నుండి 35 వరకు చాలా కమిటీలు నివేదికలు ఇచ్చాయి. 1937లో ప్రముఖ ఇంజినీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య (Sir MV) కు ఈ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసే బాధ్యతను అప్పగించారు.
1938లో ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆ తర్వాత రెండు మధ్యంతర (Interim) నివేదికలు ఇచ్చాడు. తుది రిపోర్ట్ 1945లో సమర్పించాడు.
అప్పుడు ఒరిస్సా ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రముఖ జాతీయ నాయకుడు ‘హెచ్ మహాటాక్‘ కూడా అంబేడ్కర్‌ను కలిసి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా కోరారు.
వారి అభ్యర్థన మేరకు 8 నవంబర్ 1945లో మినిస్టర్ ఆఫ్ లేబర్ డిపార్టుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అంబేడ్కర్ ఓ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాడు.

ఈ ప్రాజెక్ట్‌ను ఏ కోణంలో చూడాలి, స్థల ప్రాంతం, ఒరిస్సాలోని పేదరిక నిర్మూలనకు ఇది ఎలా దోహదం చేస్తుందో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వివరించాడు. అంబేడ్కర్ చొరవతో 1953లో పూర్తయిన అతి పొడవైన ఈ ప్రాజెక్ట్‌ను 1957లో ప్రారంభించారు. లేబర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇది నిర్మించబడింది. సోనే నది మధ్యప్రదేశ్ లో పుట్టి ప్రవహించి ఉత్తరప్రదేశ్‌లోని గంగలో కలుస్తుంది.డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సారథ్యంలోని లేబర్ డిపార్ట్మెంట్ జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సోనే నది మీద ప్రాజెక్టు నిర్మాణం పట్ల సానుకూలంగా స్పందించి పూర్తి చేసింది.

రాష్ట్రాలు పరస్పరం సహకరించుకొని ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తి చేయాలని అంబేడ్కర్ విజ్ఞప్తి చేశాడు. వ్యవసాయేతర అవసరాలకు నీటి వాడకం గురించి సెంట్రల్ యుటిలైజేషన్ (వినియోగ) బోర్డ్ / కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ లాంటివి, CWINC & CTBP ప్రణాళికలు త్వరితగతిన అమలు చేయడానికి ఉపయోగపడతాయని అంబేడ్కర్ సూచించిండు
CWINC& CTBP ఏర్పాటు భారతదేశపు జలవనరులను రక్షించి, నీటిని పొదుపుగా వాడి భవిష్యత్తరాలకు అందించటానికి వేసిన మొదటి అడుగు. నీటి కొరత సంభవించే పరిస్థితి ని ముందే గ్రహించి నదులపై బాహుళార్థక ఆనకట్టల నిర్మాణం , భూసారాన్నికాపాడుకోవడం సరైన రీతిలో నీటిని వాడుకోవడం లో ఒక ఇంజనీర్, సైంటిస్ట్ లా ఆలోచన చేసి అమలు చేసిండు అంబేడ్కర్.
కానీ, Institute of Engineering, India(IEI) ఏనాడూ అంబేడ్కర్ ను గుర్తించలేదు, ఆయన మీద స్మారకోపన్యాసలు ఏర్పాటు చేసి గౌరవించిన దాఖలాలు కనపడవు.

అభివృద్ధికి సహజవనరులకు అవినాభావ సంబంధం ఉంది అన్నాడు అంబేడ్కర్. ప్రభుత్వం ట్రస్టీగా మాత్రమే ఉండాలన్నాడు. వర్గాలు, కులాలు, మతాలుగా విడిపోయిన ప్రజలను సాధారణంగా ఒక సమాన ఆర్థిక స్థితికి తీసుకురావటం కష్టం, కానీ జల వనరుల సద్వినియో గం(సహజవనరులను )- ద్వారా జలమార్గాల ఆధారంగా కచ్చితమైన ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చని నమ్మి ఆచరించి అమలు చేసిన ఒక సమగ్ర జాతీయ జల విధాన-రూపకర్త, దార్శనికుడు డాక్టర్ అంబేడ్కర్.

Ambedkar, Planning Strategy for Multipurpose Projects