Saturday, April 20, 2024

అక్షరమై పలకరిస్తున్న ‘అంబర్‌పేట’ చరిత్ర

- Advertisement -
- Advertisement -

అంబర్‌పేట నేలపై జన్మించి అంబరమంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తులు జస్టిస్ సుభాషణరెడ్డి, వి.హనుమంతరావు వంటి వాళ్ళ గురించీ, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అమర స్థూపమైన నందరాజ్‌గౌడ్, పహిల్వాన్ కాస్త రౌడీషీటర్‌గా ముద్రపడిన శంకర్‌ల గురించీ రికార్డు చేయడం అవసరమే. కళ్ళు లేని లింగయ్య పిల్లం గోవి పాటల్ని ‘చూపున్న పాట’గా కెఎన్‌వై పతంజలి రూపుకట్టిస్తే, తన ఆకలి గానాన్ని ‘కుంటపై విరిసిన నల్లకలువ’గా ఈ పుస్తకంలో పరిమళింజేశాడు పవనుడు.

ఎలెక్స్ హేలీ ‘ఏడుతరాలు’ రాయడానికి, కోడం పవన్‌కుమార్ చేతుల్లో ‘ఆకాశానికి పూచిన మందారం అంబర్‌పేట’ ఆకృతి దాల్చడానికి ప్రేరణ ఒకటే. తనని తాను పరిపూర్ణంగా తెలుసుకోవాలనే తలంపు. తెలుసుకోవాలంటే… ముందు నా ముందుతరం నడిచిన దారులు ఏవో వెదకాలి. ఎందుకు వెదకాలని ప్రశ్నించుకుంటే, నడుస్తున్న చరిత్రకు నడిచిన చరిత్రే ఆలంబన. గతం లేకపోతే వర్తమానం లేదు. భవిష్యత్తూ ఉండదు. అలా, నేటి తన ఉనికికి కారణమైన పూర్వీకులను తలచుకుని తెలుసుకోవడమైనా, తాను పుట్టి పెరిగిన ప్రాంతం కాలానుగతంలో లోనయిన మార్పును వెలికితీయడమైనా అందుకే. అంబర్‌పేట శాసనసభ పరిధిని అక్షరమయం చేయడం వల్ల అది చరిత్రపుటలో శాశ్వతంగా నిలిచిపోయింది. పరిణామక్రమంలో మార్పు అనివార్యం. అయితే మార్పు వల్ల చోటు చేసుకున్న పరిణామాలు ముఖ్యం. అభివృద్ధి పేరుతో ధ్వంసం అయిందా? ఆ ఫలాలు ఎవరికి దక్కాయి? సామాన్యుడి చోటెక్కడ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ పుస్తకంలో దొరకుతాయి.

హైదరాబాద్ పట్టణంలో వాడ వాడకూ ఓ పేరుంది. ఆ పేరు పుట్టుకకు కారణం తెలియకుండా, తెలుసుకోవాలన్న కుతూహలం లేకుండా అక్కడి ప్రజలు జీవనం సాగిస్తుంటారు. ఆ దారులగుండా నడుస్తూవుంటా రు. అయితే, వాటి జన్మరహస్యాలు తెలిసినప్పుడు కలిగే సంభ్రమాశ్చర్యాలను ఏ కొలమానంతోనూ కొలువలేము. తాతల పేర్లు తెలియని తరానికి, వంశవృక్షం లభించినంత ఆనందం కలుగుతుంది. ఈ పుస్తకంలో అలాంటి అనుభూతులు కోకొల్లలు. హైదరాబాద్ ఏర్పడకముందే కుగ్రామంగా ఉండి, ఇప్పుడు అంతర్భాగంగా ఉండడం వెనుక ఉన్న ఏళ్ల చరిత్రను వెలికితీయడం మామూలు విషయం కాదు. కాకతీయులు, కుతుబ్‌షాలు, అసఫ్‌జాహీలు నడిచిన ఈ నేలను వొడిసిపట్టడం అంత తేలికేం కాదు. చరిత్ర అట్టడుగు పొరల్లో చిక్కుకుపోయిన సూఫి ప్రవక్త అంబర్‌మియా ఈ ఆధునిక సమాజానికి పరిచయమవుతాడు. ఆయన జీవసమాధి చుట్టూ అల్లుకుపోయిన గ్రామమిప్పుడు హైదరాబాద్ నగర చరిత్రలో కీలకంగా మారి జ్ఞాపకాలుగా మిగిలిపోయిన సందర్బాలు ఇందులో దర్శనమిస్తాయి. శాసనసభ నియోజకవర్గ పరిధిలోని కీలకమైన కాచిగూడ, నల్లకుంట, అంబర్‌పేట, గోల్నాక, బర్కత్‌పుర ప్రాంతాలు మార్పుకు గురైన తీరుతెన్నులను భూపాల్, షర్మిష్టాదేవి, కె.వి.కృష్ణకుమారి, అజిత్ ఎగ్బోటేల ‘జ్ఞాపకాలు’తో చరిత్రకు ఓ సమగ్రత ఏర్పడింది.

మోయిన్, అంబర్ చెరువులు, నల్లకుంటలు ఎలా కబ్జా కాబడ్డాయో, వాటిని ఆధారంగా చేసుకుని జీవనం సాగించే చాకలి, కుమ్మరి, బెస్త తదితర వృత్తికులాల ఉనికి అక్షరాలలో నిక్షిప్తమయ్యాయి. శారదగాళ్లు వంటి కళాకారులు, కళలు కళ్ళకు కనిపించే అభివృద్ధి సౌధాల పాదాల కింద పడి నలిగి కనిపించకుండా ఎలా పూడ్చబడ్డాయో ఆధారాలతో అక్షరం చేసి చూపించబడింది. సబ్బండవర్ణాల జీవనాధారాలు కూలి పేటలు మాత్రమే మిగిలి, తోటలు కనుమరుగైన రీతిని చిత్రమయం చేసిన తీరు చదువరి హృదయాన్ని బాధతో నులిపెడుతుంది. అంబర్‌పేట నేలపై జన్మించి అంబరమంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తులు జస్టిస్ సుభాషణరెడ్డి, వి.హనుమంతరావు వంటి వాళ్ళ గురించీ, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అమర స్థూపమైన నందరాజ్‌గౌడ్, పహిల్వాన్ కాస్త రౌడీషీటర్‌గా ముద్రపడిన శంకర్‌ల గురించీ రికార్డు చేయడం అవసరమే.

కళ్ళు లేని లింగయ్య పిల్లంగోవి పాటల్ని ‘చూపున్న పాట’గా కెఎన్‌వై పతంజలి రూపుకట్టిస్తే, తన ఆకలి గానాన్ని ‘కుంటపై విరిసిన నల్లకలువ’గా ఈ పుస్తకంలో పరిమళింజేశాడు పవనుడు. హైదరాబాద్ సంస్థానం ఏర్పడిననాటినుంచి నేటివరకు ఎన్నుకోవడ్డ కార్పొరేటర్లు, రాజకీయ నాయకులు, ఎన్నికలపూర్వపరాలు, రాజకీయ పార్టీల తీరుతెన్నులను వివరంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు. శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేటర్లుగా ఎన్నుకోబడ్డవారి ప్రొఫైల్ ఇవ్వడం గొప్ప సమాచార సేకరణగా పేర్కోనవచ్చు. వివిధరంగాలలో లబ్దప్రతిష్టులయిన పురప్రముఖులు, సాహితీవేత్తలు, కళాకారులు ఈ ప్రాంతంతో పెనవేసుకుపోయిన వారిని ఫోటోలతో పరిచయం చేయడం ఈ ప్రాంత విశిష్టతకు పెద్దపీట వేసినట్లయింది. ఇక్కడ కొలువుదీరిన దేవాలయాలు, మసీదులు, చర్చీల పుట్టుకకు వెనుకవున్న చరిత్రను అధ్యయనం చేసి పొందుపరచడం వల్ల వాటి ప్రాముఖ్యత వెలుగులోకి వచ్చినట్లయింది. నిజాం కాలంలో వైభవం సంతరించుకున్న దేవిడీల పూర్వాపరాలను ఈ పుస్తకం ద్వారా తెలుసుకొని ఆశ్యర్యానికి గురవుతాము. ప్రస్తుత వాటి శిధిలస్థితికి వొకింత నొచ్చుకుంటాము. ఆరోగ్యకేంద్రాలు, విద్యాలయాలు, వసతిగృహాలు, రక్షకభట నిలయాలు… ఒకటేమిటి అనేకానేక తెలిసినవి, తెలియనివి స్థానికులకు తెలియపరిచాడు. వీటి ప్రస్తుత స్థితిగతులను ఏకరువు పెడుతూ ప్రజా నాయకుల దృష్టికి తీసుకురాగలిగారు.

కవి, సాహితీవేత్త అయిన పవన్‌కుమార్‌ను అక్కడక్కడ జర్నలిస్టు డామినేట్ చేసినప్పటికీ చదివేవారికి తన శైలి ఎక్కడా బోర్ కొట్టనీయకుండా జాగ్రత్తపడ్డాడు. విశ్లేషణ, వివరణాత్మక కథనాలతో కూడిన ఈ ఆత్మ చరిత్రాత్మక పుస్తకం జంటనగరాల సిగలో విచ్చుకున్న మందారంగా చెప్పుకోవచ్చు. ప్రాంతం పట్ల మమకారం, చరిత్రపైన మక్కువ ఉన్నవాళ్లు తప్పకుండా చదవాల్సిన పుస్తకమిది. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ నగరానికి వలస వచ్చిన వస్తున్నవారికి ఇక్కడి పూర్వాపరాలను ఎరుకజేస్తుంది. తెలంగాణ చరిత్రకు నాభిగా ఉన్న హైదరాబాద్ అంతరంగాన్ని వొడిసిపట్టడం మామూలు విషయం కాదు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల విస్తృతి అనూహ్యంగా పెరిగిపోతుండటంతో ఇప్పటికే 24 శాసనసభ నియోజవర్గాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ తరహాలోనే వీటిపై కూడా పుస్తకాలు రావలసిన అవసరం ఉంది. అంతేకాదు, 119 శాసనసభ నియోజకవర్గాలపై వచ్చినప్పుడే ‘తెలంగాణ చరిత్ర’ పరిపూర్ణమవుతుందని భావిస్తున్నాను. డాక్టర్ ఎస్.జి.ఎస్ ధనుంజయ, చింతల శ్రీనివాస్ ముదిరాజ్‌లు సంపాదకత్వంలో తోడుగా నిలువడంతో ఓ మంచి పుస్తకం పాఠకులకు అందించగలిగారు.

పిన్నంశెట్టి కిషన్
9700230310

 

Amberpet History
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News