Home తాజా వార్తలు సీట్ల పెంపుకై సవరణ!

సీట్ల పెంపుకై సవరణ!

vinodఅసెంబ్లీ స్థానాలు పెంచేందుకు రాజ్యాంగం 170 (3) అధికరణాన్ని సవరించాలి
అందుకోసం కేబినెట్ నోట్‌ను న్యాయశాఖకు పంపాం
ఎంపి వినోద్ లేఖకు లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్

మన తెలంగాణ / హైదరాబాద్/ న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకా రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెం బ్లీ సీట్లను పెంచే అంశానికి సంబంధించి మంత్రివర్గంలో చర్చించే నిమిత్తం ముసాయి దా బిల్లును సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ గంగారాం తెలిపారు. కరీంనగర్ ఎంపి బి.వినోద్‌కుమార్ గతేడాది అక్టోబర్ 12వ తేదీన రెండు అంశాలతో రాసిన లేఖకు మంత్రి ఈ నెల 20వ తేదీన ఇచ్చిన సమాధానంలో పై విధం గా పేర్కొన్నారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉన్నప్పటికీ అటార్నీ జనరల్ మాత్రం రాజ్యాంగంలోని 170వ అధికరణానికి సవరణ చేయాల్సి ఉందని, ఈ సవరణ కూడా విభజన చట్టంలోని సెక్షన్ 26కు అనుగుణంగా ఉండాలని పేర్కొన్నారు. ఆ విధంగా సవరణ జరిగేంత వరకు సీట్ల సంఖ్యను పెంచడం సాధ్యం కాదని అటార్నీ జనరల్ స్పష్టంగా పేర్కొన్నారని మంత్రి గుర్తుచేశారు. రాజ్యాంగంలోని 170 (3) అధికరణాన్ని సవరించేందుకు వీలుగా ఒక ముసాయిదా క్యాబినెట్ నోట్‌ను తయారుచేసి కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ పరిధిలోని శాసన వ్యవహారాల విభాగానికి (ఇంటర్ మినిస్టీరియల్ కన్సల్టేషన్ డిపార్టుమెంట్)కు పంపామని గుర్తుచేశారు. ఈ ముసాయిదా నోట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26కు అనుగుణంగా మాత్రమే కాక ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని రెండవ షెడ్యూలుకు అనుగుణంగా ఉండేలా అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్యాబినెట్ నోట్‌ను పరిశీలించిన న్యాయ మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపి మరో రెండు ముసాయిదా బిల్లులను కూడా పంపాల్సిందిగా సూచించిందని వివరించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని రెండవ షెడ్యూలు ప్రకారం ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వు చేయాల్సిన అసెంబ్లీ స్థానాల సంఖ్యకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు ఆ రెండు ముసాయిదా బిల్లుల్లో పొందుపర్చాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వు చేయాల్సిన అసెంబ్లీ స్థానాల విషయంలో కొన్ని పూరించాల్సిన ఖాళీలు (సందేహాలు) ఉన్నాయని, వాటిని భర్తీ చేసి పంపించాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం సవరణ 2015 (రిమూవల్ ఆఫ్ డిఫికల్టీస్) ప్రకారం అసెంబ్లీ స్థానాల భౌగోళిక హద్దుల్లో కొన్ని వ్యత్యాసాలు, పరస్పర వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు లేఖలు రాసిందని వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆ లేఖలు రాసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం వివరణలు వచ్చాయని, తెలంగాణ నుంచి ఇంకా రావాల్సి ఉందని మంత్రి ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం లేవనెత్తిన సందేహాలను పరిశీలించినట్లయితే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన తర్వాత భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట (మూడూ ఎస్‌టి రిజర్వుడు) అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు తగ్గిపోవడంతోపాటు, భౌగోళిక విస్తీర్ణం తగ్గిపోయి సరిహద్దుల్లో మార్పు చోటుచేసుకుంది. ఇక్కడి ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైపోయిన తర్వాత ఈ మూడు నియోజకవర్గాల కూర్పుపై తెలంగాణ వివరణ ఇవ్వాల్సి ఉంది. వారం రోజుల క్రితమే వీటిని హోంశాఖకు పంపించినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం అధికారి ఒకరు తెలిపారు. అయితే కేంద్ర హోం మంత్రి తన సమాధానం లో మాత్రం ఇంకా జవాబు రాలేదని పేర్కొనడంతో మరికొన్ని రోజుల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా గతేడాది అక్టోబరులో ఎంపి వినోద్‌కుమార్ రాసిన లేఖలో హైకోర్టు విభజన అంశాన్ని కూడా ప్రస్తావించడంతో దానికి మంత్రి ఈ లేఖలో బదులిస్తూ, హైకోర్టు విభజన అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాయని పేర్కొన్నారు. హైకోర్టు పనిచేయడానికి వీలుగా తగిన మౌలిక సౌకర్యాలు, స్థలం, ఇతర వసతులు ఉన్నట్లయితే నిర్ణయం జరుగుతుందని పేర్కొన్నారు. ఇక న్యాయమూర్తుల కేటాయింపు విషయంలో ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల నుంచి ఇప్పటికే ఆప్షన్లను స్వీకరించామని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఆమోదం తెలిపారని, ఈ వివరాలన్నింటినీ హైకోర్టుకు కూడా తెలియజేసినట్లు మంత్రి పేర్కొన్నారు.