Home ఎడిటోరియల్ వెనిజులా అంతర్యుద్ధం

వెనిజులా అంతర్యుద్ధం

America against the Castro government

 

గత కాలపు సామ్రాజ్యవాద అమెరికా దాష్టీకాల నుండి చూసినప్పుడు మాత్రమే వర్తమానపు వెనిజులా పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఈ దృష్టి కోణం నుండి తర్కించినప్పుడు మాత్రమే ప్రస్తుత వెనిజులా అంతర్యుద్ధానికి సిసలైన కారణాలు మనకు నిజరూప దర్శనం ఇస్తాయి. సరిగ్గా ఆరు దశాబ్దాల క్రితం తన గుమ్మం ముందు ఒక సోషలిస్టు రాజ్యంగా క్యూబా ఆవిర్భవించడం మింగుడుపడకపోవడంతో 1959 లో క్యూబాపై ఆంక్షల వర్షం కురిపించి అనేక కష్టనష్టాలకు కారణమయింది. కాస్ట్రో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా అనుయాయులను రెచ్చగొట్టి వారికి ఆయుధాలను, శిక్షణను ఇప్పించి 1961లో తిరుగుబాటు చేయించింది. 1962 లో సోవియట్ యూనియన్ క్యూబా గడ్డ మీద దాని ఆత్మరక్షణకు సహకారంగా క్షిపణులను మోహరించడంతో అమెరికాలో పెద్ద ఎత్తున అమెరికా ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో తన ప్రయత్నాలను వెనక్కి తీసుకుంది. గతంలో ఎప్పుడో అంతరించి పోయింది అనుకున్న కమ్యూనిస్టుశక్తి సోషలిస్టు రాజ్యం గా వెనిజులా ప్రభుత్వం రూపంలో తన పెరట్లో పెరుగుతుంటే దాన్ని పెకలించుకుండా అమెరికా ఎలా ఉండగలదు?

నయానో భయానో ప్రపంచ దేశాలను తమ అదుపాజ్ఞల్లో పెట్టుకుని, తన అధికారాన్ని దౌర్జన్యాలను చలాయించడం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. కుదిరితే అదుపులో ఉంచుకోవడం, కుదరకపోతే ఆంక్షలతో అణగదొక్కడం అమెరికా నేర్చిన జగమెరిగిన అపురూప కళ. ప్రపంచ పోలీస్‌గా, ప్రపంచాన్ని శాసించి ఎదిరించే పెద్దన్నగా జగానికి సుపరిచితమే. ఈ క్రమంలోనే అమెరికాను ప్రపంచంలోనే ఏకైక అగ్రరాజ్యంగా నిలబెట్టేందుకు వీలైన ప్రభుత్వ విధానాన్ని, విదేశాంగ విధానాలను ఆ రాజ్యం సంతరించుకుందనడంలో సందేహం లేదు. అది ఎంత బలమైన రాజ్యమైనా, శాంతికాముక దేశమైనా అమెరికా విధానాలకు అందలం పట్టాల్సిందే..! కాని పక్షంలో ఇరకాటంలో పడాల్సిందేనని 1945 నుండి మనం చూస్తూనే ఉన్నాం.

అంతర్గత ప్రజాస్వామ్యం దెబ్బతిన్నదని, అదుపాజ్ఞలు లేని అణ్వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నదని వివిధ దేశాల ఆంతరంగిక ప్రజాస్వామ్య వ్యవస్థలోకి, ప్రభుత్వ విధానాలలోకి చెయ్యిపెట్టడం అమెరికాకు షరా మామూలే. ఈ క్రమంలోనే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా పెట్టుకోవడం, రష్యాను పద్దెనిమిది రాజ్యాలగా విడగొట్టినంతవరకు కంటి మీద కునుకు లేకుండా అలుపెరుగని కృషి చేయడం జరిగింది. ఇదే క్రమంలోనే అమెరికా ఖండం లో మధ్యస్త రాజ్యమైన బ్రెజిల్ ను తన అదుపులో పెట్టుకుని పూర్తిగా పీల్చిపిప్పి చేయడం జరిగింది. చివరకు నిరాదరణకు గురైన బ్రెజిల్ ప్రజలు ఉద్యోగ, ఉపాధి కోసం వలస వస్తుంటే గోడకట్టాలని అడ్డుకట్ట వేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం.

మధ్యాసియా, పశ్చిమాసియాలో చమురు నిల్వలుపై కన్నేసి వాటిపై ఆధిపత్యం చలాయించటం కోసం పథకం ప్రకారం అక్కడ ప్రదేశాలను తన గుప్పెట్లో పెట్టుకుంది. అడ్డుతగిలిన వారిని అదఃపాతాళానికి తొక్కింది. ఈ పథకంతోనే అంతర్గత ప్రజాస్వామ్యం, మానవ హక్కులు మంట కలిసిపోతున్నాయని ఇరాక్ అధ్యక్షుడు సద్దామ్ హుస్సేన్ను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టి తన పంతం నెరవేర్చుకుంది. లిబియా అధ్యక్షుడు కల్నల్ గడాఫీని కూడా మట్టికరిపించింది. ఇదే దృక్పథంతోనే సౌదీ అరేబియా, సిరియాలను తన అదుపులో పెట్టుకుంది. ఇదే విధానంతోనే ఇజ్రాయిల్, పాలస్తీనా వివాదాల మధ్య చొరబడి మధ్యవర్తిత్వం చేసి, ఇజ్రాయిల్‌కు కొమ్ము కాస్తుంది. అరబ్బుల పవిత్ర స్థలమైన జెరూసలేంను ఇజ్రాయిల్ కు కట్టబెట్టి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఇజ్రాయిల్ చొరబాట్లకు అంతర్జాతీయ న్యాయ సంబంధ అంగీకారాన్ని కూడా కూడబెట్టి తన పోలీస్ పెత్తనాన్ని చూపించింది.

మధ్యలో తన ఆధిపత్యానికి అడ్డు వస్తుందని, గొంతు లో అడ్డం పడుతుందని ఇరాన్ పై ఆంక్షలు విధించి ఆయిల్ ధరలు తగ్గించింది. బేరల్ 132 డాలర్ల నుంచి 63 డాలర్లకు తగ్గించింది. చమురు ఎగుమతులపై ఆధారపడిన ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం చేయడం తన అహేతుకమైన దౌత్య విధానంలో భాగంగానే మనం గుర్తించాలి. అంతర్జాతీయంగా అనేక దేశాలకు బిలియన్ డాలర్ల విలువ చేసే యుద్ధ సామాగ్రిని ఎగుమతి చేస్తున్న అమెరికా, అణ్వస్త్రాలు తయారు చేస్తుందన్న నెపంతో ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించడం తన ధృతరాష్ట్ర నీతికి నిదర్శనంగా మనం భావించాలి. ఇంకా అనేక దేశాలను తన బెత్తంతో అజమాయిషీ చేసి కళ్లల్లో పెట్టికోవడమో, కాళ్ళకింద తొక్కిపెట్టడమో చేస్తుండడాన్ని గత ఏడున్నర దశాబ్దాలుగా మనం గమనిస్తూనే ఉన్నాం.

గత కాలపు సామ్రాజ్యవాద అమెరికా దాష్టీకాల నుండి చూసినప్పుడు మాత్రమే వర్తమానపు వెనిజులా పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఈ దృష్టికోణం నుండి తర్కించినప్పుడు మాత్రమే ప్రస్తుత వెనిజులా అంతర్యుద్ధానికి సిసలైన కారణాలు మనకు నిజరూప దర్శనం ఇస్తాయి. సరిగ్గా ఆరు దశాబ్దాల క్రితం తన గుమ్మం ముందు ఒక సోషలిస్టు రాజ్యంగా క్యూబా ఆవిర్భవించడం మింగుడుపడకపోవడంతో 1959 లో క్యూబా పై ఆంక్షల వర్షం కురిపించి అనేక కష్టనష్టాలకు కారణమయింది. కాస్ట్రో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా అనుయాయులను రెచ్చగొట్టి వారి కి ఆయుధాలను, శిక్షణను ఇప్పించి 1961లో తిరుగుబాటు చేయించింది.

1962 లో సోవియట్ యూనియన్ క్యూబా గడ్డ మీద దాని ఆత్మరక్షణకు సహకారంగా క్షిపణులను మోహరించడంతో అమెరికాలో పెద్ద ఎత్తున అమెరికా ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో తన ప్రయత్నాలను వెనక్కి తీసుకుంది. గతంలో ఎప్పుడో అంతరించి పోయింది అనుకున్న కమ్యూనిస్టుశక్తి సోషలిస్టు రాజ్యం గా వెనిజులా ప్రభుత్వం రూపంలో తన పెరట్లో పెరుగుతుంటే దాన్ని పెకలించుకుండా అమెరికా ఎలా ఉండగలదు? దానిని వదిలేసి తన ఆధిపత్యాన్ని ఎలా నిరూపించుకోగలదు? అందుకే వెనిజులా సైన్యాన్ని రెచ్చగొట్టి అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వాన్ని కూలదోయాలని అనుకుంది. కానీ పంతం నెరవేరలా! సైన్యం అమెరికా ఆలోచన తిప్పికొట్టింది.

ప్రభుత్వానికి బాసటగా నిలిచింది. అంతటితో ఆగకుండా అధిక మెజారిటీ ఉన్న ప్రతిపక్షాన్ని పావుగా వాడుకుని రెచ్చగొట్టింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం పార్లమెంట్ స్పీకర్ గయిడో తనకు తాను అధ్యక్షుడిగా జనవరి 23న ప్రకటించుకున్నాడు. బహిరంగంగా ప్రమాణబ స్వీకారం కూడా చేశాడు. అయితే అప్పటికే మదురో ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో ప్రమాణ స్వీకారం చెల్లదని కోర్టు తేల్చింది. అయినప్పటికీ గయిడోనే ఆ దేశ అధ్యక్షుడిగా గుర్తించాలని అమెరికా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టింది. అంతర్జాతీయంగా తన దౌత్య దేశాలన్నింటికీ గయిడోనే వెనుజులా అధ్యక్షుడిగా గుర్తించాలని చెప్పింది. వెనిజులా ప్రజలు, సైన్యం దీనిని అంగీకరించక మదురో వైపు నిలబడ్డాయి. దేశ రాజధాని అయిన కారకస్‌లో పెద్ద ఎత్తున ర్యాలీ తీసి అమెరికా విధానాలను వ్యతిరేకించాయి. తన పంతం నెరవేరలేదని కన్నెర్ర చేసి ఎప్పటిలాగే ఆంక్షల కత్తిని ఝళిపించింది. జనవరి 28 నుండి ఆంక్షలు అమలుకు తెర తీసింది. సుమారు 95 శాతం చమురు ఎగుమతులపై ఆధారపడిన వెనిజులా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమయింది.

ప్రజలకు, చిన్న పిల్లలకు ఆహారం ఔషధాలు కరువయ్యి ఎంతో మంది మరణించారు. రెండు బిలియన్ల డాలర్ల ఔషధాలు దిగుమతి అడ్డుకుని 40 వేల మంది మరణాలకు ప్రత్యక్షంగా, మూడు లక్షల మంది ప్రజల అనారోగ్యానికి పరోక్షంగా కారణమైంది. సుమారు ఆరు బిలియన్ డాలర్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ప్రతి ఏటా 11.35 బిలియన్ డాలర్ల ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకునేది అది ప్రస్తుతము 2.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

ప్రజలు తిండిలేక అష్టకష్టాలు పడుతున్నారు. చైనా, రష్యా దేశాలు ఆదుకోవడంతో పరిస్థితి అంతంత మాత్రంగా చక్కబడుతుంది. అయితే ప్రస్తుత కాలంలో వెనిజులా కానీ, గత పరిస్థితుల్లో ఇంకే దేశమైనా కానీ అమెరికా వంటి అగ్రరాజ్యాల చెప్పుచేతల్లో నలిగిపోయి ఆ దేశ ఏకచ్ఛత్రాధిపత్యానికి పావులుగా మారడం చరిత్రలో మనం చూస్తూనే ఉన్నాం. ఈ సామ్రాజ్యవాద పెత్తందారీ విధానాలను ఏడున్నర దశాబ్దాలుగా ప్రపంచం గమనిస్తూనే ఉంది. ఈ పరిస్థితుల నుండి ప్రపంచ దేశాలు నేర్చుకోవలసిన పాఠం ఏమిటి? ప్రపంచ దేశాలు తమ ఆత్మరక్షణకు అనుసరించాల్సిన విధానాలు ఏమిటి? అని ప్రశ్నించుకోవలసిన అవసరం చాలా ఉంది. అలా ప్రశ్నించకోకపోతే మూడు చేపల కథలో మందమతి లాగా అగ్రరాజ్యాల దోపిడీలో అందరమూ కొట్టుకుపోతాం. ఈరోజు వెనిజులా కానీ, భవిష్యత్తులో మరేదైనా దేశం కానీ అగ్రరాజ్యాల చేతులో మగ్గిపోవాల్సిందేనా? ఆ దేశాల విధానాలకు అడుగడుగునా వంత పడాల్సిందేనా? ప్రపంచ దేశాల ఐక్య శాంతి మంత్ర నినాదాలతో ఏర్పడిన ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా అగ్రరాజ్యాల నీడలో నడవాల్సిందేనా?

ప్రపంచంలో ప్రతి దేశం ఎన్నో త్యాగాలకు ఒడికట్టి తమ దేశాలకు స్వాతంత్రాన్ని, సార్వభౌమాధికారాన్ని సంపాదించుకున్నాయి. ఈ స్వాతంత్య్ర సంపాదనా క్రమంలో ఎంతో జనబలాన్ని మరెంతో ఆర్థిక బలాన్ని పోగొట్టుకున్నాయి. ఇన్ని త్యాగాలకు నిదర్శనమైన సార్వభౌమాధికారాన్ని అగ్రరాజ్యాల విధానాలకు పెత్తందారీ దోపిడీకి బలైతున్న తరుణంలో ప్రపంచ దేశాలు సంఘటితంగా నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి దేశం తమ సామాజిక, ఆర్థిక, సహజ సంపదలు సామ్రాజ్యవాదపు ఉక్కు సంకెళ్లలో చిక్కుకొని పోతుంటే దాని నుండి బయటపడి సర్వసత్తాక రాజ్యాలుగా తమ తమ మనుగడ కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయా దేశాలపై ఉంది. ప్రజల ఆర్థిక, సామాజిక, స్వేచ్ఛలను పెత్తందారులకు ధారాదత్తం చేస్తే ప్రపంచ దేశాల మనుగడ ప్రమాదంలో పడే పరిస్థితి వాటిల్లుతుంది. ఇదేగాని జరిగితే ప్రతి దేశం తమ మనుగడ కోసం ఇతర రాజ్యాలతో పోరాటం చేసే పరిస్థితులు సంభవిస్తాయి. భవిష్యత్తు తిరోగమనం చెందుతుంది. ప్రపంచ యుద్ధాలు సంభవించే పరిస్థితి వస్తుంది. అణచివేత ఉన్న దగ్గర స్వేచ్ఛా, స్వాతంత్రాలు అంతరించిన దగ్గర పోరాటాలు యుద్ధాలు జరుగుతాయని గత చరిత్ర మనకి చెబుతుంది. ప్రపంచంలో ఆధిపత్య ధోరణి కలిగిన పెత్తందారీ దేశాలను తిప్పికొట్టడానికి మిగిలిన దేశాలు సంఘటితంగా నడవాలి.

అగ్రరాజ్యాల అధికారులకు, ఆధిపత్యాలకు దూ రంగా ఒక స్వతంత్ర విధానాన్ని అవలంభించాలి. అందుకు “నెహ్రూ, మార్షల్ టిటో, నాజర్‌” వంటి మేధావులు సూచించిన అలీన విధానం ఎంతగానో తోడ్పడుతుంది. రెండు ప్రపంచ యుద్ధ్ధాలను చవిచూసిన తర్వాత ప్రపంచ దేశాలను అగ్రరాజ్యాల చెర నుండి విడిపించి, ప్రతి దేశం తనకు తానుగా మనుగడ సాగించగల సామర్ధ్యం కల్పించి, మరో ప్రపంచ యుద్ధం రాకుండా చేయగలిగిన స్వతంత్ర విధానమే అలీన విధానమంటే..! ప్రతి దేశం తమకు తాముగా స్వతంత్రంగా ఉండడానికి, అభివృద్ధి పథంలో నడవడానికి అన్ని దేశాల మధ్య పరస్పర సహకారానికి అలీన విధానం ఒక అద్భుతం మంత్రం ఉపయోగపడింది. అటువంటి అలీన విధానాన్ని రూపొందించడంలో పెద్దన్న పాత్ర పోషించిన దేశం మన భారతదేశం.

కానీ అటువంటి స్వతంత్ర విధానాన్ని పక్కన పెట్టి అమెరికా వంటి సామ్రాజ్యవాదుల విధానాలకు తలొగ్గి నడుచుకోవడం భారతదేశానికి ప్రాణ సంకటం వంటిది. ఇప్పటికైనా మన పాలకులు అలీన విధానాన్ని తెర మీదకు తెచ్చి, అన్ని దేశాలను సమ్మిళితం చేసి, ప్రపంచ దేశాల అస్తిత్వాన్ని కాపాడడానికి పూనుకోవాలి. ప్రతి దేశం కూడా అగ్రరాజ్యాల ఆధిపత్య ధోరణి నుండి బయటపడి అలీన రాజ్యాలుగా అభివృద్ధి చెందిననాడు ఒక దేశంపై మరో దేశం అధికారాలుగాని, ఆంక్షలుగాని ఉండవు. అటువంటి సందర్భంలోనే వెనిజులా వంటి అంతర్యుద్ధాలు భవిష్యత్తులో కనబడకుండా నివారించవచ్చు. ప్రపంచంలో అన్ని దేశాలు అలీన విధానం లాంటి పరస్పర సహకార స్వేచ్ఛ, సౌభ్రాతృత్వ విధానాలను పాటించిననాడు “ఒక మనిషిని -మరో మనిషీ, ఒక జాతిని -వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం” సమసిపోతుంది.

America against the Castro government