Home తాజా వార్తలు విదేశీ నిధులు, రూపాయి కీలకం

విదేశీ నిధులు, రూపాయి కీలకం

Stock markets

లాభాల స్వీకరణతో స్వల్పకాలిక అస్థిరతలు
ఈ వారం మార్కెట్‌పై నిపుణులు

ముంబై: వచ్చే వారాల్లో లాభాల స్వీకరణ వల్ల దేశీయ ఈక్విటీ మార్కెట్లలో స్వల్పకాలిక అస్థిరత కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లపై నిర్ణయాలు, ఇతర అంశాలు సూచీలపై ప్రభావం చూపనున్నాయి. అయితే విదేశీ పెట్టుబడుల ప్రవాహం, రూపాయి విలువ పటిష్టం వంటివి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు సానుకూలంగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, అమెరికా, చైనా వాణిజ్య వివాద పరిష్కార చర్చలు, దేశీయంగా ఎన్నికలపై అంచనాలు వంటివి కూడా స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయగలవని విశ్లేషకులు వివరిస్తున్నారు. ‘లార్జ్ క్యాప్ సూచీలు కన్సాలిడేటెడ్‌లోకి వెళ్లి ఊపిరి పీల్చుకుంటాయి.

ఇక వచ్చే సెషన్లలో మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ పెరిగే అవకాశముంది’ అని ఎడిల్వీస్ వెల్త్ మేనేజ్‌మెంట్ ప్రతినిధి సాహిల్ కపూర్ అన్నారు. ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత దేశీ స్టాక్ మార్కెట్లు జోష్‌తో ముందుకు సాగుతున్నాయి. ఈ వారం అమెరికా ఫెడ్ నిర్ణయాలు కూడా ఉత్సాహం ఇవ్వనున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. గురువారం(21న) హోళీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు, దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. దేశీయంగా లోక్‌సభ ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. పలు రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధుల జాబితాలను ప్రకటిస్తున్నాయి. దీంతో ఎన్నికల వేడి పెరగనున్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో కరెంట్ ఖాతా లోటు(క్యాడ్) గణాంకాలు 19న విడుదలకానున్నాయి. క్యూ2లో క్యాడ్ 19 బిలియన్ డాలర్లు నమోదవగా, ఇది జిడిపి(స్థూల దేశీయోత్పత్తి)లో 2.9 శాతానికి సమానం. దీంతో క్యాడ్ గణాంకాలు కొంతమేర సెంటిమెంటును, రూపాయిని ప్రభావితం చేసే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.

అంతర్జాతీయ అంశాల ప్రభావం

ఫిబ్రవరిలో అమెరికా ఉపాధి గణాంకాలు 2017 సెప్టెంబర్ తరువాత కనిష్టానికి చేరాయి. తాజాగా విడుదలైన ఫిబ్రవరి తయారీరంగ గణాంకాలు వరుసగా రెండో నెలలోనూ అంచనాలను చేరలేకపోయాయి. ఈ వారం పాలసీ సమీక్షను చేపట్టనున్న ఫెడరల్ రిజర్వ్ జాగ్రత్తగా నిర్ణయాలు చేపట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది వడ్డీ రేట్ల పెంపు విషయంలో వేచిచూసే ధోరణిని అవలంబించే వీలుందని అంచనా వేస్తున్నారు. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ రెండు రోజుల పాలసీ సమావేశాలు 19న ప్రారంభమై 20న ముగియనున్నాయి. ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేట్లు 2.25-2.5 శాతంగా అమలవుతున్నాయి. ఈసారి సమీక్షలో యథాతథ రేట్ల అమలునే ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రకటించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇది దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ నివ్వగలదని చెబుతున్నారు. కొద్ది రోజులుగా దేశీయ మూలధన మార్కెట్లో ఎఫ్‌పిఐ(విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు) పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే అంతర్జాతీయంగా అమెరికా, చైనా వాణిజ్య వివాద పరిష్కారంపై సానుకూలతలు కనిపిస్తున్నాయి. వచ్చే రోజుల్లో ఎలా ఉండనుందో వేచిచూడాలి.

American Federal Reserve decisions on interest rates