Home తాజా వార్తలు ఐపిఎస్‌లు దేశాభివృద్ధికి పాటుపడాలి: అమిత్‌షా

ఐపిఎస్‌లు దేశాభివృద్ధికి పాటుపడాలి: అమిత్‌షా

Amit-Shah

మనతెలంగాణ/హైదరాబాద్ : ఐపిఎస్ సాధించగానే ఆశయం నెరవేరినట్టు కాదని నిజాయితీగా పనిచేసి దేశాభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. సర్ధార్‌వల్లభాయ్‌పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శనివారం జరిగిన 70వ బ్యాచ్ ఐపిఎస్ ప్రొబేషనర్స్ పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి హోం మంత్రి అమిత్‌షా ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు కేవలం ఐదేళ్లుమాత్రమే అధికారంలో ఉంటారని అదే పోలీసులు దాదాపు 30 ఏళ్లపాటు సర్వీసులో ఉంటారన్నారు. పేదల తరపున నిలిచి వారికి న్యాయం చేసేందుకు పోలీసులు కృషి చేయాలని అన్నారు. పోలీసులు మనసు చెప్పినట్టు నడుచుకోవాలని అయితే రాజ్యాంగ స్పూర్తి దెబ్బతినకుండా వ్యవహరించాలని సూచించారు. దేశ భద్రతలో రాజీపడకుండా 30వేలకు పైగా అమరులయ్యారని, వారి బలిదానాలు మరవకూడదన్నారు. దేశం ప్రస్తుతం అంతర్గతంగానూ, బహిర్గతంగానూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, ఉగ్రవాదం ఒకవైపు, మాదక ద్రవ్యాలు, సైబర్ క్రైం మరోవైపు సవాళ్లు విసురుతున్నాయన్నారు. ఇరుగు పొరుగు దేశాల నుంచి సైతం సమస్యలు పొంచి ఉన్నాయని పేర్కొన్నారు.

పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా అందరితో సమన్వయం చేసుకుంటూ మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఈ వేడుకలో ప్రొబేషనర్స్ కవాతును పరిశీలించి , ఉత్తమ పనితీరు కనబరిచిన ప్రొబేషనర్లకు అమిత్‌షా బహుమతి ప్రదానం చేశారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం కోసం సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. స్వదేశీ సంస్థానాల విలీనంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. పోలీస్ సేవలు ఎక్కడ ఉంటే అక్కడ సర్థార్‌పటేల్ ఉంటారని అన్నారు సర్వీసుల రూపకల్పనలోనూ పటేల్ కీలక పాత్ర పోషించారన్నారు. సమాజంలోని పేదల అభ్యున్నతి కోసం పాటుపడాలని ఆయన అభిలషించేవారన్నారు. అనేక దశాబ్దాలుగా సమస్యగా మారిన జమ్మూ, కశ్మీర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ విముక్తి కల్పించిందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుచేసి అక్కడి అభివృద్ధికి తమ ప్రభుత్వం బాటలు వేస్తోందని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో పటేల్‌ఆశయం నెరవేరిందని చెప్పారు. ప్రధాన మంత్రి మోదీ స్వార్ట్ పోలీస్ మంత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలని కొత్త ఐపిఎస్ అధికారులకు హోంమంత్రి అమిత్‌షా సూచించారు. యువ అధికారులు అత్యంత అంకితభావంతో దేశానికి సేవ చేయడం ద్వారా భారతీయ పోలీసు సేవల విశిష్ట సంప్రదాయంలో భాగస్వాములు కావాలని కోరారు.

మొత్తం 103 మంది అధికారుల్లో 15 మంది మహిళా అధికారులు, ఆరుగురు రాయల్ భూటాన్ పోలీసులు, ఐదుగురు నేపాల్ పోలీస్ సర్వీస్ అధికారులున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఐపిఎస్ అధికారుల నుంచి అమిత్‌షా గౌరవ వందనం స్వీకరించారు. ఈ బ్యాచ్‌లో మొత్తం 92 మంది ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ బ్యాచ్ నుంచి తెలుగు రాష్ట్రాలకు ముగ్గురు చొప్పున ఐపిఎస్‌లను కేటాయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్రహోంమంత్రి మహమూద్‌అలీ, తెలుగు రాష్ట్రాల డిజిపిలు మహేందర్‌రెడ్డి, గౌతంసవాంగ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతురామ్మోహన్, జాతీయ పోలీసు అకాడమీ మాజీ డైరెక్టర్లు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కోర్సును పూర్తి చేసిన ఐపిఎస్ ప్రొబేషననరీ అధికారులల పరేడ్‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు ఐపిఎస్ అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
దేశంలో సివిల్స్ ప్రవేశపెట్టింది సర్ధారే
దేశంలో తొలిసారిగా సివిల్స్ పరీక్షలను ప్రవేశ పెట్టింది సర్దారేనని, సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్న నేషనల్ పోలీస్ అకాడమీకి రావడం చాలా సంతోషంగా ఉందని అమిత్‌షా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్దార్ పటేల్ కృషిని స్మరించుకుంటూ అమిత్ షా నివాళులు అర్పించారు. ఐపిఎస్ శిక్షణ పూర్తి కాగానే మీ లక్ష్యం పూర్తి అయినట్టు కాదు. లక్ష్య సాధన ఇప్పుడే ప్రారంభం అయ్యింది. దేశం కోసం చెయ్యాల్సింది ఇంకా ఉందన్నారు. ప్రతిరోజు మీరు ప్రతిజ్ఞను గుర్తు చేసుకుంటూ ఐపిఎస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించాలని అమిత్ షా సూచించారు. దేశంలో ఎక్కడ విధుల్లో ఉన్నా ప్రతి ఒక్కరి సమన్వయంతోనే విజయం సాధించగలరని అమిత్ షా తెలిపారు. ప్రధాని మోదీ స్మార్ట్ పోలీస్ మంత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లడంతో పాటు ఐపిఎస్‌లు, ఉన్నతాధికారులు పేదరికాన్ని పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు కృషి చేయాలన్నారు. “హైదరాబాద్‌ను భారత్‌లో కలపడానికి నిజాం ఒప్పుకోలేదని సర్దార్ వల్లభాయ్ పటేల్ దాన్ని పరిపూర్ణం చేశారు” అని అమిత్ షా తెలిపారు.
ఐపిఎస్‌లకు క్రమ‘శిక్షణ’ ఇచ్చాం : అకాడమీ డైరెక్టర్ అభయ్
యువ ఐపిఎస్ అధికారులకు బేసిక్ ట్రైనింగ్‌తో పాటు ప్రొబేషనర్లకు అన్ని రకాల శిక్షణలు ఇచ్చామని జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభయ్ పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా ఐపిఎస్ ప్రొబేషనర్లకు రకరకాల ఆయుధాల వాడకం తెలుసుకున్నారన్నారు. సెమినార్లు, వర్క్‌షాపులు, సదస్సులు నిర్వహించి అనేక అంశాలపై అవగాహన కల్పించామన్నారు. అలాగే విదేశీ పోలీసింగ్ ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ప్రొబేషనర్లను సింగ్‌పూర్ తీసుకెళ్లామని డైరెక్టర్ అభయ్ చెప్పారు.

Amit Shah attends passing out parade of IPS probationers